10
 

దేవ‌దాసి

వేయి ప‌డ‌గ‌లు అనే న‌వ‌ల‌లో గిరిక పాత్ర‌ను అత్య‌ద్భుతంగా సృష్టించారు విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారు. ఈ గిరిక దేవ‌దాసి. సుబ్బ‌న్న పేట అనే  గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల‌స్వామికి నాట్య నివేద‌నాలు చేసే అపురూప‌న‌ర్త‌కి. గిరిక నాట్య‌స‌మ‌ర్ప‌ణంతో స‌రిపెట్టుకోక హృద‌యాన్ని కూడా వేణుగోపాలునికి అంకితం చేసికొంది. ఈమె నాట్య‌భాగీర‌థిని సుబ్బ‌న్న‌పేట‌లొ అవ‌త‌రించ‌ప‌చేసింది. గీత గోవిందాన్ని గిరికాగోవిందంగా తారుమారు చేసి ఆ స్వామికోసం విర‌హంతో త‌పించి పోయి తుద‌కు కైవ‌ల్య‌ప‌దానికి చేర‌కుంది.

ఇది క‌థ‌. చ‌ద‌వ‌డానికి చాలాసొంపుగా వుంటుంది. నిజ‌జీవితంలో ఇలాంటి మ‌రో గిరిక‌ను చూస్తూ చూస్తూ భ‌గ‌వంతుడికే వ‌దిలేయ‌గ‌ల పురుష పుంగ‌వులు య‌దార్థ జీవ‌నంలో త‌ట‌స్థ‌ప‌డ‌తారా ?  ప‌డ‌రు. ప‌డ‌రు. ప‌డ‌రు. అనే న‌గ్న స‌త్యాన్ని ఈ నాటి జోగినుల క‌న్నీటి గాధ‌లు విప్పిచెప్తున్నాయి.

కొన్ని త‌రాల‌క్రింద‌ట రాజులు జ‌మిందారులు దేశాన్నేలే త‌రుణంలో ప్ర‌జ‌ల‌లో భ‌క్తి భావాలు పెంపొందించేందుకు దేవాల‌య‌ల‌ను నిర్మించేవారు. దేవాలం నిర్మిస్తే మ‌హాపుణ్యం వ‌స్తుంద‌నో లేక చేసిన ఘోర పాపాల‌కి పుణ్య‌క‌ర్మ విరుగుడుగా వుంటుంద‌నో కూడ గూళ్ళూగోపురాలూ క‌ట్టించ‌డం ఉన్న ఆల‌యాల్లోని దైవాల‌కు న‌గ‌లూ నాణ్యాలూ కిరీటాలు వ‌గైరా వ‌గైరా ఘ‌న‌మైన బ‌హుమానా లీయ‌డం కూడా చేస్తుండేవారు.

గుడి క‌ట్టించ‌గానే స‌రికాదు. రోజూ గుళ్ళోదీపం పెట్టాలి. నైవేద్యాలు పెట్టాలి షోడ‌శోప‌చారాలు చెయ్యాలి. ఇందుకు గాను భూదాన‌, గోదాన‌, స్వ‌ర్ణ‌దానాదులు చేసేవారు. ఈ ధ‌నంతో ఆల‌యంలోని స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు అమ‌రుతూ ఉండేవి.

ప్రాతఃకాలాన మేల్కొలుపు ద‌గ్గ‌ర నుండి రాత్రికి ప‌వ్వ‌ళింపు సేవ‌వ‌ర‌కు కాజోప‌చారాల‌తో దైవాఉ త‌ల‌మున‌క‌లైన పోతారు ప‌ర‌వ‌డి దినాల్లో ఈ భోగాలు మ‌రింత ఘ‌నంగా జ‌నంలో భ‌క్తి చైత‌న్యం హెచ్చ‌య్యేలాగా జ‌రుగుతాయి.

ఈ అన్ని విష‌యాలూ బాగానే ఉన్నాయి. ఎటొచ్చీ నాట్య‌సేవ‌కు అంకితం అయిన దేవ‌దాసీల ప‌రిస్థితే ఎటూ కాకుండా పోయింది.

దేముడికి భోగం చేసేవారు కాబ‌ట్టి ఈ దేవ‌దాసీ ల‌ను భోగాంగులు అనేవారు. మృదంగం, స‌న్నాయి నాద‌స్వ‌రం వాయించేవాళ్ళు కూడా దేవ‌దాసీల లాగానే వంశ‌పారంప‌ర్యంగా కొలువు చేసినా ఎవ‌రికీ లేని స‌మ‌స్య దేవ‌దాసికే వ‌చ్చి ప‌డ్డ‌ది.

ఆమె స్త్రీ. అందునా క‌ళాకారిణి రూప‌సి కూడా అయితే మ‌రి చెప్ప‌నే అక్క‌ర‌లేదు. మిఠాయి పొట్లానికి చీమ‌లు ఈగ‌లూ ఆశ‌ప‌డిన‌ట్లుగా దేవదాసిని స్వంతం చేసికోవెల‌ని చాలామంది ఉవ్విళ్ళూరి పోయేవారు.

విగ్ర‌హాల‌ముందు గ‌జ్జ‌క‌ట్టి హావ‌భావాల‌తో ఆ రాతి బొమ్మ‌ను మెప్పిస్తోందో లేదోగాని ర‌సిక‌త్వంచూపి త‌మ‌ను మెప్పిస్తే బాగుండున‌ని భూకామందుల‌కు ఆశ‌గా ఉండేది.

ఆ త‌రువాత ధ‌నం ఆశ‌చూపో న‌గ‌లూ పొలాలూ కొండ్ర‌లూ ఆశ‌చూపో బెదిరించో అదిరించో లాలించో దేవ‌దాసుల‌ను త‌మ పాద దాసులుగా చేసికొన్నారు కొంద‌రు మ‌దాంధులు. మోజుతీరాక ఆమె బ్ర‌తుకు బ‌జారుపాలే. ఈ భోగాంగ‌న ఇల వారాంగ‌న‌యై నికృష్ట‌మైన జీవితం గ‌డ‌పాల్సి వ‌చ్చేది.

అంద‌చందాలు జ‌వ‌స‌త్వాలు ఉడిగిపోయాక శ‌రీరం రోగంతో కుళ్ళిపోయి ఆక‌లికి ఎండి పోయి భాధ‌ల‌తో చివికి పోయాక ఆమెను క‌న్నెత్తి ప‌ల‌కిరించిగాని పాపానికొడిగ‌ట్టుకునే అగ‌త్యం ఎవ్వ‌రికీ ఉండ‌దు.

కొంద‌రికి క‌సిగా ఉంటుంది. అంతే కావాలి. ఇలాంటి శిక్ష దీనికి ప‌డాల్సిందే య‌వ్వ‌నంతో క‌న్ను మిన్నూ కాన‌క అఘోరించింది అని తిట్టుకుంటారు. అలా దేవ‌దాసీల‌కు పుట్టిన పిల్ల‌లు మ‌ర‌లా దేవ‌దాసీలుకావ‌ల్సిందే. అదొక కులం అయ్యింది. వేశ్యాకులం అంటే ఎంత‌టివాడైనా హీనంగా చేస్తారు.

భ‌గ‌వంతుడికి నాట్య‌సేవ చేసేవారు వివాహం లేకుండా ఆ విగ్ర‌హానికే అంకితం అయిపోడం ఎందుకు ?   దేవుడ్ని నిత్యంపూజించే అర్చ‌కులు బ్రహ్మ‌చారులుగా ఉండి పోతున్నారా ?  ఈ నియ‌మం స్త్రీల‌కే ఎందుకు పెట్టారు ?  కేవ‌లం స్వార్థంచేతేన‌ని తెలిసి పోవ‌టం లేదూ ?

ప్ర‌స్తుతం న‌ర్త‌కీమ‌ణులు దేవాల‌యాల్లో నాట్య సేవ చెయ్యటం లేదు.ఇది మంచి సంస్క‌ర‌ణే.

కాని కొన్ని తెలంగాణా జిల్లాల‌లో జోగినుల‌నే పేర కొంద‌రు స్త్రీలు ఎంతో హైన్య‌మైన జీవ‌నాని గ‌డుపుతున్నారు. ఆనాటి వారంగ‌న‌ల‌క‌న్నా ఈ జోగినుల బ్ర‌తుకు ఎంతో ద‌య‌నీయంగా ఉన్న‌ది.

ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు ప‌దివేల పై చిలుకు జోగినులు ఉన్న‌ట్లు స‌ర్వే వల్ల వెల్ల‌డ‌య్యింది. క‌రీంన‌గ‌ర్ మొద‌లైన జిల్లాలోనే గాక సికింద‌రాబాద్ వంటి ప‌ట్ట‌ణాల్లో కూడా వీరి ఉనికి ఉన్న‌ట్లు తెలిసింది.

చిన్న‌చిన్న పిల్లల్ని పాల్గారే పాప‌ల్ని ఆరేశ్ళ వ‌య‌స్స‌ప్పుడే ఎల్ల‌మ్మ దేవ‌త స‌మ‌క్షంలో పోతురాజు అనే రాయికిచ్చి పెళ్ళి చేస్తారు. ఈ దేవ‌త కూడా స్త్రీయేక‌దా తోటి ఆడ‌దాని .జీవితం ఇలా క‌న్నీటిపాలు చేయ‌డానికి దీక్ష పూనుతుందా ?  అలా ఎన్న‌టికీ కాదు. ఈ పాప‌భార‌మంతా స్వార్థ‌పూరితులైన కామాంధుల‌ది. మ‌దాంధుల‌ది. చిన్న చిన్న ఊళ్ళల్లో ప్ర‌జ‌లు మ‌రీ మూఢాచారాలు ప‌ట్టుకుని వేళ్ళాడతారు. ఎవ‌రికి ఏ చిన్న నెప్పివ‌చ్చినా అది దేవ‌త ఆగ్ర‌హ‌మే అనుకుంటారు.

ఎల్ల‌మ్మ‌దేవ‌త భార్య‌ని ఏలుకోవ‌డానికి ఆ గ్రామంలోని ఏ పుల్ల‌య్య‌కైనా అధికారం ఉందా అని ఒక్క‌రైనా ఆలోచించ‌రు త‌ప్ప‌ని చెప్పిన వారిపైకి యుద్ధానికి వ‌స్తారు.

ఒక మంగ ఒక గంగ ఓ సీతాలు, రాజ్య‌ల‌క్ష్మి, జోగినులై ఊరుమ్మ‌డి ఆస్తులై ద‌య నీయంగా బ్ర‌తుకులు నీడుస్తూన్నారు.

వేశ్యావాటిక‌లుగా మారే జోటినుల వాడ‌లు క్ర‌మంగా సుఖ‌వ్యాదుల‌కు స్థావ‌రాలుగా మారిపోతున్నాయి. మ‌హిళాసంఘాలు జోగినుల స‌హాయ‌నిధి నొక‌దానిని ఏర్పాటు చెయ్యాలి.

ప్ర‌భుత్వం వీరికి పాయంచేసేందుకు వ‌చ్చింది. అదికారులు స‌ర్వే జ‌రిపంచారు. రిజిస్లేటివ్  మెజ‌ర్స్ ఎన్నో తీసుకుంటున్నారు. వీరి స‌మ‌స్య‌కు ఈ మాత్రం చాల‌దు.

సాంఘికంగా అర్థికంగా వీరిని లేవ‌నెత్తాలి ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కు విద్య యువ‌తుల‌కు ఉద్యోగాలు ముస‌లి వారికి ఆహార‌ము అందేలా చూడాలి. ఈ అంద‌రికి గృహాలు ఉన్న‌ప్పుడు వీరు తాము కూడా మాన‌వుల‌మే అనే ఆలోచ‌న క‌ల్గుతుంది. వీరి బుద్ధి మ‌న‌సు విక‌సించేలా వినోద‌కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు  చేయాలి. ఇలా అని మ‌హిళా సంఘాలు కంక‌ణం క‌ట్టుకొని తోటి స్త్రీల జీవితాల‌కు వెలుగును ప్ర‌సాదించేందుకు కృషి చేయాలి.