ఇంతలో నొక క్షుర కార్మికుని పెండ్లిమాడిన రజక స్త్రీ ముందుకు వచ్చినది. తానా శిలను తాకుదుననియు దానిని కదల్పగలుగుదననియు పలికినది. ఎవ్వరును నమ్మలేదు. చివరి ప్రయత్నముగ నొప్పుకొనిరి. ఆమె స్నానముచేసి వచ్చి శిలను తాకగనే యది కదిలినది. మిహీరకులుడును ప్రజలును ఆమెకు బ్రహ్మరథము పట్టిరి. రాజామెను బహుభంగుల సత్కరించి పంపెను.
శిలను తాకుటకు వచ్చిన లక్షలాది స్త్రీలు ఆ శిలనే పతివ్రత కదల్చునోయని యచటనే నిలచిపోయిరి. రాజు వారికందరికి అక్కడికి వచ్చినందులకు ధన మిత్తునని చెప్పి పిలపించెను. అతడింకను ధనమీయలేదు. అందుచేతగూడ వారందరచ్చటనే యుండిపోయిరి. రజక స్త్రీ చేత శిల కదల్పబడిన తరువాత మిహీరకులుడు మిగిలిన స్త్రీల నందరను చంపింప దొడగెను. చనిపోవుచున్న యా స్త్రీల వివిధములైన హృదయ విదారక హాహా కారములనువిని మిహీరకులుడు అమృత పానమును చేసినంత సంతోషమును పొందసాగెను. రాజు చేయుచున్న లక్షలాది స్త్రీ హత్యల నాపుట కచట సమర్థులైన వీరులుగాని బుద్థిమంతులు గాని లేరు. మంత్రులు, దండనాయకులు సేనానులు, పండితులు, శూన్యదృక్కులతో నీ ఘోరమును చూచుచు ప్రతిఘటింప నేరక మిన్నకుండిరి.
అంతవరకు మిహీరకులుని క్రౌర్యమును చూచి విసిగిపోయిన కళ్యాణవతికా స్త్రీ హత్యలను చూచుట తోడనే యోర్పు నశించి వీరవనితలకై భర్త కెదురొడ్డి నిలచినది. శిలను తాకినప్పుడు తాను కూడ పతివ్రత కాదన్నట్లుగ శిల కదలలేదు గనుక ముందు తనను చంపి తరువాత మిగిలిన స్త్రీలను చంపుమన్నది. ఇట్లెదురు తిరుగుటకు ముందుగనే కళ్యాణవతి యుద్ధమునకు సర్వ సన్నిధ్ధయైనది. తన సైన్యము, మేనల్లుని సైన్యము యువరాజు యొక్క సైన్యమును రహస్యముగ సమీకరింప జేసినది. అవసరమగుచో మిహిరకులుని నతని సర్వ సైన్యమును సంహరించి యైనను స్త్రీ వధ నాపుటకామె సంసిధ్ధయైనది. ఒక్క స్త్రీ పైనైనను కత్తిపడినచో నహించు నదిలేదని గర్జించినది. స్త్రీల ప్రాణరక్షణకై యమభేతాళ సమ్మిత రూపమై ఘోర నిశాచరునివంటి భర్తతో కయ్యమునకు కాలుదువ్విన కళ్యాణవతి ధైర్యము ప్రయోజన సహీతము, ప్రజాహీతకరము నైనట్టిది.
స్త్రీలు శీలవతులో కారో నిర్ణయించుటకీ పద్దతి సరియైనది కాదని పలికినది. మహారాజా ఇన్ని లక్షలమంది స్త్రీలను కులటలు జారిణిలు అపతివ్రతలు..సాక్ష్యమేమి
నేనును కులటను నన్ను ముందు వధింపుము అనుచురాజు చేసెడి కృత్యమెంత హైన్యమై నదియో యెత్తి చెప్పినది. స్త్రీలు నశించిన దేశమేమి కావలయును అని ప్రశ్నించినది. నది వరదలెత్తి ప్రజలను పొట్టను బెట్టుకొనుచున్నదని కాలవలను త్రవ్వించి రక్షించుట యెందులకు మరల నీ విధముగా స్త్రీ సంహారము చేసి దేశమును నిర్మానుష్యము చేయుట యెందులకు ? అన్నది. కళ్యాణవతి తన ప్రాణములయొక్క విలువ లక్షలాది స్త్రీల ప్రాణముల విలువకు సమానముగ వెలకట్టినది. మిగిలిన స్త్రీల యొక్క ప్రాణముకు నా ప్రాణము వెలగట్టుచున్నాను. నన్ను వధించుడు అన్నది. మిహిరకులుడు యోచించి మిగిలిన స్త్రీలనందరను పంపించి వైచెను. కళ్యాణవతి యొక్క ధర్మరక్షణమును న్యాయ వైశారద్యమును, ఈ సంఘటనము సూచించుటయే గాక వీనివలన నామె కఖండ విజయమును సంప్రాప్తమైనది.
తదుపరి నాల్గురోజులకు మిహిరుకులడోక వేదిక నమర్చిబల్లెపు కొనలును ఖడ్గములకొనలును పైకి పొడుచుకు వచ్చునట్లు గ్రుచ్చింపించెను. ఆ గ్రుచ్చినవాని బల్లక్రింద యఖండ జ్వాలల నమర్పించెను. దానిపైన బల్లెపుకొనలును ఖడ్గములును గ్రుచ్చబడెను దాని క్రింద బ్రహ్మాండమై అగ్ని జ్వాలలినుప బల్లను మ్రింగుచుండెను. అందరును రాజు ఆ హోమగుండము లోనికి రాణిని త్రోయించునని భావించిరి. ఆ సమయుమునకు ముందే రాజ్యపరిస్థితులన్నియు తన భావమున కనుకూలముగా మలచినది. న్యాయమైన మార్గమున నడచుయర్హతులకు ముఖ్యోద్యోగుమలిచ్చెను, కుమారుని, మేనల్లుని రాజ్యముకు కట్టుదిట్టములను చేయించినది.
సభాముఖమునకు వచ్చిన రాణి అగ్నిజ్వాలలను చూచి తన యొరనుండ కత్తిని దూసి తననే పొడుచుకొన్నది. మిహిరకులుడాయగ్ని వితర్దికపైక దూకి యఖండ జ్వాలలో నెఱ్ఱగా కాలియున్న బల్లెముల ఖడ్గముల కోణములపై బడి మరణించెను ప్రజల నెంత హింసపెట్టి యెంత బ్రహ్మానందమందెనో యంతకు వందరెట్లెక్కువగా తనను తానే హింసికుని యానందించి మరణించెను. మిహిరకులుడు చిన్న ప్రాణులు చనిపోవునప్పుడెట్లు బాధపడునో ? పెద్ద ప్రాణులు బాధపడునప్పుడు ఎంత బాధపడునో చూడ దలచి యొకమారు కోరడ కొమ్మలపైనుండి యగాధములలోనకి యేనుగులను త్రోయించి యవి ప్రాణము పోవునప్పుడు బాధతో పెట్టుఝీంకారములను విని యానందించెడివాడు తన మరణమంతకన్న క్రూరముగ నేర్పాటు చేసికొన్నాడు.
మిహిరకులుని పాత్ర యాద్యంతము హీంసాత్మకతతో కూడిన యున్మత్తతో పూర్తియైనది. అంతటి క్రూరునకు కళ్యాణవతి వంటి యిల్లాలు సమకూడినది. ఆమె యుద్ధనీతిని, రాజనీతి, రాజ్యవిస్తరణమునకు గాని గాక ప్రజారక్షణమునకు దేశరక్షణము స్త్రీల ప్రాణ రక్షణమునకు తోడ్పడి శ్రేయోదాయకమగుటచే నీ నవలలో నీ పాత్ర ప్రయోజన మింతింత యనరానిది.
|