88
 

హెలీనా

గ్రీకు రాజ్యాధిపుడైన సెల్యూక‌స్ కుమార్తె హెలీనా.  ఈమె సుంద‌రాంగి.  భార‌త‌దేశమునుండ వెళ్ళిన పినాకియ‌ను పండితుని యొద్ద అత‌ని భార్య‌యైన రోహిణి యొద్ద‌ను భార‌త సాంప్ర‌దాయ‌మును, చ‌రిత్ర‌ను సాహిత్య‌మును పురాణ‌ముల‌ను హెలీనా గ్ర‌హించిన‌ది. భార‌త‌దేశ చ‌క్ర‌వ‌ర్తి పై హెలీనాకు తెలియ‌క‌నే ఒక విధ‌మైన యాక‌ర్ష‌ణ క‌లిగిన‌ది. పినాకి హెలీనాకు సంస్కృతభాష‌ను బోధింప‌గా, పెక్కు సంవ‌త్స‌ర‌ములు హిందుదేశ‌మున రాజుల‌కు చామ‌ర‌గ్రాహిణిగ నుండి తిరిగి త‌మ‌దేశ‌ము వెళ్ళిన నీపాలి య‌న్న స్త్రీ చ‌క్ర‌వ‌ర్తి మాట‌లాడు మాగ‌ధి భాష‌ను నేర్పిన‌ది.

హెలీనాకు సంస్కృత భాష‌వ‌చ్చిన కొల‌ది భార‌తీయ సంస్కృతిపై అభిమానము మిక్కుట‌మైన‌ది. గ్రీసు దేశ‌స్థురాలై న‌ను రూప‌రేఖావిలాసాదుల‌చేత‌ను అలంకారాదుల‌చేత‌ను వ‌స్త్ర‌ధార‌ణాది విశేష‌ముల‌చేత‌ను భార‌తీయ స్త్రీవ‌లెన‌నున్న‌ద‌ని భార‌తీయులు చెప్పుకొనుట వినెడిది. స‌ముద్ర‌గుప్తుని గురించి వినిన‌దానినిబ‌ట్టి మ‌దిలోనొక య‌భిమానాతిరేక‌మును పెంపొందింప‌చేసికొనిన‌ది. కొంత‌కాల‌ము జరుగుస‌రికి హెలీనా హృద‌య‌ము భార‌తీయ భావ‌మ‌న్న‌ను భార‌త‌దేశ‌మ‌న్న‌ను పుల‌కలెత్తుచుండెడిది. ఆమెలో క‌ల్గుచున్న విమ‌ర్శ‌నాప‌టిమ భార‌తీయ గ్రీకు గాథ‌ల‌లోని యుక్తాయుక్త‌ముల‌ను గూర్చి చ‌ర్చింప‌గ‌ల్గిన‌ట్టిదియై యుండెను. హెలీనా యొక్క శ‌రీర‌ల‌క్ష‌ణ‌ముల‌న్నియు చ‌క్క‌ని భార‌తీయ స్త్రీ ల‌క్ష‌ణ‌ములే. ఆర్య‌జాతి స్త్రీ ల‌క్ష‌ణ‌ముల‌న్ని యునామెలో మూర్తీభ‌వించి యున్న‌వ‌ని చెప్ప‌వ‌చ్చును. హెలీనా శ‌రీర‌మేగాక విమ‌ర్శ‌నా దృష్టి కూడ భార‌తీయ‌మైన‌ది.

హెలీనా తండ్రికూడ నామెతో న‌ప్పుడ‌ప్పుడు హెలీనా భార‌తీయ వ‌నిత‌వలెనుండుట‌ను గూర్చి ప్ర‌సంగించుచుండెడివాడు. భార‌తీయ బ్రాహ్మ‌ణ కుటుంబిసులామె సౌంద‌ర్య‌మును బొగ‌డు చుండెడివారు. ఇందువ‌ల‌న హెలీనా యొక్క భార‌తీయాభిమాన‌ము ఆమెను భార‌తీయ స్త్రీలు పొగ‌డుట‌లో ప్రారంభ‌మైన‌ది. అంత‌నామెలో వారిపై ప్రేమ‌యునాద‌ర‌మును, వారి భాష‌ను నేర్వ‌వ‌లెన‌న్న య‌భిలాష‌యును పొడమిన‌వి. మ‌రియు నాభార‌తీయులువారి సంస్కృత భాష‌నుగూర్చి యాక‌స‌మున కెత్తి మాట‌లాడెడివారు. స‌ర్వ మ‌హాగ్రంధ‌యులా భాష‌లోన‌నేగ‌ల‌వు. స‌ర్వ‌విజ్ఞాన‌మాభాష‌చే యాశ్ర‌యించి యున్న‌ది. అదియే సంస్కృత‌ము. ఇట్టి సంభాష‌ణ‌ములు ఫ‌లిత‌ముగ నామె బుద్ది సంస్కృత భాష‌ను నేర్వ‌వలెన‌న‌డి యేత్సుక్య‌మును బొందిన‌ది. ఇట్లుద్దేశ పూర్వ‌క‌ముగ కాక‌పోయిన‌ను హెలీనాను పినాకి, రోహిణులు త‌న‌వైపునకుమ్రెగ్గున‌ట్లుచేసిరి.

అటు త‌రువాత హెలీనానాక‌ర్షించిన‌ది స‌ముద్ర‌గుప్తుడు. అత‌డు మ‌హాశూరుడు. రాజ్యాంగ‌నిపుణుడు. క‌విగాయకుడు. వైణికుడు, చిత్ర‌క‌ళానిపుణుడు, మ‌హాపండితుడు, ప‌ర‌మ‌సౌంద‌ర్య‌వంతుడు. ఈ పురుషోత్త‌ముని గూర్చి న పొగ‌డ్త‌లామెయెద‌కు హ‌త్తుకొనిన‌వి. ఆమెనేర్వ‌ద‌ల‌చిన సంస్కృత భాష‌కు క‌న‌ద‌ల‌చిన‌ఫ‌లిత‌మీ స‌ముద్ర‌గుప్తుడేయ‌ని హెలీనాకు మొద‌ట తెలియ‌లేదు. కానితాను నేర్వ‌వ‌ల‌సిన‌ది మాగ‌ధినా లేక సంస్కృత‌మునా స‌ముద్ర‌గుప్తున‌కు సంస్కృత‌ముకూడ వ‌చ్చునుగ‌దా ? ఈ భావ‌మామెహృదిలో పొడ‌సూపున‌ది వేల‌యోజ‌న‌ముల దూర‌మున‌నున్న హెలీనా సంస్కృత‌మునేర్చుట విజ్ఞానాభిలాష‌చేన‌యిన‌నాక్షేప‌ణ‌ములేదు. గాని సముద్ర‌గుప్తున‌కు సంస్కృత‌ము తెలియును గాన తాను కూడ‌నేర్చుట‌యేల ?  తాను పోయియాత‌నితో సంభాష‌ణ న‌డుపునా ?  అట్లు జ‌రుగుట సాధ్య‌మా ?  ప‌రిస్థితులందుకు అనుకూలించునాయ‌ను యోచ‌న హెలీనా చేయ‌లేదు. ఆమె ముగ్థ‌హృద‌య‌ము మాత్ర‌ము స‌ముద్ర‌గుప్త నామ‌శ్ర‌వ‌ణ‌స్మ‌ర‌ణ‌ముల‌చేత కించిద్విక‌సిత‌మ‌గుచున్న‌ద‌న్న సంగ‌తియామెకే తెలియ‌దు. అంత‌రాంత‌ర‌ముల‌లో నొక‌రూప మేర్ప‌డ‌క గుప్త ప‌రుప‌బ‌డ‌యున్న‌ది. ఈయూహ‌కు హెలీనా యొక్క యెడ‌ద త‌మ్మిపూవులోని దిమ్మ‌య‌డుగున నున్న స‌న్న నిదార‌ములు పొట‌మ‌రించు మెత్త‌ద‌న‌మున‌కు మెత్త‌ద‌న‌మునేర్ప‌గ‌ల‌సూదిబెజ్జ‌మంత ప్ర‌దేశ‌మున్న దోలేదో య‌నుచోట‌గ‌లిగిన యాయూహ‌కు ప్రాదుర్భావ‌ములేదు. త‌న‌కుతెలియ‌క‌నే త‌న హృద‌య క‌మ‌ల‌మున స‌ముద్ర‌గుప్తుడు ప్ర‌వేశించెను. హెలీనా రోహిణీపినాకులు చెప్పిన‌దంత‌యు న‌మ్మ‌క కొల‌ది విమ‌ర్శ‌చేయుట‌కూడ‌నేర్చిన‌ది. భార‌తీయుల‌కు బ‌హుదైవ‌ములేమి య‌నియుకోతులు ప‌రాక్ర‌మముగ‌ల‌వి యెట్ల‌గున‌నియునామె యాక్షేప‌ణ‌ము. ఆయాక్షేప‌ణ‌మునామె త‌మ‌దేశ‌ములోని విమ‌ర్శ‌కుడ‌గు ఫిలిప్యోన‌స్‌ను పినాకితో వాంచున‌ట్లుచేసి వారివాద‌న‌ల‌నుండి స‌త్య‌మును తాను గ్ర‌హించువ‌లెన‌ని భావించిన‌ది. ఫిలిప్యోన‌స్ అనిన హెలీనాకు వెగ‌టు. వానినామె బ‌హిష్క‌రించును. కాని యాత‌నివివేక‌ము మెచ్చుకొనును.

స‌ముద్ర‌గుప్తుడు తండ్రిని సోద‌రుని వ‌ధించి చ‌క్ర‌వ‌ర్తి య‌య్యోడ‌ని వినిన హెలీనా క‌ల‌వ‌ర‌ప‌డిన‌ది. శ్రీ‌రామ‌చంద్రుడాచ‌రించిన ధ‌ర్మ‌మున‌కు వ్య‌తిరిక్త‌ముగ భార‌త‌దేశ‌మునందే స‌ముద్ర‌గుప్తుడాచ‌రించెన‌నిన‌ది. గ్రీకుగాథ‌ల లోనివిష‌య‌ముల‌నుగూర్చియు హిందూపురాణ‌ముల‌ను గురించియువిన్న త‌రువాత వానిలోని విష‌య‌ముల‌ను గురించి విమర్శించి స‌త్య‌మార‌య‌గ‌ల‌శ‌క్తి ఆమెక‌బ్బిన‌ది. త‌మ‌గాథ‌ల‌లోనున్న హెర్క్యుల‌స్ ఆకాశ‌మును మోయుట యేవిపినాకి య‌డుగ‌గా యోచించిన‌ది. హ‌నుమంతుడు స‌ముద్ర‌మును దూకెన‌న్న‌విష‌య‌ము హెర్క్యులెస్ ఆకాశ‌ము మోసిన‌విష‌య‌మునుగూర్చి విమ‌ర్శ‌కులైన ఫిలిప్‌యోన‌స్ పినాకులు చ‌ర్చించుచుండ‌గ తానువిన‌వ‌లెన‌ని కుతూహ‌ల‌ప‌డిన‌ది. చ‌క్ర‌వ‌ర్తిని చూడ‌వ‌లెన‌న్న వాంఛాంకుర‌ము హెలీనా హృద‌య‌ములో క‌లిగిన‌ది.

ఫిలిప్‌యోన‌స్ రాజ‌దుహితయొక్క మ‌న‌సునా బ్ర‌హ్మ‌ణ దంప‌తులు పాడుచేయుచుండిర‌ని భావించెను. వారిరాక‌నాక‌ట్ట ప్ర‌య‌త్నించెను. వారు రానిచో హెలీనా వారికై యెదురు చూచెడిది. ఒక‌నాడు రోహిణి బొట్టు కాటుక పార‌ణుల‌ను పెట్టుకొని హెలీనా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు హెలీనా రోహిణ‌ఙ సౌంద‌ర్య‌మున కచ్చెరువుపొందిన‌ది. రోహిణిబ్రాహ్మ‌ణ‌స్త్రీల‌క‌న్న క్ష‌త్రియ కాంత‌లంద‌మైన వార‌నిచెప్పిన‌ది. చ‌క్ర‌వ‌ర్తి స‌ముద్ర‌గుప్తుని భార్య‌ను చూడ‌వ‌లెను. వారి సౌంద‌ర్య‌ము భూమియునాకాశ‌ము ప‌ట్ట‌దు అనెను. హెలీనా కంత య‌భిజాత్య భావ‌ము క‌లిగి నాకున్న నెక్కువ సౌంద‌ర్య‌వంతులా అని ప్ర‌శ్నించిన‌ది. రోహిణి యా విష‌య‌మును చెప్పుట‌కు స‌ముద్ర‌గుప్తుడే స‌మ‌ర్ధుడ‌నిన‌ది. స‌ముద్ర‌గుప్తుడు ప‌ట్ట‌మ‌హిషుల సౌంద‌ర్య‌ము నెరిగిన‌వాడు. స్త్రీ ర‌త్న‌ముల నెన్ను కొనుట‌లో ఘ‌నుడ‌ని చ‌క్ర‌వ‌ర్తి యొక్క సౌంద‌ర్య‌ర‌హ‌స్య వేతృత్వ‌మును పొగ‌డిన‌ది. రోహిణియంత‌గితోనాగ‌క హెలీనాకూడ‌న‌ట్టి సౌంద‌ర్య‌పోష‌క‌ములు వాడిన‌చో మ‌హారాణివ‌లెనుండున‌న్న‌ది. మ‌హారాణులు ప‌యోగించు సౌంద‌ర్య పోష‌క‌ముల‌ను వ‌ర్ణించిన‌ది. వారిక‌స్తూరి తిల‌క‌మును, బంగ‌రుపుప్పొడుల‌తో అత్త‌రుల‌తోచేసిన నేత్రాంజ‌న‌మును , వారి భూఫ‌ణ‌ముల‌న్ని యుధ‌రించిన‌చో స‌రిగాన‌ట్లేయుందువుఅనియ‌న్న‌ది. హెలీనాలో నీ మాట‌ల‌వ‌ల‌న నెట్టిమార్పుక‌లుగ‌వ‌ల‌యునో అట్టిమార్పే క‌లిగిన‌ది. హెలీనా క‌ట్లుచెప్పుట‌లో రోహిణిలోనెట్టి దురుద్దేశ‌ములేదు. కేవ‌ల‌ము హెలీనా సౌంద‌ర్య‌ములో భార‌తీయ‌చాయుల తోచుట‌తో నామె భార‌తీయాలంక‌ర‌ణ‌ములో మ‌రింత సౌంద‌ర్య‌వ‌తిగ భాసించి చక్ర‌వ‌ర్తి యొక్క రాణుల‌తో స‌మాన‌ముగ నుండున‌ని భావించుట‌వ‌ల‌న చెప్పిన‌ది. నీపాలియును గ్రీకుయువ‌తి భార‌తదేశ‌మునుండి వ‌చ్చిన‌దిని విని యామెను పిలిచి నీవు భార‌త‌దేశ చ‌క్ర‌వ‌ర్తియైన చంద్ర‌గుప్తునకు చామ‌ర‌గ్రాహిణిగ నున్నావ‌ట‌గ‌దా !  అందుచేత‌న‌చ్చ‌టి విష‌య‌ములు నిన్నుకొనుగొంద‌మ‌ని పిలిపించినాను అనిన‌ది. నీపాలి తాను స‌ముద్ర‌గుప్తున‌కు చామ‌ర‌గ్రాహిణిగ‌లేన‌ని తెల్పిన‌ది. హెలీనాకు స‌ముద్ర‌గుప్తుని యొక్క వివ‌ర‌ములు గ్ర‌హింప‌వ‌ల‌యున‌ని కోర్కెయుండెన‌ని చెప్ప‌వచ్చును. నీపాలివ‌ల‌న స‌ముద్ర‌గుప్తుని వివ‌ర‌ములు తెలియ‌లేదు.

క‌నీస‌మువారు మాట‌లాడుమాగ‌ధి భాష‌నైన నేర్చుకొన‌వ‌లెన‌ని తలంచిన‌ది. ఇందుల‌కామె తండ్రి సెల్యూక‌స్ కూడ ప్రోత్స‌హించెను. ఎప్పుడైన భార‌త‌దేశ‌మున‌కు పోయిన‌చో నాభాష ప‌నికివ‌చ్చున‌నినాడు. క‌నుక తండ్రియు కుమార్తెయును  భార‌త‌దేశ‌మున‌కు పోవ‌లెన‌న్న భావ‌మును ఊహామాత్ర‌ముగ‌నై న‌గ‌ల‌వారు. కానియిరువురి యుద్దేశ‌ములు భిన్న‌ములు. సెల్యూక‌స్ న‌కు భార‌త‌భూమిని జ‌యింప‌లెన‌నియు, కుమార్తెకు త‌న సౌంద‌ర్య‌పారావార‌మున‌కు న‌వ‌ధులు స‌ముద్ర‌గుప్తునిచే గ‌ట్టింప‌వ‌లెన‌ని యుభావ‌న‌. ఇరువురి బావ‌ముల‌కునొక‌రూపు యేర్ప‌డ‌లేదు. అవిసానుకూల ప‌డునోలేదో తెలియ‌దు. నీపాలి హెలీనా క‌త్తి యుద్ధ‌మునందు కూడ నిష్ణాతురాలినిజేసిరి. గ్రీకు భాష‌లోని మ‌హాకావ్య‌ములైన ఒడిస్సీ ఇలియ‌డ్ గ్రంథ‌మును లిద్గ‌త‌ము గావించుకొన్న‌ది. పినాకీ రోహిణుల యెద్ద‌రామాయ‌ణేతిహాస‌గాధ‌ల‌ను విని సంస్కృత‌మును నేర్చికొనిన‌ది. నీపాలి యొద్ద మాగ‌ధీభాష‌యును క‌త్తియుధ్ద‌మును నేర్చుట‌తో విద్య‌లో సంపూర్ణ‌త్వ‌మును సంత‌రించుకొన‌గ‌ల్గిన‌ది.

సెల్యూక‌స్ భార‌తదేశ‌మున‌కు అపార‌సైన్య‌ముతో బ‌య‌లుదేరెను. సేన‌తోనంతః పుర‌స్త్రీలు గూడ బ‌య‌లుదేరిరి. మ‌ధ్య‌మార్గ‌ములో నుండ‌గా ఫిలిప్‌యోన‌స్ యొక్క దుర్నీతి హెలీనాకు తెలిసిన‌ది. అత‌డు నీపాలివ్రాసిన‌ట్లుగ యూబుల‌స్ అను  సేనానాయ‌కున‌కు ప్రేమ‌లేఖ వ్రాసి పినాకి చేత పంపెను. పినాకి యూలేఖ‌ను నీపాలి చేత చ‌దివంప‌గా నిజ‌ము బ‌య‌ట‌ప‌డిన‌వి. త‌రువాత యోన‌స్ తాను మెగ‌స్త‌నీసుతో క‌ల‌సి స‌ముద్ర‌గుప్తుని ద‌గ్గ‌ర‌కు  రాయ‌బార‌మున‌కు వెళ్ళుదు ననియు, చ‌క్ర‌వ‌ర్తితో క‌త్తి యుద్ధ‌ము చేయుదున‌నియు సెల్యూక‌స్‌తో చెప్పెను. నీపాలీ పినాకులు యోన‌స్ యొక్క దురూహ‌ను హెలీనాకుచెప్ప‌గా హెలీనా క‌ళ‌వెళ‌ప‌డిన‌ది. ఆరాజు యుద్ధ‌ముచేయ‌గ‌ల‌డాయిని ప్ర‌శ్నించిన‌ది. యోన‌స్ వంటి దురూహ‌క‌ల వాడుండెన‌ని స‌ముద్ర‌గుప్తుని ముందుగ‌నే హెచ్చ‌రింపుమ‌ని పినాకిని కోరిన‌ది. స‌ముద్ర‌గుప్తుని చూడ‌క‌నే అతని క్షేమ‌మున‌కై హెలీనా యాతుర‌వ‌డుట‌లో నామెకు చ‌క్ర‌వ‌ర్తి పైగ‌ల ప్ర‌ణ‌య‌భావ‌మును వెల్ల‌డింప చేయుచున్న‌ది.

గ్రీకు సైన్య‌ము వ‌చ్చిన‌ది భార‌త‌దేశ‌ముపైకి యుద్ధ‌మునకేగాని యోన‌స్ చ‌క్ర‌వ‌ర్తి కీడుత‌ల‌పెట్టునేమెయ‌ని హెలీనా భీతిచెందిన‌ది. భార‌తదేశ‌మున‌కు వ్య‌తిరేక‌ముగ గ్రీకు సైన్య‌మున‌కు న‌హ‌కిరంచుచున్న పినాకిని దేశ‌భ‌క్తి లేదా చ‌క్ర‌వ‌ర్తిపై న‌భిమాన‌ములేదా ?  య‌ని ప్ర‌శ్నించిన‌ది. హెలీనా త‌న‌మ‌న‌సువిప్పి పినాకితోనిట్లు చెప్పిన‌ది. నా తండ్రి సుఖ‌ముగా నుండ‌వ‌ల‌యును. చ‌క్ర‌వ‌ర్తికి న‌పాయ‌మురారాదు అనిన‌ది. ఆభావ‌ము నందుకొని నీపాలి యిట్లు వ్యాఖ్యానించిన‌ది. హెలీనా తండ్రిని చ‌క్ర‌వ‌ర్తిని స‌మాన‌క‌క్ష్య‌లో నుంచిన‌ద‌ని, అప్పుడు హెలీనా త‌న‌మ‌న‌స్పేమి కోరుచున్న‌దో గ‌ణింప‌సాగిన‌ది. యోన‌స్ వ‌ల‌న స‌ముద్ర‌గుప్తున‌కు ఆప‌ద‌క‌లుగున‌ని తెలియ‌గ‌నే త‌న‌మ‌న‌సులోని మ‌ర్మ‌ము తెలిసిన‌ది. అత‌నికాప‌ద క‌లుగుట త‌న‌కెందుల కిష్ట‌ములేదు ?  క‌ష్ట‌ముగ‌నున్న దెందుల‌కు ?  తండ్రితో స‌మాన‌భాగ‌మున భార‌త‌దేశ చ‌క్ర‌వ‌ర్తిని తానేల‌యుంచిన‌ది. ఇన్ని ప్ర‌శ్న‌ల‌న పినాకీనీపాలుల న‌డుగుచు త‌న‌కే తెలియని త‌న‌హృద‌య‌మును బ‌హిర్గ‌త మొన‌రించిన‌ది. ఆమెకొ నిముష‌మునుండి పినాకీ, నీపాలులు, ఆత్మీయులైరి. ఆమె ప్రేమ‌ను తెలిసికొని ఆరు ఆ ప్రేమ‌ను పండించుట‌కు ప్ర‌య‌త్న‌ము చేయ‌సాగిరి. ఇందు సెల్యూక‌స్‌కెట్టి స్థాన‌మీయ‌లేదు.