12
 

సేల్స్ గ‌రల్స్‌

 ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిప‌తూడంతో భార్యాభ‌ర్తలిద్ద‌రూ సంపాదిస్తేత‌ప్ప సంసారం న‌వ‌డ‌దు. పెద్ద‌పెద్ద జీతాలు వ‌చ్చేవారికి అవ‌స‌రాలు కూడా పెద్ద‌గానే ఉంటుంటాయి. టి.వి. కారు, కూల‌రు, ఫ్రిజ్ మొద‌లైన‌వి వారి ప్రాణానికి వారికి నిత్యావ‌స‌రాల‌నుగానే అన్పిస్తాయి. ఈ వ‌స్తువుని నిజానికి మైన్‌టైన్ చెయ్య‌డ‌మంటే ఏనుగుని మేప‌డంలాగానే ఉంటుంది. అందుక‌ని పెద్ద జీతాలు తెచ్చుకోనేవారు కూడా భార్య సంపాదిస్తేనే బాగుండున‌ని భావించ‌డం కూడా క‌ద్దు. పీతతిప్ప‌లు పీత‌వి అన్న‌ట్లు. అస‌లు బాధంతా క్రింద‌త‌ర‌గ‌తి వారిక‌న్న ఒక మెట్టుపై నున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిదే. అర్థికంగా త‌ర‌గ‌తుల‌ను విభ‌జించేట‌ప్పుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిక‌న్నా పైన రెండుమెట్లు క్రింద‌కు రెండుమెట్లు వేసుకోవాలి.

బాగా చ‌దువుకోగ‌ల్గిన స్త్రీలు డాక్ట‌ర్లు, ఇంజ‌నీర్లు, లెక్చ‌ర‌ర్లు, బ్యాంక్ ఆఫీస‌ర్లు వంటి పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఆడంబరంగా జీవితాల‌ను వెళ్ళ‌దీసుగ‌ల్గుతారు. డిగ్రీ స్థాయితో చ‌దువుని ఆపేసిన‌వారు ఏక్లెరిక‌ల్ పోస్టులోనో, హైస్కూల్ టీచ‌ర్లుగానో ఉండి జీవితాన్ని సుఖ‌మ‌యం చేసుకోగ‌ల్గుతారు. ఇహ ఎటొచ్చీ స్కూల్ ఫైన‌ల్ వ‌ర‌కూ చదువుకు్న‌వారికి, అస‌లేమీ చ‌దుకోని వారికి రోజుగ‌డ‌వ‌డం క‌ష్ట‌మైపోతూవున్న‌ది. త‌క్కువ చ‌దువు చ‌దువుకున్న‌వారికి ఉద్యోగాలు దొర‌క‌డం ఎంతో దుర్ల‌భం. ఉద్యోగ‌స‌మ‌స్య అన్ని స్థాయిల్లోనూ పెరిగి పోయినా క్రింద త‌ర‌గ‌తి వారికీబాధ మ‌రీ ఎక్కువ‌. ఎందుకంటే చిన్న ఉద్యోగాల‌కే పై చ‌దువులు చ‌దివిన‌వారుకూడా ద‌ర‌ఖాస్తులు పెట్టుకుంటున్నారు. మునిసిప‌ల్ ఆఫీసులో స్వీప‌ర్ ఉద్యోగానికి ఎమ్‌.ఎ చ‌దివిన‌వాళ్లు కూడా అప్ల‌యిచేశార‌న్న ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర‌లేదు.

టెన్త్‌క్లాస్‌వాళ్ళు ఎమ్‌.ఎ వాళ్ళ‌తో ఏం పోటీ చెయ్య‌గ‌ల‌రు ?  ఎలిమెంట‌రీ స్కూల్స్ లోనో న‌ర్స‌రీ స్కూలులోనో చేరాల‌న్నా కూడా ట్రెయినింగ్ కావాలంటారు. లేదా ఎవ‌రైనా ఎలాగోలాగ తిప్ప‌లుప‌డి స్కూల్లో టీచ‌ర్‌గా చేరినా మూడువంద‌ల యాభై ఇస్తున్న‌ట్లు సంత‌కం చేయించుకొని నూరో, నూట‌పాతికో చేతిలో పెడ‌తారు. ఇంక ఏ బట్ట‌ల షాపులోనో, ఫ్యాన్సీషాపులోనో సేల్స్‌గ‌ర‌ల్స్‌గా చేరాల‌న్నాకూడా క‌ష్ట‌మే. వాళ్ళు అందంగా ఉన్న ఆడ‌పిల్ల‌ల‌కి  ప్రిఫ‌రెన్స్ ఇస్తారు. అమ్మ‌డానికి అందం ఎందుకు అనుకోకూడ‌దు. అదొక ట్రేడ్ సీక్రెట్‌, రెండుపూట్లా క‌డుపునిండా తిన్నా తిన‌క‌పోయినా చ‌క్క‌గా స్మార్ట్‌గా సినిమా తార‌లాగ అలంక‌రించుకోవాలి. జిడ్డోడుతూన్న మొహాల‌తో ఉంటే కొనేవారుకూడా వెన‌క్కిపోతార‌ని వ్యాపార‌స్తులు భ‌యం. మ‌న‌స్సులో ఎన్నిదిగుళ్ళు దుఃఖాలుఉన్నా లోలోప‌లే అణ‌చివేసుకొని క‌స్ట‌మ‌ర్స్‌ని చిరున‌వ్వుతో ఆహ్వానించి వాళ్ళు అవిచూపండి ఇవి చూపండి అని ఎంత విసిగించినా చిరాకుప‌డ‌క ఓర్పుగా, నేర్పుగా వ్య‌వ‌హ‌రిస్తూనే ప‌దికాల‌ల‌పాటు ఉద్యోగం నిలిచేది.

పెద్ద‌పెద్ద కంపెల‌నీల్లోనూ ఫ్యాక్ట‌రీల్లోనూ పాకేజీసెక్ష‌న్‌లో వ‌ర్క్ చేసెందుకు రోజువారీ జీతాల‌మీద ప‌నిచేస్తూ ఉంటారు. ఈ పనికి పెద్ద‌గా చ‌దువుతో ప‌నిలేక‌పోయినా గ్రాడ్యుయేట్లుకూడా ఈ ప‌నుల‌కు వ‌స్తూ ఉంటారు. ఈ కాస్త ఆధారమైనా దొరికితే చాల‌ని వారి తాప‌త్ర‌యం. కంపెనీరూల్స్ క‌నీస జీతాల నిబంధ‌న‌లూ ఎన్ని ఉన్నా ఇలాటి చిన్న‌చిన్న ఉద్యోగాల‌వారికి ఉద్యోగ భ‌ద్ర‌త‌లు చాలా త‌క్కువ‌నే ఉన్నాయి.

నిర్భంధ విద్యావిధానం బాగానేఉంది. అంద‌రికి ఏవో అక్ష‌ర‌మ్ముక్క‌లొస్తున్నాయి. సంత‌కాలు పెట్ట‌గ‌లుగుతున్నారు. అదీ బాగానేవుంది. కానీ చ‌దువుకు త‌గిన ఉద్యోగాలేలేవు. ఈ కొద్దిచ‌దువుల‌వారు ఉద్యోగాల‌కూ ప‌నికిరారు. కాయ‌క‌ష్టానికి ప‌నికి రారు.

ఇక ఈపాటి చ‌దువురాని మ‌ధ్య‌త‌రగ‌తి మ‌హిళ‌ల‌కు భ‌ర్త‌ల‌కు ఆర్థికంగా సాయ‌ప‌డే మార్గం ఏమీ క‌న్పించ‌డంలేదు. విధివ‌శాత్తు భ‌ర్తా తల్లీతండ్రీ తోడూలేని స్త్రీ త‌న కాళ్ళ మీద నిల‌బ‌డ‌గ‌లిగేమార్గం (చ‌దువు రానివాళ్ళ‌కు) లేదు. అయినా అవ‌స‌రాన్ని బట్టి క్రొత్త క్రొత్త దారుల‌ను వెతుక్కుంటూ జీవిత పోరాటంలో గెలిచేటందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నారు.

తెల్లారిలేస్తే అప్ప‌డాలూ వ‌డియాలూ చేకోడీలూ అమ్మ‌డానికి ఇంటింటికి తిరిగేవారు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌న్పిస్తున్నారు. షాపుల్లో ట్యూబ్‌లైట్ల వెలుగులో షోకేసుల మెరుపుల్లో అస‌లు ఖ‌రీదుక‌న్నా నాల్గురెట్లు ఎక్కువ‌పెట్టినా వ‌స్తువుని కొన‌డానికి జంక‌ము. షాపువారికి ఇంటిఅద్దెలూ, ప‌నివారిజీతాలూ సేల్సుటాక్సులు, ఇన్‌క‌మ్ టాక్సులూ మొద‌లైన‌వి చెప్పుకోద‌గ్గ‌వీ, చెప్పుకోలేనివీ ఖ‌ర్చులెన్నో ఉంటాయి. ఈ ఖ‌ర్చంతా వ‌స్తువుల‌మీద వేసి మ‌న నెత్తిమీదే వేస్తారు. ఇలా ఇంటింటికి తెచ్చి అమ్మే వారికి పెట్టుబ‌డి కాయ‌క‌ష్ట‌మే. బ‌య‌ట దుకాణాల్లోక‌న్న కొంత ధ‌ర త‌క్కువ‌గా ఉంటుంది. ఒక బీదస్త్రీని ప్రోత్స‌హించినట్లూ వుంటుందిగ‌నుక ఇలా ఇంటింటికీ తెచ్చి అమ్మేవారివ‌ద్ద స‌రుకులు కొన‌డం మంచిది. మ‌న‌కీషాపుకు వెళ్ళ‌డానికి రిక్షాకి పెట్టేడ‌బ్బులూ త‌ప్పుతాయి, కాల‌మూ క‌లిసివ‌స్తుంది. కొంద‌రు స్వంతంగా ముడి స‌రుకులు వారేకొని వారే వ‌స్తువుల‌ను త‌యారుచేసి అమ్మ‌కానికి తెస్తారు. కాని మ‌రికొంత‌మంది చిన్న చిన్న పెట్టుబ‌డుల‌తో స‌బ్బుపొడులూ, గులాబ్‌జామ్ మిక్స్‌లూ, త‌లంటు పోసుకునే షాంపులూ, సేఫీనేప్‌కిన్‌లు వ‌గైరాలు త‌యారుచేయించి మ‌నుషుల‌ను పెట్టి అమ్మిస్తూ ఉంటారు. వీరిలో చ‌దువురాని స్త్రీలే అధికం. కొంద‌రు ఇంత‌స‌రుకు అమ్మితే ఇంత‌డ‌బ్బు అనేప‌ద్ద‌తిని అనుస‌రిస్తే కొంద‌రు రోజుకింత అనే ప‌ద్ధ‌తిని అన‌స‌రిస్తారు.

ఇలా వాకిళ్ళ‌లోకి అమ్మేవారు వ‌చ్చే ప‌ద్ద‌తి ప‌ట్నాల్లో ఎక్కువ‌. ప్రతి ప‌ది నిముషాల‌కి ఎవ‌రోఒక‌రువ‌చ్చి కాలింగ్‌బెల్ నొక్కుతూనే ఉంటారు. త‌లుపుతీసి మా పొరుగింటిప‌డ‌తి అమ్మేవారిమీద‌ప‌డి కొట్టినంత‌ప‌ని చేస్తుంది. ఆమెకు వాళ్ళంటే చ‌చ్చేంత‌కోపం. ప‌నీ పాటాలేక త‌న‌ని విసిగించ‌డానికే వాళ్లు దాపురించిన‌ట్లుగా ఆమె భావిస్తుంది.

ఇది వారికి జీవ‌న‌స‌మ‌స్య క‌డుపునింపుతునేందుకు ప‌డేశ్ర‌మ‌. అని ఒక్క‌క్ష‌ణం సానుభూతిగా ఆలోచిస్తే, ఎంతో దూరం నుండి శ్ర‌మ‌ప‌డి వ‌చ్చిన సేల్స్‌గ‌రల్స్ చెప్పిన వివ‌రాల‌ను విని అవ‌స‌ర‌మైతే కొన‌డం లేక‌పోతే వ‌ద్ద‌ని మ‌ర్యాద‌గా చెప్ప‌డం చేస్తే, ఎంత‌బాగుంటుంది. వ‌న‌కాళ్ల‌ద‌గ్గ‌రికి వ‌చ్చార‌ని త‌క్కువ‌గా నీచంగా చూడడం వారి మ‌న‌సుల్ని ఎంతో గాయ‌ప‌రుస్తుంది.

తలుపుతీయగానే రెండు భుజాల‌కీ రెండు బ‌రువైన బాగ్‌లు త‌గిలించుకొని రెండు చేతుల‌నిండుగా పాకెట్‌లు ప‌ట్టుకొని ఏమండీ, కొనండీ, చౌకండీ, బావుంటాయండీ అని బ్ర‌తిమలాడుతుంటే వారి మొహాన త‌లుపులు ద‌భేలుమ‌ని మూసుకొని ఫో ఫో వ‌ద్దంటే నీక్కాదూ అని ఈస‌డించుకోనేవారు ఉన్నారు.  కొంద‌రైతే ఆ సంచుల్లో ఏ క‌త్తులో దాచుకొనివ‌చ్చి త‌లుపు తీయ‌గానే లోనికివ‌చ్చి బెదిరించి గొలుసో, గాజులో లాక్కుపోతార‌ని హ‌డ‌లిపోతూ ఉంటారు. ఇలా నూటికో కోటికో జ‌రుగుతూనే ఉన్నాయి. కాని ఎప్పుడూ అలానే జ‌రుగుతుంద‌ని భ‌య‌ప‌డ‌కూడ‌దు.

అస్త‌మానం అవికావాలా, ఇవికావాలా అని త‌లుపులు కొట్ట‌డం విసుగుకాదా ?  ఒక్క నిముషం కూడా వీళ్లు విశ్రాంతి తీసుకోనీరు అని అనిపించ‌డంకూడా స‌హ‌జ‌మే. కానీ వారికి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య క‌దా ?  మ‌నంచేసే ప‌ని సాటివారికి ఏ కొంచ‌మైనా ఉప‌యోగ‌ప‌డితే మ‌న‌కే సంతోషం. ఇలాటివారు మీకు త‌ట‌స్థ‌ప‌డితే సానుభూతితో చూడండి, విసుక్కోండి అని నా మ‌న‌వి.