అమృతవల్లి
మగధరాజ్య సిహాసనము శుంగవంశపాలకులనుండి కాణ్వాయన వంశమువారికి వశమగుటయే అమృతవల్లి నవలలోని ముఖ్యగాథ.ఇట్లీ వంశములుమారుసందర్భమున అమృతవల్లి యసామాన్యమైన ప్రతిభచూపినది. అమృతమువంటి హృదయము విషశరీరముగల అమృతవల్లి వహించినది ముఖ్యపాత్రయగుటచే నవలకీమె నామముంచబడినది.
దేవభూతి మహారాజు స్త్రీ లోలుడై తనకునచ్చిన ప్రతిస్త్రీననుభవించుచు స్త్రీలకు మానప్రాణరక్షణలేకుండ చేయసాగెను. ఇందువలన నితనికి విరోధి కూటమి పెరిగినది. రాజ్యము మాత్రము మహాసేనాధిపతి వాసుదేవుని చేతిలో నొడదుడుకులు లేకుండనుండెను.
అమృతవల్లి పదియూళ్ళకు ప్రభువై నహరిసేనుడు. అమృతవల్లికిని వాసుదేవునికుమార్తె శ్రీ మాలికిని విడదీయరాని స్నేహానుబంధమున్నది. ఒక రన్ననొకరికి ప్రాణము. ఇరువురునొకేహృదయముగలవారివలె ప్రవర్తించుచుండెడివారు. ఇరువురునుసుగుణవతులు సహృదయముగలవారు. కాని శ్రీమాలిసుకుమారవతి, అమృతవల్లి గంభీరురాలునై యుండిరి.
శ్రీమాలియును, అమృతవల్లియును విదురుడను నొకవృధ్ధునికడకు ఆడుకొనుటకువెళ్ళెడివారు. ఆ వృధ్ధుడు పిల్లలన్నచో మిక్కిలి ప్రేమ అతనికి పిల్లలనాకర్షించే మెత్తని గుణముండుటచే పిల్లలందరు నాతనిదరికి చేరెడివారు. విదురుడు కథలరూపమున నాటలరూపమున పిల్లలకు నీతులు నేర్పెడివాడు. అమృతవల్లి శ్రీమాలికి కూడ తెలియకుండ విదురుని తమ్ముడైన జయద్రధునికడకేగెడిది. ఈ జయద్రధుడు దుర్మార్గుడు నాస్తికభావములు కలవాడు నగుటచేనే పిల్లలాతని కడకు చేరెడివారుకావు. అమృతవల్లి చేత నాజయద్రధుడు విషభోజనమును చేయించెడివాడు. చిన్నతనములోనా లోచనలేక విషభోజనమేచేసినను వయస్సువచ్చుసరికి దానివలనకలుగు ప్రమాదము గ్రహించుకొనినది.కానిచిన్నపిల్లయైన యమృతవల్లిలో నీవిషభోజనరహస్యము నెవ్వరికిని తెలియకుండ నుంచగల్గుట యన్నగుణము అసాధారణముగనుండెను. ఆత్మీయురాలైన శ్రీమాలికకికూడ నీవిషయము చెప్పదు. వయస్సు వచ్చినతరువాత అమృతవల్లి తనజీవితము వ్యర్థమైనదని గ్రహించుకొని, తనజీవితమును తనకొరకుగాక స్నేహితురాలికొరకు ముడుపుగట్టి స్వార్థత్యాగియైనది.
అమృతవల్లి శ్రీమాలి కొరకు వారియింటికి రాకపోకలు జరుపు సందర్భమున నామెకు తెలియకనే వాసుదేవుని యందొక మమకారమేర్పరచు కొన్నది. వాసుదేవుడు తనకుమర్తెకు స్నేహితురాలైన అమృతవల్లి యన్నచో ప్రేమాదరములు నెరపెడివాడు. శ్రీమాలియింట అమృతవల్లి చాకచక్యముతోనొక ప్రత్యేకస్థానము నేర్పరుచుకొన్నది.
ఒకనాడు శ్రీమాలియు, అమృతవల్లియును కాలంజరి యను నొక సోదె చెప్పెడి స్త్రీ కడకు వెళ్ళిరి. కాలంజరి తనగుడిసెలో రెండు ఆసనముల నేర్పాటు చేసినది. ఒకటి లేడిచర్మము, మరియొకటి పులిచర్మము. కాలంజరి వారని కూర్చుండమని చెప్పగా అమృతవల్లి పులిచర్మము మీదను శ్రీమాలి లేడిచర్మము మీదను ఆసీనులైరి. దీనినిబట్టి కాలంజరి వారి స్వభావములను లెక్కగట్టినది. ఆజంతువులు ప్రాణములతో నున్నప్పుడేమి జరిగినదో తనకు బోయవాడు చెప్పెనని కాలంజరి వారితోచెప్పినది. ఒకలేడి తన పిల్లలను దగ్గర పెట్టుకొని విశ్రమించుచుండగా నీబోయవాడొక బాణముతో నొకపిల్లనుకొట్టెను. తల్లిలేడి దుఃఖాతిశయముతో వాటులోనికి దూకిమరణించినది. లేడిసాధువైన జంతువుకనుక తనకపకారము చేసినవారిపై పగ దీర్చుకొననూహింపదు. దుఃఖాతిశయమునకు తట్టుకొనలేదు. అందుచేత నాలేడికి ప్రాణత్యాగమే శరణ్యమైనది.
చిరుతపులిగాథ యిట్లున్నది. ఒకనాడీపులి రెండునక్కలాడుకొనుట చూచుచున్నది. రెండిటిలో నొకటి యడవినక్క. ఆయడవినక్క కొంతసేపు ఆడినట్లాడి రెండవనక్క మెడకొరికినది. ఆటను చూచుచున్నపులి ఆడవినక్కపై దూకి దానిని సంహరించినది. ఈపులిదగ్గర అన్యాయముచూచి సహింపగల గుణములేదు. నక్కతీర్చలేని పగను తానుతీర్చినది. శ్రీమాలియు నమృతవల్లియు నీరెండు చర్మములపై కూర్చుండిరి. ఈ రెండు గాథలకును జరుగబోవు అమృతవల్లీ శ్రీమాలుల జీవిత గాథలకును వారి మనస్తత్వములకు గల సంబంధము ప్రతీకాత్మకముక వచ్చుటయు నా చర్మములపై కూర్చుండుటయును జరుగుచునే యుండును. కాని యా కూర్చున్న వారందరికి నిదేరకమైన సంచలవమును శ్రీమాలిని చూడగనే కలుగుట చూచిన అమృతవల్లి అందులకు కారణమేదియై యుండునా యని ఆలోచించినది. ఇట్టియూహ చేయునప్పుడు అమృతవల్లికి పదునైదేండ్ల వయసుమాత్రమే యున్నది. అమృతవల్లి యొక్క వివేకమునకు మేథాశక్తికిని కాలంజరి యచ్చెరువందినది. అమృతవల్లి కామె సోదెచెప్పలేకపోయినది. శ్రీమాలి కాలంజరితోయిట్లన్నది. అమృతవల్లికి చెప్పబోయితివి. నీకు పూనకమురాలేదు. అమృతవల్లి నీకంటె నధికమైన మనశ్శక్తికలది కావచ్చును. నీకంటెనేమి ! ఆమె యొక్క మనశ్శక్తి పలుమంది మనశ్శక్తుల కంటెనధికమైనది . అమృతవల్లి యొక్క మనస్సు గంభీరమగుటచే కాలంజరి సోదెచెప్పలేకపోయినది.
కాలంజరి శ్రీమాలి యొక్క పాతివ్రత్యము భంగమగుననిచెప్పినది. శ్రీమాలికి కాలంజరియన్నచో నసహ్యము కోపము, అనుమానము కలిగినవి. కాలంజిరిని దూషించుట మొదలిడినది. అమృతవల్లి శ్రీమాలిని శాంతింపజేసి యింటికి తీసికొనిపోయి మరునాడు తానొక్కతియే కాలంజరి దగ్గరకు వచ్చినది. శ్రీమాలిని చూచినప్పుడు కాలంజరి యెందుక భావసంచలనమునకు లోనైనదో యడిగినది. శ్రీమాలి కాలంజరిని దూషించినందులకు కోపగించుకొనవలదని బ్రతిమాలినది. ఒక్కొక్కప్పుడు శ్రీమాలి బిడ్డ చనిపోయినంతనే వాగులోనికి దూకిమరణించిన లేడివలె ప్రవర్తించునన్నది. శ్రీమాలికేదైననాపద జరుగునేమోయనిన భయముతో అమృతవల్లి నిలువలేకపోయినది. శ్రీమాలి తండ్రి వాసుదేవుడు పరమసుందరమూర్తి. సామర్థ్యము కలవాడు. యోగ్యుడు. అతని అధికారమునకు కూడ అమృతవల్లి యాకర్షితురాలైనది. అతని సౌందర్యమును గూర్చి అమృతవల్లి యిట్లు భావించెడిది. వాసుదేవుడు పరమసుందరుడు. ఆయనకు నలువది యేండ్లున్నను వాని మూర్తి మధుమాసమువలె నుండును అమృతవల్లి వాసుదేవుని తనసర్వస్వముగ భావించుట మొదలిడినది. వాసుదేవుడు అమృతవల్లిని ముద్దుగ లాలనగ చూచును. శ్రీమాలి తల్లి శ్రీమాలిని చూచినట్లు అమృతవల్లిని చూచును. కాని వాసుదేవుడు మాత్రము కుమార్తెను చూచినట్లు చూడలేదు. వాసుదేవునిపై అమృతవల్లికి గలప్రేమ క్రమక్రమముగ వారింటిలోని సర్వాధికారములు తనంత తానుగ స్వీకరించునటు చేసినది. శ్రీమాలి తల్లియమాయకురాలగుటచేత నామెకీయవకాశము కలిగినది.
అమృతవల్లి, శ్రీమాలి వివాహసమయమున పూర్తిగ వాసుదేవుని యింటనే యుండిపోసాగినది. శ్రీమాలికి నమృతవల్లికి నడుమనున్న గాఢాభిమానమందరకు తెలిసిన విషయమే గావున నెవ్వరు నాక్షేపింపలేదు. అమృతవల్లి యొక్క యునికి వాసుదేవునితో నొక విలక్షణమైన భావమును కలిగించినది. సేనాధిపతియయ్యు నామె యధికారమునకు తలవని తలంపుగ తలవంచుట జరిగినది. పెండ్లిపనులలో తలనిండ మునిగియున్న అమృతవల్లి యధికారమునకు విమర్శించి పేరు పెట్టగల సావకాశమెవ్వరికిని లేకపోయినది.
వివాహమైన తరువాత శ్రీమాలియును నామెభర్త శ్రీవత్సుడును ఏకాంతముగనున్నవేళ వారిరువురును ఆనందవాహినిలో తేలియాడవలసిన వేల కారణము లేకుండగనే శ్రీమాలి యేడ్వమొదలిడినది. శ్రీవత్సుడయోమయ పరిస్థితిలో పడి కింకర్తవ్యతావిమూఢుడై అమృతవల్లిని పిలుచుకొని వచ్చెను. శ్రీమాలి కన్నులలోనికి గాటముగ చూచినది. కారణములీలగాతోచినది. కాలంజరి చెప్పిన పాతవ్రత్యభంగమన్న విషయమును తలచుకొని శ్రీమాలివిలపించుచుండెనని అమృతవల్లి యనుకొన్నది. ఆసమయమున అమృతవల్లి తనకామెయన్న నెంతటి ప్రేయమో తెలిపి ఆమెకు దుఃఖోపశమనమును చేసినది. నేను నీ కొరకు బెండ్లియాడను. నీకోసము జీవితాంతము కన్యగానుండుటకు నిశ్చయించితిని. నీకాపదజరిగినచో నాయాపద యన్యహేతుకమైనచో తద్ధేతు నిర్మూలనము చేసిపగదీర్చికాని హోమద్రవ్యమును కాను అని అమృతవల్లి ప్రతిజ్ఞచేసినది. అమృతవల్లి శ్రీమాలి కొరకు కన్యగనుండిపోదునన్నది. కానియామెకు విషభోజనమువలన వివాహయోగ్యతలేకపోయినది. శ్రీమాలి దుఃఖమును తగ్గించి తగుధైర్యము నాత్మవిశ్వాసముకలుగజేయుటకే తాను జీవితాంతము కన్యగానుండి పోదునన్నది. శ్రీమాలి కాపదగూర్చిన వానిపై పగదీర్చుకొందునన్నది. తనకాపద తెచ్చిపెట్టిన జయద్రధునిపై నీమెకు పగలేదు. అమృతవల్లికి శ్రీమాలియన్నచో నెంత స్నేహమో వెల్లడియగుచున్నది. తనగమ్యమయోమయముగ నున్నను లక్ష్యము మాత్రము శ్రీమాలి యొక్క క్షేమమేయని తలచినది. దేనికిని బొందకుండ నొకలక్ష్యము కొరకు నేను ప్రయాణించు చున్నట్లున్నది ఆ లక్ష్యము నీక్షేమము అని శ్రీమాలికి ధైర్యముచెప్పి యామెహృదయవేదనమును తగ్గించినది.
వాసుదేవుడు తనకు నమృతవల్లికి మధ్యనున్న బాంధవ్యమెట్టిదో విచారంచుకొనెను. ఆమెను కుమార్తెతో సమముగ చూచుటలేదు. పొరుగు వారి పిల్లయని బెరుకుగాని ముద్దుగగాని చూచుటలేదు. ఆమెపై తనకు సర్వాధికారమున్నట్లు తానుభావించుటయు తనపై నామెకు సర్వాధికారమున్నట్లామె భావించుటయు లీలగ భాసించినది. అమృతవల్లి తల్లిదండ్రులు అమృతవల్లి వాసుదేవుని యింట క్షేమముగనుండునని యన్నందులకే యోచనను చేసినాడు.
అమృతవల్లి తనయింటినుండి వాసుదేవుని యింటివరకు నడిచివచ్చుట వాసుదేవునికి బాధకలిగించినది. ఆమెకొరకొక రాజశకటము నేర్పాటు చేసెను. శకటమును పంపిచుటతో వాసుదేవునకామెపైనున్న సుకుమార భావముస్థిరమైనది. భావింపవచ్చును. ఈ సమయములో వాసుదేవునకామె భవిష్యత్తును గూర్చిన యాలోచనరాదొడగినది. ఆమెయెవనిని పెండ్లియాడును. స్వతంత్ర ప్రవృత్తి కలది. స్త్రీ సహజమైనలజ్జలేదు. ఇదియామెలో నెంచదగిన విషయము. మరియునెన్నదగిన విషయములు. కూడనామెలోనున్నవి. రాజ్యములేలగలదు. వ్యూహములు పన్నగలదు. సమయానుకూలముగసలహాలనొసగగలదు. మహారాజునకు భార్యకాగలలక్షణములివి. వాసుదేవుడిట్టి యభిప్రాయమును వెలిబుచ్చి రాత్రి అమృతవల్లి కన్నీరు మున్నీరుగనేడ్చినది... తననుగూర్చి అంతయోచనచేయువారెవరు తాను సంసారమెట్లుచేయగలదు ? వేరొకనిని పెండ్లియాడిన శ్రీమాలికిచ్చిన వాగ్ధానమేమికావలయును. వయసుమీరిన వాని మీద ప్రసరించుచున్న తన ప్రేమఫలమెట్లుండునన్న ప్రశ్నలకామెసమాదానములు చెప్పుకొనలేకపోయినది. తనజీవితమును స్నేహితురాలికొరకే గాని తనకొరకుగానది సేదదీరినది. ఇట్లు అమృతవల్లి జీవితము స్నేహపాలితమైనది.
అమృతవల్లి కాలంజరికై వెదకించినది. ఆమెజయద్రధునిమాయలో పడి కానరకుండనెటోపోయినది. కాలంజరిభర్త రామడుగునుగూర్చికూడవెదకించినది. వీరిరువురివలన శ్రీమాలి భవిష్యత్తును తెలిసికొనగోరినది. ఇందురాజనీతికూడ మిళితమైయున్నది. అమృతవల్లిలో రాజనీతియెంతప్రకాశించినదనగా, మహాయోధులైన వాసుదేవసేనాపతియును భూమిమిత్రుడును, నీ కాంతికి కనులుచెదరగా మహావిభ్రమమందిరి. స్వయంప్రకాశమైన యామహావికాసములో వీరినీతియువివేకమును దివిటీలవలె కాంతికొడిగట్టగా, అమృతవల్లి యెటునడువుమన్ననటునడచి యేమిచేయుమన్న నదిచేసి యెక్కడముద్రవేయుమన్ననక్కడ ముద్రలువైచి తమతమ వ్యక్తిత్వములను మభ్యపరచుకొనిరి.
అమృతవల్లి ఆస్థానమునకు వెళ్ళి భవిష్యపురాణమును తెప్పించి వాసుదేవునిచేత చదివించినది. ఆపురాణములో నున్నట్లుగ వాసుదేవుడు మహారాజగునని గ్రహించినది. ఇట్లు గ్రహించినతరువాత గిరివ్రజపురమునగాని పరిసరదుర్గ ప్రాంతములనుండిగాని వ్యతిరేకతలేకుండునట్లుగ మార్గమునుసుగమమొనర్చినది. సేనయంతయు తనమాలవినునట్లుగచేసికొన్నది. నగర ప్రముఖులు నందరిని విందునకుపిలిపించి వారలకుకాన్కలనిప్పించి వాసుదేవునకు వారలనను కూలురుగజేసినది. అమృతవల్లియోచనవలన వాసుదేవునికుమారుడైన భూమిమిత్రుడు మంత్రియయ్యెను. అమృతవల్లి యొక్క వ్యూహనిర్మాణ కౌశల్యమునకు ఊహాశక్తికిని చారుచర్యకును నీసంఘటనముద్దముపట్టినది. ఈమెకుగలయీశక్తికి వాసుదేవుడుదాసోహమనినాడు. ఆమెకు ప్రతిప్రశ్నముగాని వ్యతిరేకపదముగాని యూడుటకాసౌధమున నెవ్వరికిని దైర్యములేకపోయినది.
శ్రీమాలిని గూర్చి అమృతవల్లి చూపినంతయతుర, తండ్రియైన వాసుదేవుడుగాని, అన్నయైన మహామంత్రి భూమిమిత్రుడుగాని కన్నతల్లిగానిపడలేదు. శ్రీమాలినత్తింటినుండి తీసికొనివచ్చుబాధ్యత అమృతవల్లిదే యన్నట్లు మిన్నకుందురు. అమృతవల్లి అనేక పర్యాయములు శ్రీమాలినిగిరివ్రజపురమునకు తీసుకొనివచ్చుటకు చేసిన ప్రయత్నములు వ్యర్థముగా ఆమె ఆందోళనమంతకంకధికముకాసాగినది.
అమృతవల్లి తనజీవితమును వాసుదేవుని కుటుంబమునకై మీదుగట్టినది. ఇందులకు కారణములుకూడు. ఒకటి ఆమెకు శ్రీమాలిపై నున్న స్నేహ భావము. రెండువాసుదేవుని ప్రేమించుట మూడు తాను సంసారమునకు పనికి రానిదగుట.
అమృతవల్లి వాసుదేవుని యధికారమునకు సౌందర్యమునకు ధనమునకు మోహపడినప్పుడామెకు వివాహమన్న నేమియో తెలియని లేత వయస్సు. ఒక భార్యయున్నచో మరలవివాహమాడరాదనియు, వయసువీరినవారు బాలికలను చేపట్టుట అనుచిత మనియుకూడ నామెకు తెలియదు. వయసు వచ్చినకొలది అమృతవల్లి యోచన అనంతముఖములుసాగి మనసుపదునెక్కి బుద్దితీక్షతమునంది హృదయమువిస్తృతమైనది. రాజనీతియు, చాతుర్యమును ఆవశకమును బట్టి పుట్టుకొనివచ్చినవి.
అమృతవల్లికి తన ప్రేమయు, స్త్రీత్వమును అమృతహృదయమును వ్యర్థములైనవని గ్రహింపైనతరువాత వాసుదేవునిధారుణీపతిని చేయవలెనన్న వాంఛగాఢమైనది. అమృతవల్లి ఓటమితో గెలుపును సాధింపనెంచినది.రాముడగుచేత పాటపాడించి దేవభూతితరువాత వాసుదేవుడురాజగునని తెలిసికొన్నది. కాని ఏకారణముచేత ఎట్లురాజగునోతెలియగల భష్యపురాణపుటలు చిరిగిపోయినవి. రామడుగు, శ్రీమాలి భర్తను రాజు చంపించి, ఆమెనుమాయోపాయముతోననుభవించును. శ్రీమాలి ఆత్మహత్యచేసికొనును విషకన్యను ప్రయెగించి వాసుదేవుడు రాజునుచంపించి తాను రాజగుననిపాడెను. తరువాత భవిష్యపురాణమున లోపించినభాగమును ఒకవందితీసికొనిరాగానందులో కూడ నిట్లేయున్నది. వాసుదేవుడు విభ్రమావస్థలో నుండిపోవును. శ్రీమాలిని తీసికొనివచ్చుటకు విదిశకువెళ్ళిననిశితమతి శ్రీమాలిభర్తను రాజు చంపించుట శ్రీమాలియురిపోసుకొని చనిపోవుట చెప్పినది.
అమృతవల్లి బాల్యమునుండి నీపగను తీర్తునని శ్రీమాలికిచ్చిన మాటను నిజముచేయుటకు సందర్భమువచ్చనది. అమృతవల్లి శ్రీమాలి బేలయగుటచే నామెపగను తానుతీర్తుననిపలికెడిది. అమృతవల్లి స్వభావిమింత తీవ్రమగుట చేతనే జయద్రధునకులొంగి విషప్రయోగమునకులోబడినది.
విదిశానగరమునకు వెళ్ళి కాలంజరిని జయద్రధునిబారినుండి రక్షించి భర్త కప్పగించినది. తానురాజుతోగూడి యతని మరణమునకు హేతువై శ్రీమాలి పగలను తీర్చుటయేగాక వాసుదేవుడురాజగుటకు మార్గమేర్పరచి తాను జీవితమును చాలించుకొన్నది.
ఆమె జీవితమామె స్వభావముచేతనే దుఃఖాంతమైనది. కానియామెలో నున్న తీవ్రత యున్న స్వభావమును తొలగించిచూచినచోనామె స్వచ్ఛహృదయము, ధర్మానురక్తి, స్నేహార్ద్రత, మృదు ప్రేమ వెల్లడియగును.
అమృతవల్లి విషపూరితయైనను తన శరీరమును దేవభూతి కధీనము గావించి యపవిత్రయైనది. రాజునవధించుటకీమెశీలము పణముగ పెట్టనక్కరలేదు. ఇంతటివిదుషీమణియు ఖడ్గవిద్యలోనపుణ్యములేనందున శీలమును ప్రాణమును కోల్పోవలసివచ్చినది.
భూమిమిత్రుడు వాసుదేవుడను అమృతవల్లిలేని రాజధానినూ హింపలేకపోయిరి. ఆమెతనప్రభావమునంతగ రాజకార్యములపై ప్రసరింపచేసినది.
అమృతవల్లి యొక్క ప్రేమ వాంఛారహితమైనది. శృంగారసము నాలంబనముచేసికొనక స్థిరముగనిలచిన యీమె ప్రేమయొక విలక్షణమైనది. కామభావాతీతమైనదనిచెప్పవచ్చును. శృంగారములేని ప్రేమ అమృతవల్లీ వాసుదేవుల నడుమచూపబడినది.
అమృతవల్లి విషకన్యయగుటలో గల యనార్థతను ఆయుర్వేద వైద్యులైన బ్రహ్మశ్రీ కేటేశ్వరశాస్త్రిగారిని సంప్రదించి శ్రీ రొంపచర్ల శ్రీనివాసాచార్యగారిట్లు వ్రాసియున్నారు. ఆవగింజంత ప్రమాణమునాభిని గ్రహించి గిద్దెడు నీళ్ళలో నానబెట్టవలెను. వానితోనూరు శనగగింజలమవేసి యానీరంతయు శనగగింజలకుపట్టునట్లుగా చేయవలెను. ఆనీటియందునానబెట్టబడిన శనగగింజలను దినముకొకటిగా తీసికొనవలెను. క్రమముగా ప్రమాణము హెచ్చించుచు నాభినేయత్యల్పప్రమాణములో గ్రహించుస్థితికి రావలెను. ఇట్లు విషపూరితమైన శనగలనుతిన్న మానవుడు విపరీతలక్షణములుగల శరీరముగలవాడగునని శాస్త్రము.
నాభియనగా విషమునుతనపూగుత్తులనడుమనుంచుకొన్నది. ఈ పూవులు ఎర్రనితంగేడుపూవువలెను భ్రమకల్పించగల్గియుండును. విషకన్యలను శతృవధలకు ప్రయోగించుట రాజులకు పరిపాటి.
విషకన్యకు హృదయముండునా అదికూడ విషపూరితముగనుండునా, అన్నవిషయము అమృతవల్లి, శరీరమే విషపూరితముగొని హృదయమమృతమని వెల్లడిచేసినది.
|