79
 

వ‌సుంధ‌ర‌కు ఉమాకాంతునిపై కోరిక చావ‌లేదు. యోగిన‌గ న‌టించుచుండెనే గాని నిజ‌మైన యోగిని కాలేదు గ‌నుక నిట్టి భావ‌ములు క‌లుగుట‌లో నాశ్చ‌ర్య‌ములేదు. ఉమాకాంతున‌కు వ‌సుంధ‌ర గాక మొద‌టి భార్య‌యును మ‌రియిద్ద‌రు స్త్రీలును గ‌ల‌రు. వ‌సుంధ‌ర యొక్క దేవ‌తాత్వ‌ము నుమాకాంతుడు అనుమానించ‌క‌పోయిన‌ను ఆమె యొక్క గంభీర‌త్వ‌ముపై నొక విధ‌మైన భీతి క‌ల‌దు. అందుచేత‌నే వ‌సుంధ‌ర‌ను మోస‌ము చేసి పెండ్లియాడినందులకు క్ష‌మింప‌వేడినాడు. వ‌సుంధ‌ర తానెట్టి దాన‌న‌యిన‌ను అతని భార్య‌నేయ‌ని న‌ది. నేనిప్పుడెట్టిదాన‌న‌యిన‌ను మీరు భ‌ర్త‌లు. నేను భార్య‌ను అన్న‌ది.

వ‌సుంధ‌ర జ్ఞాన‌మునుగాని కీర్తినిగాని సంపాదించుకొన‌లేక యిటు పెండ్లియాడిన భ‌ర్త‌తో సంసార సుఖ‌మ‌నుభ‌వింప లేక పోయిన‌ది. జ‌నుల‌కు ప్ర‌తారించి గ‌డించిన ధ‌న విష‌య‌మున కూడ తాత్కాలిక సుఖ‌మునైన పొంద‌లేక‌పోయిన‌ది. ఆ ధ‌న‌ము నాదికాదు. దానిపై య‌ధికారులు వేరుగ నున్నార‌ని భావించిన‌ది. శ‌శివ‌లె యోగిన‌యు కాలేక‌పోయిన‌ది. యోగ‌ము లేక‌పోయిన‌ను అచ్చ‌మైన భ‌క్తి భావ‌ము కూడ కాన‌రాదు. శ‌రీర‌మును కాద‌న‌లేక‌పోయిన‌ది. వారిద్ద‌రు వ‌ట్టి వ్య‌వ‌హార‌ము మాత్ర‌ము మాటాడిన‌ను వారి చూపుల వెనుక శృంగార ర‌స‌స్ప‌ర్శ త‌గులుచునే యుండెను. తాను నిదానించి చూచిన‌ప్పుడు వ‌సుంధ‌ర క‌నుచూపు మ‌ల‌చుకొనుట యొక లీలా విశేష‌ముగ నిల‌చుండుట ఆ ల‌క్ష‌ణ‌ము లామె త‌న‌యందు బ్ర‌స‌న్న‌మ‌యిన ద‌నుకొనుట‌గా స‌మ‌న్వ‌యింప వ‌చ్చును.

హ‌ర‌శాస్త్రి క‌ట్టించిన దేవాల‌య‌ములోనే విగ్ర‌హ‌ము ప్ర‌తిష్టింప వ‌లెన‌ని ప్ర‌శ్న బ‌య‌లుదేరిన‌ది. వ‌సుంధ‌ర‌కును వామ‌దేవున‌కును, బాల‌ను ప్ర‌తిష్టింప‌వ‌లెన‌ని యుండ‌గా హ‌ర‌శాస్త్రికి వేణుగోపాలుని ప్ర‌తిష్టింప‌వ‌లెన‌ని యుండెను. వామ‌దేవుని యాజ్ఞ‌కు వ్య‌తిరేకముగా హ‌ర‌శాస్త్రి వాదించినందువ‌ల‌న నా రాత్రి వామ‌దేవుడు హ‌రశాస్త్రిని హ‌త్య‌చేసెను. విచారింప‌గా మ‌రికొన్ని హ‌త్య‌లు తేలిన‌వి. క‌ళాధ‌రుడును అత‌ని భార్య‌యును హ‌త్యా నేర‌మున‌కు కారాగార‌మున నుంచ‌బ‌డిరి. వారి సంతాన‌ము యొక్క బాధ్య‌త వ‌సుంధ‌ర‌యే వ‌హింప‌వ‌ల‌సిరాగా క‌ళాధ‌రునిపై నున్న క్రోధ‌ద్వేష‌ముల‌ను ప‌రిహ‌సించి పిల్ల‌ల‌కు మాతృస్థానీయు రాలైన‌ది.

వ‌సుంధ‌ర నౌన‌త్య‌ము ప్ర‌స్పుట‌మ‌గుట‌కీ సంఘ‌ట‌న‌ము ప్ర‌ధాన‌మైన‌ది. వ‌సుంధ‌ర పాత్ర స‌జీవ‌మైన‌దా కాదా య‌న్న‌ది స‌మ‌స్య‌. న‌వ‌ల ఆస్తిక నాస్తిక వాద‌ముల‌తో వంచ‌న‌లు వంచ‌నా శిల్ప‌ముల తోడ‌ను నిండియుండుట‌, పిశాచ సంభాణ‌ములును, ఊరంత‌టిని ఇంద్ర‌జాల విద్య‌తో జ‌ల‌ప్ర‌ళ‌య‌ముల‌ను సృష్టించుట‌ను మ‌రికొన్ని య‌ద్భుత చ‌ర్య‌ల తోడ‌ను వ‌సుంధ‌ర యొక్క మూర్తి అగ‌రు ధూప‌ముల సుడుల‌లో చిక్కుకొని దృశ్యాదృశ్య‌ముగ నుండుట చేత నీమె స‌జీవ మూర్తి య‌నిపించ‌దు. కాని వ‌సుంధ‌ర నొక్క దానిని న‌వ‌ల నుండి విడివ‌ర‌చి యామె సంభాష‌ణ‌లు చ‌ర్య‌లు, భావ‌ములు భావ‌న‌లు యోచ‌న‌లు న‌మ్మ‌క‌ములు నిశ్చ‌య‌ములు, ప్ర‌కృతియ‌న్న విష‌య‌ములపై కూలంక‌ష‌ముగ చూచిన‌ట్లైన ఆమె జీవిత‌ము తో తొణికిస‌లాడుచు క‌నుల‌కు క‌ట్టిన‌ట్లు కనిపించును.

మొద‌ట వ‌సుంధ‌ర సుకుమార భావ‌ముల క‌ల‌ది. సాత్విక ప్ర‌వృత్తి క‌ల‌ది. పెద్ద‌ల‌మాట కెదురాడ‌క యుమాకాంతుని పెండ్లియాడిన‌ది. మ‌తాంత‌రురాలైన‌ను వ‌దిన‌యైన మేరియాను క‌ష్ట‌పెట్టకుండ త‌న‌కు యిష్ట‌ములేని ప‌నుల‌నైన చేసి యామె క‌నుకూల‌ముగ ప్ర‌వ‌ర్తించుచుండెడిది. ఇట్టి ప్ర‌వ‌ర్త‌న స్వార్థ‌ప‌రుల కుండ‌దు. ఎదుటి వారెంత‌టివారైన త‌న‌కేమి వారికిష్ట‌మైన ప‌నుల‌నేల చేయ‌వ‌ల‌యును ?  త‌మ‌కు న‌చ్చిన ప‌నుల‌నే తాము చేయుదురు. వ‌సుంధ‌ర‌లో నిట్టి ప‌రుష‌మైన ప్ర‌వ‌ర్త‌న‌లేదు. ఈమె యొక్క యీ అతి మంచిత‌న‌ము చేత‌కానిత‌న‌మువ‌లె కూడ క‌నిపించును. క‌న్పించుట‌యేగాక క‌డ‌దాక నీమె చేత‌కానిత‌న‌ము నిరూపింప‌బ‌డిన‌ది. ఇట్టి య‌స‌మ‌ర్థ‌త సంఘ‌ములో నే వ్య‌క్తుల‌కు నుండ‌ద‌న‌లేము. ఆమెకు త‌న జీవిత‌మును గూర్చి యెట్టి యూహ‌లును లేవు. అన్న పెండ్లియాడ‌మ‌న‌గా పెండ్లియాడిన‌ది. భ‌ర్త‌తో కొన్ని రోజులు సుఖ‌ప‌డిన‌ది. భ‌ర్త పిశాచ‌ము త్ర‌వ్వి త‌న కెత్తుదున‌న‌గా రెండ‌వ భ‌ర్త‌ను నిర్ల‌క్ష్య‌ము చేసిన‌ది. మ‌ర‌ల వామ‌దేవుని మాట‌లు విని పిశాచ‌మును వెళ్ళ‌గొట్టిన‌ది. క‌డగండ్ల‌పాలైన‌ది. మ‌హాప్ర‌వాహము వెంట‌బ‌డి కొట్టుకుపోవు పూచిక‌పుల్ల‌వ‌లె ప్ర‌వాహ‌మేదిశ‌కు ప‌య‌నించిన నాదిశ‌కు పోయిన‌ది. ఆ పోవుచున్నపుడామె మాన‌సిక ప‌రిస్థితి యెట్లున్న‌ది యూహాపోహ‌లెట్లున్న‌వి అన్న‌దే వ‌సుంధ‌ర వ్య‌క్తిత్వ‌మన‌వ‌లె గాని మ‌ల‌క‌లు తిరిగిన‌ది వ‌సుంధ‌ర వ్య‌క్తిత్వ‌ముగాక యామెలోనున్న బ‌ల‌హీన‌త‌ల‌న‌వ‌లెను.


భ‌ర్తృ పిశాచ‌ముతోడ సంభాణ‌ము జ‌రిపిన‌ప్పుడామె మాట‌ల‌యాయ‌క‌ముగ‌లేవు. పైకి డాంబిక‌ముగా నిన్నెవ‌రు ర‌మ్మ‌న్నారు ?  మ‌ర‌ల నెందుకు వ‌చ్చితివి ? అని పిశాచ‌ముతో న‌నునేకాని మ‌ర‌ల న‌త‌ని కొర‌కు ప్ర‌తీక్ష చేయ‌క మాన‌దు. వామ‌దేవుడు రాకున్న‌చో బాగుండున‌ని భావించుచు మ‌ర‌ల న‌త‌నికై యెదురు చూడ‌క మాన‌దు. ఈమెలోనున్న యీ ద్వంద్వ ప్ర‌వృత్తిలో తండ్రి తాత‌ల‌యొక్క  స‌నాత‌నాభిమాన ప్ర‌భావ‌ము అన్న‌ల యొక్క హేతువాద‌మున‌కును ప్ర‌భావిత‌మైన యామె మ‌న‌స్సు ప్ర‌తిబింబించు చుండును. ఆ యింట నాడు క‌ర్మిష్టులుండిరి. నేడు మ‌హర్షుటుద్భ‌వించిరి.(పేర్లు పెట్టుకొనుట‌కు మాత్ర‌ము)  నాడాయింట సోమిద‌మ్మ‌లుండిరి. నేడ‌ప్స‌ర స్త్రీలుద్భ‌వించిరి. (అప్స‌ర స్త్రీలు భోగ‌ముల‌న‌కు ప్ర‌తీక‌లు) నాడు వేద వేదాంగ‌ములు చింత చేయ‌బ‌డిన‌వి. ఆ చిలుక ప‌లుకులుజ్జ‌గింప‌బ‌డి నేడు స‌ర్వ ప‌దార్థ విజ్ఞాన‌ము వివ‌రింప‌బ‌డుచున్న‌ది. నాటికిని నేటికిని గ‌ల యా భేద‌మే వ‌సుంధ‌రాంతః క‌ర‌ణ‌మున సంఘ‌ర్ష‌ణ‌మైన‌ది. ఈ సంఘ‌ర్ష‌ణ‌ముతో నుండిన మ‌న‌స్సును పిశాచ వామ‌దేవాదులు సుల‌భముగా త‌న క‌నువైన‌ట్లు మ‌ల‌చు కొన‌ల‌గ‌లిగిరి. ఇట్టి ప‌రిస్థితిలో నామె క‌ల్లంత దూర‌మున నాకొండ‌పై వెల‌సిన దేవ‌ళ‌మున ప్ర‌తిష్టింప‌బ‌డిన బాలాత్రిపుర‌సుంద‌రి దివ్య విగ్ర‌హ‌ము షోడ‌శ‌క‌ళ‌తో విరాజిల్లుచు వ‌ర‌దాభ‌య హ‌స్త‌ముతో ప్ర‌కాశించిన‌ది యోగిని శ‌శి.

వామ‌దేవుని శృంగార గాథ‌ల‌ను విన్న‌వ‌సుంధ‌ర రిత్త‌వోయిన‌ది. త‌న దేవ‌తాయ‌త‌న మెన్ని య‌ప‌వాదుల‌కు గురి కాల‌వ‌యునో బెగ్గ‌టిల్లిపోయిన‌ది. క‌ళాధ‌ర‌రావు బ‌లాత్క‌రింప ద‌ల‌ప‌గా నామెలో నొక వైరాగ్య‌ము నిశ్చ‌య‌మైన‌ది అన‌గా న‌దివ‌ర‌కామెలోనున్న భావ సంఘ‌ర్ష‌ణ‌ములో నొక రేవున‌కు చేరుకొనుట‌యే. త‌న‌లో నున్న స్త్రీ భావ‌మును రూపు మాపుకొన వ‌ల‌యున‌ని భావించిన‌ది. అంత‌కు ముందు వామ‌దేవుడీయ‌మ‌నెనని పిశాచ‌ము వ‌లె న‌టించి క‌ళాధ‌రుడు రెండువేల రూపాయ‌లు ప‌ట్టుకొని పోగా వృధాగా ధ‌న‌ము పోయిన‌దే అని వ్య‌ధ చెందిన‌ది. కాని త‌రువాత నా ధ‌న‌లోభము కూడా వ‌ద‌లి ఇనుప పెట్టెకు తాళ‌ము కూడా వేయుట మానిన‌ది.

క‌ళాధ‌రుడు తాళ‌ము వేయ‌ని ఇనుప పెట్టెనింకొక విధ‌మున నుప‌యోగించెను. అత‌డు న‌గ‌ల మూట‌ను తెచ్చి పెట్టెలో పెట్టెను. న‌గ‌ల మూట‌ను గౌత‌మ‌రావుతీసికొనిపోయి వ‌సుంధ‌ర‌కు కారాగార‌మును త‌ప్పించెను. ఊరంత‌యునెంత గ‌గ్గోలుగనున్న‌ను ఎన్ని య‌రాచ‌క‌ములు జ‌రుగుచున్న‌ను తాను, త‌న యిల్లు క్షేమ‌ముగ నుండుట శ‌శి ప్ర‌భావ‌మే య‌ని భావించిన వ‌సుంధ‌ర ఆమెకు సాష్టాంగ‌ప‌డిన‌ది. శ‌శీ వీను మా మాత‌మున కంత‌కు మూల భూతురాల‌వు. నీవులేనిచో నేను గూడ నాస్తికురాల‌య్యెడిదాన‌ను. స‌ర్వ‌లోక‌ము శ‌రీర‌నిష్ట‌ముగా నున్న‌ది. ఎన్ని వేదాంత‌ములు చెప్పిన‌ను నీ వంటి ప్ర‌బ‌లో దాహర‌ణ‌ము క‌నుపింప‌దు. శ‌శి వ‌సుంధ‌ర యెదుట నుండియే సామాన్య బాలిక‌గ నుండి యోగినిగ మారిన‌ది. అందుచేత వ‌సుంధ‌ర న‌మ్మిన‌ది. సాక్ష్య‌ము లేకున్న‌చో హేతువాద‌కుశ‌లుల‌కు సోద‌రియైన వ‌సుంధ‌ర న‌మ్మియుండెడిదికాదు.

ప‌శుప‌తి శాస్త్రి వీణ‌ను మీటి ప‌లికించిన హిందుస్థానీతోడి రాగ‌ముతో ప్ర‌పంచ‌ములోనున్న శోక‌ర‌స‌మంత‌యు ముద్ద గ‌ట్టించి యామె శ్ర‌వ‌ణేంద్రియ‌ముల ద్వారా నాత్మ‌కెక్కించును. ప‌ర‌మానంద మ‌నుభ‌వించుట‌కు శ్ర‌ద్ధ‌యు అన‌న్య మ‌న‌స్క‌త‌యు నుండ‌వ‌లెన‌ని బోధించి ప‌శుప‌తిశాస్త్రి వీణానాద‌మున వ‌సుంధ‌ర‌ను మున‌క‌లెత్తించెను. విషాద‌భ‌రిత‌మైన గాంధార‌ము శాంత‌భావ పూరిత‌మైన షడ్జ‌మ‌ముతో మేళ‌వింప‌గా నాధ్వ‌ని త‌రంగముల‌నుండి శోక‌సముద్ర‌ముద్భ‌వించి శ్రోత‌కాయంబుధిలో క్రుంకులిడిన య‌నుభూతిని క‌లిగించిన‌ది. ఆత్మ‌వ‌త్స‌ర్య‌భూతాని య‌న్న‌ట్లుగ వ‌సుంధ‌ర కాశోక‌మున త‌న దుఃఖ‌మును కూడ క‌లిపిన‌ది. శ్రీ‌రామ‌చంద్రుడు సీతామ‌హాదేవి వ‌న‌వాస‌మున కంపిన‌ట్లుగ న‌లుడు చీర చించుకొని ఘెరార‌ణ్య‌మున ద‌మ‌యంతిని ఏకాకినిగ వ‌దిలిన‌ట్లుగ తోచిన‌ది. ప‌ర‌మేశ్వ‌రానుగ్ర‌హ‌ములేక త‌న జీవిత‌ము శిధిల‌మైన‌దని భావించిన‌ది.
ధ‌ర్మార్థ‌కామ మోక్ష‌ముల‌కు ఏకై క‌సాధ‌న‌మైన‌ది సంగీత‌ము అని సంగీత‌ర‌త్నాక‌ర‌ము చెప్పుచున్న‌ది. త‌స్య‌గీత‌స్య‌మాహాత్మ్యం కేప్ర‌శంసితుమీశ‌తే
ధ‌ర్మార్థ‌కామ మోక్ష‌ణామిద‌మేకైక సాధ‌న‌మ్‌.

అట్టి సంగీత‌మును విన్న వ‌సుంధ‌ర శాంత‌ర‌సాంబుధిలో నోల‌లాడిన‌ది. ఆత్మ‌ర‌తియే శాంత‌ర‌స‌మున‌కు స్థాయిభావ‌ముగ న‌లంకారికుల‌చే చెప్ప‌బ‌డిన‌ది. ద‌శ‌రూప‌క కారుడు చెప్పిన‌ట్లుగ న‌య‌త్ర దుఃఖం, న‌సుఖం నచింతా, న‌ద్వేష‌రాగౌ న‌చ‌కాచిదిచ్ఛా దుఃఖ‌ముగాని సుఖ‌ముగాని చింత‌గాని ద్వేష‌రాగాదుల‌నుగాని యిచ్ఛ‌గాని లేని స్థితిలో శాంత‌ర‌స స్వ‌రూప‌మే తాన‌యైనట్లుగ వ‌సుంధ‌ర ప్ర‌శాంత‌స్థితి నందిన‌ది.

ఈ న‌వ‌ల‌లో ర‌చ‌యిత యుద్దేశించిన స్వ‌ర్గ‌ము బ‌హిఃప్ర‌కృతి నుండి కాదు. స్వ‌ర్గ‌మన‌గా సుఖ‌ము, ఆనంద‌ము, ఈ ఆనంద‌ము మ‌ర‌ల చిదానంద‌ము బ్ర‌హ్మానంద‌ము కావ‌ల‌యును, ఇట్టి ఆనంద‌మ‌య స్వ‌రూప‌మ‌యిన స్వ‌ర్గారోహ‌ణ‌ము ప‌శుప‌తిశాస్త్రి యొక్క వీణావాదముచేత సాధింప‌బ‌డిన‌ది. వీణాతంత్రుల‌నుండి నిర్గ‌మించిన యానంద‌ర‌స‌ము వ‌సుంధ‌ర యొక్క శ్ర‌వ‌ణేంద్రియ‌ముల ద్వారా మ‌న‌సులో ప్ర‌వేశించి హృద‌యాకాశ‌మున వ్యాపించి యంత‌రామ్త‌కు హ‌త్తుకొని శాశ్వ‌త శాంతి సౌఖ్య‌మును క‌లుగజేసిన‌ది. ఇదియేస్వ‌ర్గ‌ము. పిశాచ‌ము వ‌సుంధ‌ర‌చేత న‌వ‌రోహింప చేయ‌వ‌లెన‌ని భావించిన‌దిస్వ‌ర్గ‌ముకాదు. పిశాచ‌మున‌కుస‌ద్భుద్ధియుండ‌దు. స‌ద్భావ‌న‌యునుండ‌దు. బ‌హుశ్ర‌మ‌ల‌కోర్చి కట్టిన దేవాల‌య‌ము విగ్ర‌హ ప్ర‌తిష్ఠ‌కాక‌నే నిల‌చిపోయిన‌ది. నాయ‌మ‌య‌మైన ర‌సాస్వాద‌న‌ముతో వ‌సుంధ‌ర‌లోన శాంతి తొల‌గ‌గా  స్వ‌ర్గ‌సౌఖ్య‌మున‌నుభ‌వించిన‌ది. ఈస్వ‌ర్గ‌మున‌కు మెట్లు ఇట్లు అంత‌రంగ‌ము నుండి క‌ట్ట‌బ‌డిన‌వి.