8
 


నిజ‌మే చెప్పాలి.

ధ‌ర్మ శాస్త్రాల్లోనూ, పురాణేఇహాసాల్లోనూ, ఉప‌నిష‌త్తుల‌లోనూ,మ‌న ఋషులు స‌త్యం అన్న విష‌యానికి ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చారు. స‌త్యం అంటే య‌దార్థం. ఒక సంఘ‌ట‌న ఏ ప్ర‌కారంగా జ‌రిగితే ఆ ప్ర‌కార‌మే చెప్ప‌డాన్ని నిజం చెప్ప‌డ మంటారు. నిజానికి క‌ట్టుబ‌డ‌నిదే అబ‌ద్ధం.

స‌త్యంప‌ద అంటే నిజాన్నేచెప్పు, స‌త్యాన్ని ప్ర‌మ‌దిత‌వ్య‌మ్ స‌త్య‌ము నుండి జారిపోకు, స‌త్య‌శ్చ‌స్స్వాధ్యాయ‌ప్ర‌వ‌చ‌నే స‌త్యాన్ని గ్ర‌హించు, గ్ర‌హించిన దానిని బోధించు..అని తైత్తిరీయంలో అనేక ర‌కాలుగా స‌త్యాన్ని గురించి నొక్కి చెప్పారు.

ఇక పునిష‌త్కారులే మ‌రొక చోట న‌బ్రూయ‌త్ స‌త్య‌ను ప్రియం అని కూడా అన్నారు. నువ్వు చెప్పిన స‌త్యం అప్రియంగా ఉండేట‌ట్ల‌యితేఆ స‌త్యాన్ని చెప్ప‌కు అన్నారు. అస‌త్యాన్ని చెప్ప‌కు అన్నారేగాని అస‌త్యం చెప్ప‌మ‌న‌లేద‌ని గ్ర‌హించుకోవాలి.

భార‌తంలో శుక్రాచార్యుల‌వారు మాత్రం ప్రాణ‌విత్త మాన భంగ‌ముల యందు డొంక వ‌చ్చున‌ని చిన్న లైసెన్సు లాంటిది ప్ర‌సాదించారు. ప్రాణ‌హాని జ‌రిగేట‌ట్లుయితేనో ధ‌నం కోల్పోయే ప‌రిస్థితి వ‌స్తేనో ఏ మానాభిమానాలో మంట గ‌లిసిపోయేలా ఉంటేనో అబ‌ద్ధం చెప్ప‌వ‌చ్చు. అనే శుక్ర నీతిని అడ్డం పెట్టుకుని ప్ర‌తీ విష‌యానికి అలాటి అన్వ‌య‌మే చెప్పుకుని అస్తమానూ అబ‌ద్దాలేవేస్తూ కూడా తాము స‌త్య సంధుల‌మ‌నే అనుకుంటారు. అనుకోవ‌డ‌మే కాదు అంద‌రూ కూడా అలా అనుకోవాల‌నే భావిస్తారు కొంద‌రు.

మ‌రికొంద‌రికినోరు విప్పితే గంగాప్ర‌వాహంలా అబ‌ద్ధాలు అల‌వోక‌గా ప్ర‌వ‌హిస్తూ ఉంటాయి. ఉన్న‌దున్న‌ట్లుగా జ‌రిగింది జ‌రిగిన‌ట్లుగా చెప్ప‌డం స‌సేమిరా వాళ్ళ‌కి గిట్ట‌దు. ఇలా చిటికీ మాటికీ అల్లిబిల్లి క‌బుర్లు చెప్ప‌డం వ‌ల్ల క‌లిసొచ్చేది ఏమైనా ఉంటుందా అంటే ఎన‌భై పాళ్లు ఏమీ ఉండ‌ద‌నే చెప్పాల్సి వ‌స్తుంది. వాళ్ళు నిజం చెప్పినా న‌మ్మే స్థితిలో ఇత‌రులుండ‌రు స‌రిక‌దా వారి మాట‌ల‌కు చిల్లి గ‌వ్వ పాటి విలుక గూడా ఇయ్య‌క హేళ‌న‌గా కూడా చూడ‌టం క‌ద్దు.

ఈ అబ‌ద్ధాలు, చెప్పే క‌ళ‌లో ఆడ‌వారిది అరితేరిన చెయ్యి అని చెప్పుకుంటారు. ఆడ వారు అబ‌ద్ధం చెప్తే గోడ‌క‌ట్టిన‌ట్లూ మ‌గ వారు చెప్తే త‌డిక ప‌ట్టిన‌ట్లూ ఉంటుంద‌ని కూడా సామెత ఉంది.

ఇంకో సంగ‌తేమిటంటే స్త్రీల‌ను వ‌య‌స్సూ పురుషుల‌ను జీత‌మూ ఎంతా అని అడుగ‌కూడ‌దు. ఎందుకంటే అడిగినా  వాళ్ళ ద‌గ్గ‌ర్నుండి నిజం రాబ‌ట్ట‌లేమ‌నేట‌!

ఇంత‌కీ ఏది నిజ‌మో ఏది అబ‌ద్ద‌మో ఎలాగ తెలుసుకోవ‌టం వారి అల‌వాటునిబ‌ట్టే ప‌ట్టుకోవాలి. ఆ చెప్పేవారు రెండు మూడు సంఘ‌ట‌న‌ల‌లో ప‌సిగట్టి నిజం చెప్పేవారో అబ‌ద్ధం చెప్పేవారో క‌నిపెట్టెయ్య వ‌చ్చు.

పెద్ద‌వాళ్లు అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా చీటికి మాటికి అబ‌ద్దాలు చెబుతూ ఉంటే చిన్న పిల్లలు కూడా అబ‌ద్దాలు చెబుతూ వారు తల్లిదండ్రులే ఆద‌ర్శం అబ‌ద్దం చెప్ప‌డం త‌ప్పు అనే భావన కూడా ఆ పిల్ల‌ల్లో క‌ల‌గ‌దు స‌రిగ‌దా అలాగే చెప్పాలేమో అని కూడా అనుకుంటారు. కొన్ని కొన్ని కుంటుంబాల్లో పిల్ల‌లూ పెద్ద‌లూ అన్న భేదంలేకుండా ర‌క‌ర‌కాల క‌ల్ప‌న‌లు చేసేయిగ‌ల‌రు. అందుకే అస‌త్యం చెప్ప‌డం కూడా హెరిడిట‌రీగా వ‌చ్చే కొన్ని వ్యాధుల్లాగా త‌ర‌త‌రాలుగా వ‌స్తూ ఉంటుందేమోన‌న‌పిస్తుంది.

భార్య‌భ‌ర్త‌కు తెలీయ‌కుండా డబ్బుదాచుకుని ఏ చీరో బంగార‌మో కొనుక్కుంటుంది. అది త‌మ పుట్టింటి వారిచ్చార‌ని చెప్తుంది. పిల్ల‌లు ఈ సంగ‌తంతా చూస్తూనే ఉంటారు. వీళ్ళు అలాగే  అమ్మ స‌రుకులు తెమ్మంటే క‌మీష‌న్ పుచ్చుకొని ఏ సినిమాకో చెక్కేసి స్కూలుకెళ్ళామ‌ని చెప్తారు. అమ్మ‌కి తెలిసినా గట్టిగా నిల‌దీసి అడ‌గ‌లేదు. ఒక‌వేళ అడిగితే నువ్వు మాత్రం అబ‌ద్దాలు చెప్ప‌వా అంటారు. లేదా నీ బండారం నాన్న ద‌గ్గ‌ర బ‌య‌ట‌పెడ‌తాం అని బెదిరించ‌నేనా బెదిరిస్తారు. ఇహ ఆ త‌ల్లి అబ‌ద్ధం చెప్ప‌డం త‌ప్పు నిజ‌మే చెప్పాలి అనే విష‌యాన్ని ఎలా బోధిస్తుంది ?  ఆ అర్హ‌త నామె కోల్పోయింద‌నేది నిస్సందేహం.

మీ వయ‌స్సెంత అడిగితే ఉన్న దున్న‌ట్లుగా చెప్ప‌క అబ‌ద్ధం చెప్పాల్సిన అవ‌సరం ఏమిటి ?  అని ఆలోచిస్తే ఏమి లేద‌నే స‌త్యం బోధ‌ప‌డుతుంది. ఉన్న వ‌య‌సు చెప్తే వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు. కొంద‌రు  ఇంచుమించు త‌మ వ‌య‌స్సు వాళ్ల‌ని అంటీ అని పిలుస్తారు. అలా పిలిస్తే వారు చిన్న‌వారూ వీరూ పెద్ద‌వారూ అయిపోరు.

అలాగే త‌మ‌కొచ్చే జీతాన్ని చెప్పినా ఫ‌ర‌వాలేదు. ఎక్కువైతే వాళ్ళ‌కి ఒరిగేదిగాని త‌క్కువ చెప్తే త‌రిగేదిగానీ ఉండ‌దు. నిజం నిప్పులాంటిద‌నీ నిజం నిల‌క‌డ మీద తేలుతుంద‌నీ మన‌కు గట్టి న‌మ్మిక‌. ఎప్ప‌టికైనా భూమి గ‌ర్భం చీల్చుకుని వచ్చే మొల‌క‌లాగ నిజం మొల‌క‌కు వ‌స్తుంది. ఈలోగా అల్లిబిల్లి క‌బుర్లాడి అల్ల‌రై పోవ‌డం శుద్ద తెలివి త‌క్కువ‌.

పెద్ద వాళ్ళు స‌త్య సంధులై పిల్ల‌ల‌కు ఆద‌ర్శ‌ప్రాయులై ఉండ‌గ‌ల‌గ‌డ‌మే అంద‌రి క‌ర్త‌వ్యం. స‌త్యం జయించుగాక !