మిహీరకులునకంతలో మరియొక భావము కల్గినది. ఆమె వ్యతిక్రమించినను సైరింతునన్న వాగ్ధానము గావించెను. ఆమె చేసిన అంతఃపుర మర్యాదోల్లంఘమునకు తగిన యవమానము మాత్రమే చేసి పంపవలెనని తలచెను. ఆమె కవచమును, శిరస్త్రాణమును యుద్ధ సమయమున తొలగించి పురుషుడు కాడనియు స్త్రీయనియు రాణియనియు సభాసదులయెదుట నిరూపించి యవమానింపదలచెను. కవచమును తొలగించిన తరువాత నామెను పలువురి యెదుట కౌగలింపవలెనని కూడా దలచెను. తన భార్యను తానే అవమానించి సంతోషింపవలెనని తలచిన రాజు క్రూరుడు దుష్టుడు మాత్రమే గాక మూర్ఖునిగా కూడా కన్పట్టును. ధర్మమును పరిహసించుట తన ప్రకృతియని పలికి నీ శిరస్త్రాణము దొలగించి నిన్ను పరిహాస భాజనము చేసెదను అనెను.
ఖడ్గము బూని మిహీరకులుడవ్యవధికముగా కళ్యాణవతి పైకి లంఘించెను. ఆమె మెరుపువలె తప్పుకొనెను. ఇరువురును కత్తి యుద్ధము చేసిరి. అతనికొకటియే ధ్యాస ! శిరస్త్రాణమును తొలగించి కేశపాశమును బహీర్గతము చేయవలెనన్నది. ఆమెకతని నోడించుట యందే ధ్యాస. అతడామె శిరస్త్రాణమును తొలగించుట కాదుగదా స్పృశించుటకు కూడా వీలులేనంత శరవేగమున నామె కత్తిని ఝుళిపించుచున్నది. కొంత సమయము చగుచుసరికాతనికామెను జయింపలేనని తెలిసినది. అతడు యుధ్ధమును విరమించెను. ఆమె తన రహస్యమును కాపాడుకొనుటలో విజయమందుటయే గాక కొంత వరకు రాజు మనసును మార్చగల్గినది. కాని ఇది తాత్కాలిక ప్రయోజనమే అయినను ప్రయత్నము చేయుట యన్న ప్రధమ కర్తవ్యము నామె పాటించినది. సభాసదులెవ్వరూ తానెటు పోవుచున్నదో గమనింపరాదన్న నియమమును పెట్టి యంతఃపురమునకు వెడలిపోయినది.
ఈ సంఘటనముతో కళ్యాణవతి యొక్క ధర్మప్రవృత్తియును స్వతంత్ర ప్రవృత్తియును ప్రజాభిమానమును వెల్లడి యగుటయే గాక కళ్యాణవతి ప్రాణములు రాజు చెంత క్షేముముగ నుండనను యనుమానము బహిర్గతమైనది. కొలది మాత్రపు పొరపాటునకైన రాజు తన ప్రాణమును తీయుటకు వెరవడని నమ్మిన రాణి, రాజునకు కూడ ప్రాణముల విలువ యెరిగించినట్లయినది. అతని కత్తి కెదురాడగల శక్తి యాతని భార్యకు మాత్రమే యుండెనని కూడ వెల్లడియైనది. కళ్యాణవతి తానుబలను కానని నిరూపించుకొనుటకు నిష్కంటకుని వధను సాధనముగ చేసికొన్నది. రాజుతో బలాబలములు చూచుకొనవలెనన్నచో నామె కంతఃపురమున తగుయవకాశముండదు. భార్యతో యుద్ధము చేయటకతడంగీకరింపక పోవచ్చును. రహస్యముగ చేయుదమని యతడనవచ్చును. రహప్యయుద్ధము కేళీవిలాసముగ నుండునే గాని యథార్ధ యుద్ధము కాబోదు. సర్వప్రతాపమును వెల్లడించుటకవకాశముండదు. శృంగార పర్యవసాయి గావచ్చును. ఇన్ని విషయములను యోచించిన కళ్యాణవతి మిహిరకులునితో సభామధ్యమున మంత్రులు, రాజ్యాంగవేత్తలు, ధర్మనిర్ణయాధికారులు యుద్ధ విద్యానిపుణులు చూచుచుండగా యథార్ధ యుద్ధమున తన పరాక్రమ నిరూపణమును గావించినది. ఇది రాజునకొక హెచ్చరికవంటిది. తనని చంపుట తేనికకాదని తెలియజేయుట. అంతవరకును మిహీరకులుని హింసాత్మక చర్యలకు తండ్రితో సహారాజ్యాంగ వేత్తలందరును మిన్నకుండిరి. కాని తానట్లు మిన్నకుండనని సువ్యక్తము గావించినది కళ్యాణవతి చర్య. రాజామె కౌశలమునకు వెరగుపడెను. ఒక సున్నిత ప్రవృత్తి యతనిలో మేల్కొని నిష్కంటకుని కుమారుడగు కృతజ్ఞునునకు నగరాధ్యక్ష పదవిని లభింపజేసినది. మిహిరకులుడు తనలో నున్న క్రూరప్రవృత్తిని కొంతకాల మడచి యుండెను. ఆ సమయుమున భారతదేశము పైకి మ్లేచ్చలు దాడి వెడలుచుండిరి. మిహిరుని కిరాతక ప్రవృత్తి మ్లేచ్చల వైపునకు మరలినది. వారలను చిత్రవిచిత్రములుగా వధించనప్పుడు వారు ప్రాణోత్ర్కమణ వేళల చేయుహాహా కారములను పరమానందముతో శ్రవణ పేయముగ వినుచు సంతుష్టుగడు చుండెడివాడు. ఈ ఘాతక చర్యలను రాజ్యములో గాక సరిహద్దు ప్రాంతములలో జరుగుచుండుట చేతను న్యాయముగ మ్లేచ్చల దాడి యణచవలసి యుండుట చేతను మిహీరుని క్రౌర్యమంతయు వెల్లడిగాక పోవుట చేతను కళ్యాణవతికి రాజు మార్గమున కవరోధము కల్గించుటకు తగిన యవకాశము లేకపోయినది. అయినను ఒకసారి మార్చుటకు ప్రయత్నము చేసినది. కొలది ఫలితము లభించినది. పలుమార్లు చేసిన ప్రయోజన ముండక పోగా విపరీత ఫలితము నీయవచ్చును.
కళ్యాణవతి తండ్రికి పుత్రులు లేరు. గాంధారరాజు వృధ్ధుడయ్యెను. మ్లేచ్చల వల్లను, అంతః కల్లోలముల వల్లను రాజ్యమల్లకల్లోలమైనది. కళ్యాణవతి తానుపోయి తండ్రి రాజ్యమును సుస్థిరమొనర్చి మరల వత్తునని మిహీరకులునితో నన్నది. ఆమెకు తాను శౌర్యవంతురాలినని తెలియుటచే భర్తను, పోయి రాజ్యరక్షణమును చేయమని కోరలేదు. యుద్ధవిశారద కావుననే ఆత్మవిశ్వాసముతో తానే గాంధార రాజ్యరక్షణము చేతునన్నది. మిహీరకులునకీ మాటలతో పౌరుషము హెచ్చి తన భార్య యుద్ధభూమి కరగుటయా యని సైన్యముతో వెడలి దేశము నలుమూలల యున్న మ్లేచ్చలను వారలతో సంబంధ బాంధవ్యములను పెట్టుకొనిన భారతీయ స్త్రీ బాలవృద్ధులను పురుషులను దయాదాక్షిణ్య రహితుడై ఖండఖండముటుగ నరికించెను. కొండలపై నుండి దొర్లించెను. అంకుశములతో పొడిపించెను. కళ్యాణవతి మిహీరకులుని హింసాప్రవృతి మానమని చెప్పుటకు ప్రయత్నము చేసినది కాని చెప్పుటికు వలను పడలేదు. ఒకనాడు మిహీరుడు జపసమయమున నుండగా అతని యొడలతనికి తెలియనంత తదేకధ్యాన సమయున, అతని వదనము వికృతాకృతి నంద మొదలిడినది. కోరలు పుట్టినవి. నఖములు పెరిఇ వాడిగ కనుపించినవి. ఆమెకాసమయమున భర్తయను నేమియో తెలిసినది. అతని హింసాప్రవృత్తిలోని రహస్యము కూడ తెలిసినది. మిహీరుని ప్రవత్తి యెంత రాక్షసమో తీవ్రతరమో యాతని జపతపాదులు కూడ నంతటి తీవ్రతరములు. అతడు భజించినది యలకారులగు యమభేతాళురను, కావుననె తానపర యముడిననియు యముడు తన సహకారమును కోరెననియు పల్కుచుండెడివాడు. ఈ భయంకరాకృతి చూచిన రాణికి మనసులో నతని యందు గల స్నిగ్థతాభావమునకు కొంత యవరోధము వాటిల్లినది.
మిహీరకులుడు జ్యోతిశాస్త్రవేత్తల యభిప్రాయము ననుసరించి మిహీరేశ్వర దేవాలయమును నిర్మింపజేసెను. శిఖరస్థాపన సమయమున నెవ్వరు పీటలపై కూర్చొని సంకల్పము చేయుదురో వారి కనతి కాలముననే మృత్యువు ప్రాప్తించును. మిహీరకులుడు కళ్యాణవతి తల్లిదండ్రుల నందులకు పురిగొల్పెను. వృద్ధులగువారు కూడ దైవకార్యము ముందు ప్రాణములు తీసి కట్టుగ నెంచిరి. కళ్యాణవతి తల్లిదండ్రలు మరణించగా మిహీరకులుడానందమునే పొందెను. ఎందుచేతననగా పరుల దుఃఖమునకు బాధను చూచి యానందయునందుట యతని స్వభావములో నున్నది గనుక భార్య దుఃఖమునకు కూడా నానందించెనని యనవలెను. కాని మరల భార్య నొదార్చుటకు వెడలెను. ఆమె దుఃఖమాతనిని చూచుటతోడనే క్రోధము, ద్వేషములతో రెట్టింపుగ వెల్లుబికినది.నేను క్షీరసాగరమున జన్మించి కాకోలమును పొందితి నన్నది. భర్తను దూషించి ప్రయోజనము లేదని గ్రహించినది.
కళ్యాణవతికి మిగిలిన యాశ యొక్కటే అదియే పుత్రరూపమున ప్రతి ఫలించినది. ఆ పుత్రునిపై తండ్రి ప్రభావము పడకుండ జాగ్రత్తపడినది. కుమారుడు సాధుమగునట్లును దయాదాక్షిణ్యములు కలుగునట్లును పెంచినది. కత్తి యుద్ధము రాజనీతితోపాటు వేద శాస్త్ర పురాణేతిహసములను నేర్పించినది. వీటి ప్రభావముతో నతడు సహజమార్దవ హృదయము కలిగి తల్లి కంటికి చల్లగా ప్రకాశించెను. గాంధార రాజు పెంచుకొనిన కుమారుని కూడ తన కుమారుని వలెనె జాగ్రత్త కాపాడుకొన్నది. తమ్మునకు క్లిష్టసమయములో తగిన సలహాల నొసగదు సాయపడుచుండెను. అక్కగారితనికి సాక్షాతీ క్షీరసాగర కన్యకాగా నతడమృతాంశుడై కళ్యాణవతి కండదండలుగా నుండెను. సోదరికి తన రాజ్యములో కొంత భాగము నిచ్చెను. తమ్ముడు చనిపోగా నతని కూమారుడుగ గోవర్థనుడు తండ్రియడుగు జాడలలోనే నడచెను. గోవర్థునుని రాజ్యభారమును కూడ కళ్యాణవతియే భరించుచుండెను. తమ్ముడు తనకిచ్చిన రాజ్యములో తనకు కొంత సైన్యము నేర్పాటు చేసికొని తన యధీనమున నుంచు కొన్నది. ఇట్లు సైన్యము నేర్పాటు చేయుటతో కళ్యాణవతి తనకు తన భర్తకు నెప్పుడైన భిన్నాభిప్రాయము లేర్పడవచ్చునని భావించి యాతని నెదుర్కొనుకు సంసిధ్ధయైనది.
గాంధార రాజ్యములోగల చంద్రకుల్యానది తరచుగ వరద వెల్లువలను వెడల గ్రక్కుచు దేశమును ముంచెత్తుచుండెను. అందుచేత మిహీరకులుని యాధ్వర్యమును కాల్వలు త్రవ్వసాగిరి. ఈ కార్యము మధ్యలో నుండగ త్రవ్వకమునకొక శిల యడ్డము వచ్చినది. దానిని వేయిమంది మనుజులు కలసి కూడా కదల్చలేక పోయిరి. మిహిరకులుని స్వప్న గురువు స్వప్నమున కానుపించియా శిల నొక పతివ్రత తాకిన కదులునని చెప్పెను. అందుచేత మిహీరకులుడు దేశములోనున్న లక్షలాది సామాన్య గృహిణులను పిలిపించెను. వారందరు నా శిలను తాకినను ప్రయోజనము కలుగలేదు. తరువాత అంతఃపుర స్త్రీలచేతను రాజకుంటుంబములో నున్న స్త్రీల చేతను తాకించిన కూడ ప్రయోజనము లేకపోయినది. ఇట్లు జరుగుచున్నపుడు ప్రతీ స్త్రీ యొక్కయు భర్త, తన భార్య పతివ్రత కాదనియు దుశ్శీలయనియు భావింపదొడగిరి. రాజోద్యోగులు తలల నెత్తుకొనలేకపోయిరి. అందరికన్న చివరకు రాణియైన కళ్యాణవతి వంతు వచ్చినది. ఆమె ముందుగనే తాను తాకినను శిల కదలదని పలికి ముట్టుకొనినది. ఆ శిల కట్లే చలనము కలుగలేదు. ఆమె తాకినను శిల కదలక పోవుటచే నంతకు ముందు తాకిన స్త్రీలును వారి పురుషులును నిశ్వాసము చేసిరి. పతివ్రతయైన రాణియే కదల్చలేకపోయిన శిలను తమ భార్యలు మాత్రమెట్లు కదల్చగలరన్న భావము వారిలో కదలినది.
|