81
 

మ‌హేశ్వ‌రి

నాస్తి క ధూమ‌ము అను వ‌ల‌న‌యందు ప్ర‌ముఖ‌ముగ నున్న స్త్రీ పాత్ర మ‌హేశ్వ‌రి. ఈమె కాశ్మీర రాజ‌వంశ‌మున‌కు చెందిన స్త్రీ ఈ రాజులు మ్లేచ్ఛ‌రాజ సంప‌ర్క‌ముగ‌ల‌వారు. మ‌హేశ్వ‌రి వామ‌చార విధాన‌మును పాటించుచుండును. జ‌య‌ద్ర‌ధుడన్న‌వాని కామాగ్నిలోబ‌డి శ‌ల‌భ‌మువ‌లె త‌న జీవిత‌మును నాశ‌న‌ము చేసికొన్న‌ది. మ‌హారాణివ‌లె హాయిగా నుండ‌మ‌నిన మ‌హేశ్వ‌రి  జ‌య‌ద్ర‌ధుని వ‌ల‌న నిక్క‌ట్ల‌పాలై తుద‌కు మ‌ర‌ణ‌మునందిన‌ది.

కాశ్మీర‌దేశ‌పురాజుక‌ల‌కు మ్లేచ్ఛ‌రాజుల‌తోడి సంబంధ‌ము లెక్కువ‌యున్న‌వి. మ‌హేశ్వ‌రి తండ్రిపేరు శూర‌సేనుడు. సోద‌రుడు న‌ల‌సేనుడు. పురుషులెంత మ్లేచ్ఛ‌భావావిష్టులైన‌ప్ప‌టికిని స్త్రీలు మాత్ర‌ము మ్లేచ్ఛ‌దేశాచార‌ము న‌ల‌వ‌ర‌చుకొన‌లేదు. మ‌హేశ్వ‌రి త‌ల్లి గిరిజాదేవి దేవీభ‌క్తుకాలు. అయిన‌ను చాముండి బ‌గ‌ళ వారాహి మొద‌ల‌గు తీవ్ర‌దేవ‌తామూర్తుల నుపాసింప‌లేదు. సాక్షాత్ప‌ర‌బ్ర‌హ్మ ప‌దార్థ‌భూతురాలైన ల‌లితో పాస‌కురాలు. గిరిజాదేవి యొక్క దేవ్యుపాస‌నా ఫ‌లిత‌ముగ మ‌హేశ్వ‌రి స‌గ‌ము సాత్విక భ‌క్తియును, మ్లేచ్ఛ‌భావ ప్ర‌భావితుడైన తండ్రినుండి దేవ్యుపాస‌నాప‌ద్ధ‌తులు స‌గ‌మును న‌ల‌వ‌డెను.

మ్లేచ్ఛ‌భావ ప్ర‌భావ‌మే ప్ర‌వృత్తిగాగ‌ల వెలియోన‌స్సను గాయ‌కుని పాట‌ల‌కు మ‌హేశ్వ‌రి ముగ్థురాలైన‌ది. కొంత వ‌య‌స్సు వ‌చ్చిన తదుప‌రి యామె వెలియోన‌సున‌కు శిష్యురాలైన‌ది. అతడామెకు  క్షుద్ర‌విద్య‌ల‌ను నేర్పెను. త‌రువాత మ‌హేశ్వ‌రి తీవ్ర‌మూర్తియ‌గు చాముండీ దేవ్యుపాస‌కురాలైన‌ది. ఇట్టి ఉపాస‌న చేయువారు సౌమ్య‌భావ ప్ర‌పూరితులై యుండుట‌పొస‌గ‌దు. ఉపాస‌నావ‌స‌ర‌ముగ బ‌ట్టి తీవ్ర‌భాపుకులు తీవ్ర‌మ‌న‌స్కులు, ద‌యాదాక్షిణ్య‌ర‌హితులు క‌ఠోర‌నియ‌మ‌నిష్ఠాగిరిష్ఠులున‌యియుండ‌వ‌ల‌యును. ఇందువ‌ల‌న వీరి హృద‌య‌ము స‌హ‌జ‌లాలిత్వ‌మును కోల్పోయి కాఠిన్య‌త న‌ల‌వ‌రచుకొనును.

వెలియోన‌స్సును మ‌హేశ్వ‌రిని గూర్చి మ‌గ‌ధ‌రాజకుమారుడగు రిపుంజ‌యున‌కు త‌గిన క‌న్య‌య‌ని రాజ‌కుటుంబ‌మును రాయ‌బార‌మున‌డ‌పెను. మ‌హేశ్వ‌రి త‌ల్లిలేనిపిల్ల‌య‌గుట‌చేత స‌రియైన ప‌ద్ద‌తుల‌లో పెర‌గ‌లేదు. రిపుంజ‌యుడామెను చూచుట‌కువ‌చ్చిన‌పుడామె దాపున‌నున్న‌య‌డ‌విలోనొక కొండ‌కొమ్మ‌న‌నున్న ద్రాక్ష‌పండ్ల‌గుత్తిని కోయుచున్న‌ది. ఆమెయా ద్రాక్ష‌గుత్తిని పెట్టి యాత‌ని గుండెల‌పై కొట్టిన‌ది. అట్లు కొట్టుట‌లో నాతిన మొగ‌ముపైన‌ను గుండెల‌పైన‌ను శ‌రీర‌మంత‌యును ద్రాక్ష‌ర‌స‌ముచిందిన‌ది. అతని హృద‌య‌మంత‌యు మ‌ధుర‌మైపోయిన‌ది. ఆ ద్రాక్ష‌గుత్తిని మ‌న‌సున‌కు మ‌ద‌నుని పుష్ప‌బాణ‌మ‌యిభాసించిన‌ది.

మ‌హేశ్వ‌రి వివాహ‌మైన‌త‌రువాత వింధ్యార‌ణ్య‌ముల‌నడిమినున్న చాముండీదేవిని కొల‌చుట యారంభించిన‌ది. ఆదేవిమ‌గ‌ధ‌రాజుల‌చేత బ‌హుపురాత‌న‌కాల‌మునుండియు పూజింప‌బ‌డుచున్న‌ది. ఇందుల‌కు రిపుంజ‌యుడ‌డ్డుపెట్టలేదు. ఆస‌మ‌య‌మున‌నాదేవిని జ‌య‌ద్ర‌ధుడు తీవ్ర‌వ్ర‌తుడారాధించుచుండెను. దేవిని కొర‌డాతోకొట్టుట‌యును రండా వంటియ‌శ్లీల‌ప‌ద‌ముల‌చేత దూషించుట‌యును చేయుచుండెడివాడు. ఈత‌నివిమాచార‌మున కాదేవి యంగీకృత యైన‌ట్లే భాసించుచుండెడిది.

జ‌య‌ద్రధుని హృద‌య‌ము కృష్ణ వైర‌ముతో క‌ళ‌పెళ‌లాడుచుండెడిది. ఈత‌ని కృష్ణ‌ద్వేష‌ము బ‌హు స్త్రీ మాన‌భంగ‌ముల‌కు కార‌క‌మైన‌ది. శీల‌వ‌తుల శీల‌భంగ‌ము నీత‌డొక మ‌హావ్ర‌త‌మువ‌లె చేయుచుండెడివాడు. ఈత‌ని తీవ్ర‌భ‌క్తిని డంబాచార‌ముల‌కును భ‌యంక‌రాకార‌మున‌కును భ‌య‌ప‌డి య‌నేక‌మంది య‌బ‌ల‌లైన స్త్రీ లీ జ‌య‌ద్ర‌ధునికి లోబ‌డి త‌న మానాభిమాన‌మును బ‌లిచేసికొనిరి. ఇట్టితీవ్రోపాస‌కుల నెదిరించుట సామాన్య స్త్రీల‌కు సాధ్య‌ముకాదు.  అత‌డు లొంగనివారిపై య‌నేక‌ముల‌గు ప్ర‌యోగ‌ముల‌ను చేసి వారిని లొంగ‌దీసెడివాడు. వీని కాముక‌త్వ‌మున‌కు లోబ‌డి కొట్టుకొని బ‌య‌ట‌కు రాలేని స్త్రీల‌లో రాణియ‌గు మ‌హేశ్వ‌రి యొక‌తె. జ‌య‌ద్ర‌ధుడు స్త్రీల‌న‌ధిగ‌మించు స‌మ‌య‌మున నొక‌య‌భిన‌య‌ము చేసేడివాడు. స‌ర్వ‌ము దేవీప్రీత్య‌ర్థ‌ము చేయుచున్న‌ట్లీత‌డు వారిని భావించులాగున చేసెడివాడు. మ‌హేశ్వ‌రికూడ న‌ట్టి భ్ర‌మ‌లో ప‌డిపోయిన‌ది.

చాల‌కాల‌ము గ‌డ‌చిన త‌రువాత గాని మ‌హేశ్వ‌రి జ‌య‌ద్ర‌ధుని స్వ‌రూప‌ము గ్ర‌హింప‌లేదు. గ్ర‌హించిన త‌రువాత‌కూడ నాత‌ని క‌బంధ‌హ‌స్త‌మునుండి విడివ‌డుట క‌ష్ట‌త‌ర‌మైన‌ది. జ‌య‌ద్ర‌ధుని క్షుద్ర శ‌క్తుల‌కు మ‌హేశ్వ‌రి భీతినందిన‌ది. వీడు స‌ర్వ‌భార‌త‌దేశ‌ము మ్లేచ్ఛ‌ము చేసిగాని యంత‌రింప‌డు వీడు లోక‌మునందు బాతివ్ర‌త్య‌ము మిగుల‌నీయ‌డు అని మ‌హేశ్వ‌రి భావించిన‌ది.

మ‌హేశ్వ‌రి వింధ్య‌గిరి స్వామియ‌న‌బ‌డు జ‌య‌ద్ర‌ధున‌కు లొంగెన‌ని తెలిసిన త‌రువాత ప్ర‌జ‌ల‌కామె రాణియ‌న్న గౌర‌ము హృద‌య‌ము ల‌లో న‌శించిన‌ది. మ‌హాసేనాధిప‌తియ‌గు మునీకుడును సేనానియ‌గు వీర‌సేనుడును మ‌హేశ్వ‌రిపై త‌మ‌కుగ‌ల కోర‌కను బ‌హిర్గ‌త‌ము చేసిరి. తాఉ చేసిన‌దెంత య‌ప‌రాధ‌మో కోల్పోయిన‌దెంత విలువైన‌దో యామెగ్ర‌హించి కొనిన‌ది. మ‌హారాజీమెతో మాట‌లాడుట మానెను. మ‌హేశ్వ‌రి తానువింధ్య‌గిరిస్వామి చేత‌న‌నుభ‌వింప‌బ‌డుట దోష‌మ‌ని గాని రాజైన రిపుంజ‌యున క‌న్యాయ‌ము చేయుట య‌నిగాని భావింప‌క దైవ‌కార్య‌మును చేసితిన‌న్న భ్రాంతిలో నున్న‌ది. త‌న‌యొక్క‌యు వింధ్య‌గిరి స్వామి యొక్క‌యు నీ సంబంధ‌ము త‌న శీల‌మున‌కు సంబంధించిన‌దిగా త‌లంచ‌లేదు. అది స్త్రీ పురుష సంగ‌మ‌ము కాదు. దాని యందు శృంగార ర‌స‌ములేదు. అభిలాష‌ము లేదు. దీనియందుభిమాన‌ములేదు. ర‌మ‌ణ‌ములేదు. అని త‌మ సంబంధ‌మును గూర్చి మ‌హేశ్వ‌రి త‌నలోతాను చ‌ర్చించుకొన్న‌ది. కాని యింద‌లి దోష‌ము త‌రువాత న‌వ‌గ‌త‌మైన‌ది. ధీరురాలు కావుననే గ‌త‌మును గూర్చి చింతించుచు కూర్చొన‌క జ‌రుగ బోవుదానిని గూర్చి యోచించిన‌ది. భ‌యంక‌రుడైన జ‌య‌ద్ర‌ధుని యాట‌లు క‌ట్టింప‌వ‌లెన‌ని గాఢ‌ముగా త‌ల‌చిన‌ది. వింధ్యగిరి స్వామి త‌న కుమార్తె తుల‌సిని కూడ త‌న‌క‌డ‌కు తీసికొని ర‌మ్మ‌ని చెప్పినప్పుడు గాని మ‌హేశ్వ‌రి స్వామిని ఎదిరించుట‌కు సిద్ధ‌ప‌డు స‌మ‌య‌మున నామెకు స‌హాయ‌ప‌డుట‌కెవ్వ‌రును క‌న్పించ‌లేదు. భ‌ర్త సేనాధిప‌తి పరిచారికులు, మంత్రి మొద‌లైన‌వారంద‌రు ఆమె యెడ‌నొక చుల‌క‌న‌భావ‌ము నెర‌వుచుండిరి. గాని రాజ్ఞియ‌న్న గౌర‌వ‌భావ‌ము నెర‌పుట‌లేదు. అన్నివైపుల‌నుండి యామెకు మార్గ‌ము మూసికొని పోయిన‌ది.

పురుష‌సంతాన‌ము లేనందున మంత్రియైన మునీకుడు రాజ్య మ‌ప‌హరించుట క‌నేక‌ములైన యుక్తుల‌ను ప‌న్నెను. క‌డ‌కురాజున‌కు శ‌రీర‌స్వాస్థ్య‌ము త‌ప్పించుట‌కై కొండ‌జాతి వారిని పిలిపించిమందుల‌ను ప్ర‌యోగించెను. రాజు శ‌క్తిహీనుడ‌య్యెను. మునీకుడు రాణిని మ‌ర్యాద లేకుండ మాట‌లాడి ప‌రిచారిక‌ల‌ముందు అవ‌మాన‌ప‌ర‌చెను. రాణికింత‌టి ప్ర‌భంజ‌న‌ములో నిరువురు వ్య‌క్తులు ర‌క్ష‌కులుగ‌దోచిరి. ప‌రిచారిక‌య‌గు య‌న్న‌పూర్ణ‌యును, అంతఃపుర‌ర‌క్ష‌కుడ‌గు గంధ‌వాహుడును. ఆమెకువారు స‌హాయ‌ప‌డ‌గా మ‌హాప్ర‌తిభావంతురాలైన మ‌హేశ్వ‌రి మునీకునియాట క‌ట్టించిన‌ది.  రాజు విష‌ప్ర‌యోగ‌మున మ‌ర‌ణించెను. మునీకుడు త‌న‌సైన్య‌ముతో కోట‌ను స‌ర్వ‌భ‌వ‌న‌ముల‌ను  నాక్ర‌మింప‌ద‌ల‌చెను. కానిమ‌హేశ్వ‌రి మునీకుని ప‌న్నుగ‌డ‌ల‌న్నియును ముందుగానే గ్ర‌హించిన‌ది. విశ్వాస‌పాత్రుల‌గు సేనానాయ‌కుల‌చే రాజు శ‌రీర‌మునంటి ప్ర‌మాణ‌ములు చేయించిన‌ది. ఆమె స్వ‌య‌ముగ ఖ‌డ్గ‌విద్యానిపుణురాలు. ప‌ర్వ‌తేయులైన రాక్ష‌సుల‌వంటి స్త్రీల‌ను క్ష‌ణ‌ములో నోడించిన‌ది. రాజుమ‌ర‌ణ‌ముతో శోకించుచు కూర్చొన‌క త‌న‌పుత్రిక యొక్క భ‌విష్య‌త్తును రాజ్య‌భ‌విష్య‌త్తును గూర్చి కూలంక‌ష‌ముగ యోచించిన‌ది. దేశ‌మ‌ల్ల‌క‌ల్లోల‌ము కానీయ‌క‌ర‌క్షించిన‌ది. ఆమె స్వ‌య‌ముగ సేనానాయ‌కుడును మంత్రి వంటివాడునునైన మునీకుని వ‌ధింప నేర్పుగ‌లిగియున్న‌ది. చాతుర్య‌ముగ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించి త‌న‌రాజ‌నీతి చేమ‌ర‌ల పోయిన గౌర‌వ‌మునకు మూడింత‌లు ప్ర‌జ‌ల నుండియు అధికారుల‌నుండియు పొందిన‌ది. మ‌హేశ్వ‌రియ‌న్న‌చో ప్ర‌జ‌ల‌లో గౌర‌వ‌భావ‌ము పెల్లుబికి.భ‌య‌ము, గౌర‌వ‌ము ప్రేమ‌, భ‌క్తి రాజ్య‌ర‌క్ష‌ణ‌ము దుష్ట‌శిక్ష‌ణ‌ము, స్వ‌ధ‌ర్మ‌నిర్వ‌హణ‌ము మొద‌ల‌గు స‌ర్వ‌భావ‌ముల యేకీకృతిగ భాసించెను. ఇట్లు స‌ర్వ‌గుణ‌ములు మ‌హేశ్వ‌రి యందు స‌మ‌య‌మువ‌చ్చినపుడు ప్ర‌కాశిత‌మైన‌వి. మ‌హాప్ర‌తిభావంతురాలైన స్త్రీ మూర్తియై మ‌హేశ్వ‌రి రూపుగ‌ట్టిన‌ది.

మునీకుని కుమారుడ‌గు ప్ర‌ద్యోత‌నుని త‌న కుమార్తె ప్రేమించిన‌దిని తెలిసికొనిన‌ది. అతనికి ఏబ‌డి యేండ్ల వ‌య‌స్సున్న‌ద‌ని సంకోచించిన‌ది. కాని వాని సుస్వ‌భావ‌ము, రాజ‌భ‌క్తి, నిస్వార్థ‌ము, నిష్క‌ల్మ‌ష‌త యివి య‌న్నియును గ్ర‌హించి ప్ర‌ద్యోత‌నుని రాజ్య‌ర‌క్ష‌కునిగ తులిసికి భ‌ర్త‌గ నిర్ఱ‌యించిన‌ది. భ‌ర్త మ‌ర‌ణించిన దుఃఖ‌ములో కూడా నామె వివేక‌మేమాత్ర‌ము క్షీణింప‌లేదు. కాగా య‌వ‌స‌ర‌ముబ‌ట్టి ప‌దింత‌లు పెరిగిన‌ది. ఆమె ప్ర‌జాప‌రిష‌త్తు నేర్ప‌ర‌చిన నేర్ప‌రి. ప‌రిష‌త్తుచే మునీకున‌కు దేశ నిష్కాస‌మును విధింప‌చేసిన‌ది. త‌న‌న‌వ‌మానించిన మునీకునిపై, జ‌య‌ద్ర‌ధునిపై మ‌హేశ్వ‌రి ప‌గ దీర్చుకొనిన విధాన మ‌త్యంత విచిత్ర‌ముగ‌ను చాతుర్య‌ముగ‌నునున్న‌ది. భ‌ర్త‌నెట్లు మునీకుడు ఆడ‌విమందుల‌చే నిశ్శ‌క్తునిచేసెనో మ‌నీకుని కూడ‌న‌ట్లే నిశ్శ‌క్తునిచేసి య‌డ‌విలోనికి న‌డిపించిన‌ది. మ‌ర‌ల బ‌ల‌ము పొందుట‌కు వ్య‌వ‌ధినిచ్చి, తానును గంధ‌మ‌హుడును క‌లిసి జ‌య‌ద్ర‌ధ, మునీకుల‌పై యుధ్ధ‌ము ప్ర‌క‌టించిరి.


జ‌య‌ద్ర‌ధుడు మ‌హేశ్వ‌రి కూతురైన త‌ల‌సిని త‌న‌క‌డ‌కు గొని రానందుకు కుపితుడై యంతఃపుర‌మున‌కు వ‌చ్చిన స‌మ‌య‌మున కూడ మ‌హేశ్వ‌రి త‌న నీతిని ప్ర‌ద‌ర్శించిన‌ది. మొద‌ట భ‌య‌ప‌డిన‌ను ధైర్య‌ముతో ప‌రిస్థితుల న‌దుపులోనికి తీసికొనిన‌ది. గంగాధ‌ర పండితుడ‌న్న భ‌క్తునిచే జ‌య‌ద్ర‌ధుని ప్ర‌యోగ‌ముల‌ను త్రిప్పికొట్టించిన‌ది.

మ‌హేశ్వ‌రి మ‌హాక్రూరుడ‌గు జ‌య‌ద్ర‌ధునితో ద్వంద్వ‌యుద్ధ‌ముచేసిన‌ది. ఆమె చాతుర్య‌మిచ‌ట ప‌రాకాష్ఠ‌ద‌శ‌కు చేరుకొన్న‌ది. దోష‌భూయిష్ఠ‌మైన శ‌రీర‌ముతో జీవించుట కామెకిష్టములేదు. జ‌య‌ద్ర‌ధుని విశృంఖ‌ల‌త్వ‌ము నామోదింప‌లేదు. కావున ఖ‌డ్గ‌యుద్ధ‌మున తాను వానిని నిర్జించిన‌చో తాను త‌పస్సు చేసికొనుట నాయ‌ర‌ణ్య‌మున‌నే యుండ‌వచ్చును. లేదా జ‌య‌ద్ర‌ధుని చేతిలో మ‌ర‌ణించిన‌ను మేలేయ‌నుకొన్న‌ది. కుమార్తె తుల‌సియు ప్ర‌ద్యోత‌నుడును జ‌య‌ద్ర‌ధున‌ణ‌చ‌గ‌ల‌రు. ప్ర‌జ‌ల‌కు త‌న‌పైగ‌ల య‌ల‌స భావము పోయిన‌ను మ‌హేశ్వ‌రికి త‌న‌పై త‌న‌కున్న యేహ్య‌త పోకుండెను. జ‌య‌ద్ర‌ధుని వంటివాడు ప్రాణ‌ముల‌తో నుండ‌రాద‌ని యామెత‌ల‌చిన‌ది. ఆయుద్ధ‌మున మునీకుడును గంధ‌వాహుడును మ‌హేశ్వ‌రియును మ‌ర‌ణించిరి. జ‌య‌ద్ర‌ధుడు త‌న‌కు ప్రియ‌మైన మ‌హేశ్వ‌రిని తానే చంపించినందుల‌కు రోదించి చితినేర్పాటు గావించుకొని యందులోప‌డి మ‌ర‌ణించెను. త‌చ్చితాజ్వాల‌ల నుండి వెల్వ‌డిన పొగ నాస్తిక‌ధూమ‌మై త‌న ప్ర‌భావ‌మును స‌ముద్ర‌ముల‌ను స‌హిత‌ము దాటి ప్ర‌జ‌ల‌పై ప్ర‌స‌రింప చేయ‌గ‌ల్గెను. ప్ర‌జ‌లకు ఆద‌ర్శ‌ముగ నుండ‌వ‌ల‌సిన రాణి ధ‌ర్మ‌వ్య‌తిక్ర‌మ‌ణ‌ము చేసిన‌చో ఫ‌లిత‌మెట్లుండునో మ‌హేశ్వ‌రి స్వ‌య‌ముగ గ్ర‌హించుట మ‌హేశ్వ‌రి యొక్క పాత్ర‌పోష‌ణ మున‌నున్న విశేష‌ము.