చదువూ సంస్కారమూ
చదువుకున్న వారంతా సంస్కార వంతు లేనా ? సంస్కారవంతులు చదువుకున్న వారేనా ? చదువుకీ సంస్కారానికీ సంబంధం అని వేళలా తప్పనిసరిగా ఉండకపోవచ్చు. చదువునేర్చుకుంటే వచ్చేదీ, బట్టీపడితే వచ్చేదీ అనుకుంటే, ఈ చదువువల్ల సంస్కారం పెరిగే అవకాశం తక్కువ !
సంస్కారం అనేది జన్మతః కొంత ఉన్నప్పుడు చక్కని చదువువల్ల ఆ సంస్కారం వృద్ధి పొందేలాగున విద్యార్థిని మలచే వీలు గురుదేవుల కుంటుంది.
ప్రహ్లాదుడు పాలుగారే పసివయసులోనే చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రీ అన్నాడంటే అతని సంస్కార పుష్పం పుట్టుకతోనే ఫలవంతం కాగల్గిందన్నమాట ! ఆ మర్మం ఏమిటో ? చదువంటే ఏమిటి ? ఇక్కడి కొండవుంది, అక్కడా నదివుంది. ఈ కొండ ఎత్తు ఎన్ని మీటర్లు ఆ వైశాల్యమిన్ని మీటర్లు ఆ రాజు ఇన్ని యుద్ధాలు చేశాడు ఈ రాజు ఇన్ని దేశాలు జయించాడు. పొట్లకాయలో ఏ విటమిన్లున్నాయి. రాతియుగంలో ఇనప పరికరాలు లేవు. ఇలాంటి విషయలున్న పాఠ్యాంశాలని ఉపాధ్యాయులు విద్యార్థులకి బోధిస్తారు. చెప్పిన విషయాలు వారు విన్నారా ? విన్నవి బుర్రలో నిక్షిప్తం చేసుకోగల్గారా ? నిక్షిప్తం చేసుకోగల్గింది తిరిగి వెల్లడించ గల్గుతున్నారా ? పరీక్షలలో ఎన్ని మార్కులు తెచ్చుకోగల్గుతున్నారు ? ఎన్ని డిగ్రీలు సంపాదించగల్గుతున్నారు ?
ఇదేనా చదువంటే ? నిజానికి పైకి ఇదే చదువు నూటికి అరవై శాతం మార్కులు తెచ్చుకో గల్గిన పిల్లవాడు తెలివిగలవాడుగా పరిగణింప బడతాడు. అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నవాడు విశేషమైన ప్రజ్ఞాపాటవాలు వాడిగా పరిగణింప బడతాడు. ఇదే చదువైతే మనం మనది భారతీయ సంస్కృతి అని వేద సంస్కృతి అని మన వెన్ను మనమే చరుచుకోనవసరం లేదు. గొంతు చించుకో నవసరమూ లేదు. ఇక్కడే ప్రహ్లాదుడు చెప్పిన చదువులలో మర్మమేదో ఆకశింపు చేసుకొనే అవసరం కన్పిస్తుంది. ఈ మర్మమే చదువు ద్వారా సంస్కారాన్ని ఉద్దీపించేయగలిగే మేలు కొలుపు గీతం కావల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్తోంది.
చదువుకో బాటుగా సంస్కారాన్ని కూడా అబ్బేలాగ చేయవల్సిన బాధ్యత గురువుల మీద ఎంతో ఉంది. సంస్కారం నేర్పితే వచ్చేది కాదు. స్వతహాగా రావాలిగదా ! అన్నప్రశ్న తలఎత్త వచ్చు ! పదే పదే ఒక విషయాన్ని చెప్పినట్లయితే పలుకురాని రామచిలుక పలక చేరుస్తుంది ! మనం అన్నమాటే తిరిగి అంటుంది. ఇది యాంత్రికం.విద్యార్థి కూడా కొన్ని విషయాలు యాంత్రికంగా ముందు నేర్చుకున్నప్పటికి మిగతా జంతువులలో లేని మేధ మానవుల కుండటం చేత క్రమంగా ఆ మేధ కార్యోన్ముఖం అయ్యి జ్ఞానంవంతుడు కాగలడు. పాఠశాలలో ఉపాధ్యాయులు సందర్భం వచ్చినప్పుడల్లా పాఠ్యాంశాలతోపాటు మంచి విషయాలు రంగరించి చెప్పినప్పుడు, ఆ విషయాలు వారి చిన్ని మెదడులలో నిలిచి పోయే అవకాశం తప్పకుండా ఉంటుంది.
ఉదాహరణగా అశోకుడు చెట్లను నాటించెను. చెరువులను త్రవ్వించెను. ఇదే నా చరిత్ర అంటే అన్న విమర్శను తరచూ వింటూ వుంటూం. ఒక మహా చక్రవర్తికి చెట్లు నాటించాల్సి అవసరం ఎందుకు కల్గింది ? అన్న ఆలోచన విద్యార్థులలో రేకెత్తించాలి ! ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలకు నీడనీయడమే కాకుండా వృక్షాల వల్ల వాతావరణం కాలుష్యం కాకుండా వుండి సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి దేశం సస్యశ్యామలంగా వుంటుందన్న విషయం మన పాలకులకు ఆ కాలంలోనే తెలుసుకున్న విషయం విద్యార్థులకు బోధ పరచాలి ! ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. అదే మర్మం . ఆ మర్మాన్ని గ్రహించే శక్తిని విద్యార్థులకు ప్రసాదించే శక్తి గురువులకుంది. అజ్ఞానం నుంచి జ్ఞానానికి నడిపంచే మార్గదర్శకులు గురువులు ! గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురవే మహేశ్వరుడు అని గురువునకు త్రిమూర్తాత్మకత్వాన్ని ఆపాదించగల్గిన మహా సంస్కార వంతమైనది మన సంస్కృతి.
కాని ఈనాడు ముక్కుపోడం మాష్టారు పొట్లకాయి మాష్టారు బుడ్డిపంతులుగారు అని విద్యార్థుల చేత మారు పేర్లతో పిలవబడుతున్నారు. (కొందరు మాత్రమే). వార్తా పత్రికలలో గురుదేవులపై విద్యార్థులు చేయి చేసుకొన్న సంఘటనలను కూడా చదువుతున్నాం ! ఇలా జరిగేవి చాలా కొద్ది సంఘటనలే అయినా విన్నప్పుడు హృదయం అమితమైన బాధకు లోనుగాక తప్పదు. ఇలా జరగడానికి కారణమేమిటో ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి ! నన్ను గౌరవించు అని గురువు ఎప్పుడూ కోరడు ! అతని సత్ర్పవర్తనకు సద్భోధకూ ప్రభావితుడైన విద్యార్థి తనకు తెలీకుండా తానే గురువును గౌరవించి మొదలు పెడతాడు.
ఉపాధ్యాయుడు విద్యార్థికి ఆదర్శప్రాయుడుగా ఉండాలి ! తమ ప్రవర్తన ద్వారా పిల్లలలో ఉత్తేజాన్ని కల్గించేలా ఉండాలి ! విద్యార్థుల చిన్ని మనసులు శూన్య పాత్రలవంటివి. ఆ పాత్రలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరిసర వాతారణమూ ఎలాంటి విషయాలతో నింపితే వాటితోనే నిండుతాయి.
చిన్న వయసులో పిల్లల మనసులలో నాటుకొనే విషయాలే వారి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లేత వయసులోనే పిల్లలకు మంచి భావాలనూ మంచి ప్రవర్తననూ మంచి సంస్కారాన్నీ పెంపొందించే వీలూ అవరసమూ ఉపాధ్యాయులకెంతో వుంది.
ఇక సంస్కార మంటే ఏమిటో అక్షరరూపంలో చెప్పలేము. ఒక సంఘటనకు చలించే హృదయమే అర్థం చెప్పగలదు.
సహనావతు సహవే భునక్తు అన్న మంత్రానికి వయసుతో నిమిత్తం లేకుండా ప్రతివిద్యార్థికి సరియైన అర్థాన్ని, వారి వయసులోకి దిగి వారికి అర్థమయ్యే మాటలతో, భాషతో, భావాలతో బోధించిన నాడు బిడ్డ సంస్కార వంతుడు తప్పక కాగలడు. తద్వారా సంఘమూ దేశము సంస్కార పూరితం కాక ఏమవుతుంది ?
|