14
 

కేశ‌సంప‌ద‌      


శిశువు మాతృ గ‌ర్భంలో ఉండ‌గానే అన్ని అవ‌య‌వాల‌తోపాటు శిరోజాలుకూడా చ‌క్క‌గా అమ‌రివుంటాయి. ఈ శిరోజాలు అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉప‌యోగ‌ప‌డేలా ఉండ‌టం ప్ర‌కృతినైజం. అర్థ‌శ‌తాబ్ధికి పూర్వం భ‌ర్తృవిహీనుల‌కు శిరోఖండ‌నం చేయించి వికార‌స్వ‌రూప‌ల‌నుగా మార్చి వేసేవారు. దాదాపుగా ఆకాలంలో పురుషులు కూడా కేశ‌ఖండనం చేయించుకోకుండా సిగ్గుచుట్టుకోవ‌డం సిగ‌పైసంపెంగ‌లు తురుముకోవ‌డం ఉంటూ ఉండేద‌ని కొన్ని గ్రంథాల వ‌ల్ల మ‌నం తెలుసుకోవ‌చ్చును. కేశాలు త‌క్కువ‌గా ఉన్నా, ఉన్న‌వి ఊడిపోతున్నా మ‌న‌సుకెంతో క్లేశంగా వుండ‌టం స‌హ‌జం.

య‌జ్ఞ‌కుండంలో పుట్టి ప‌ర‌మ ప‌విత్ర మూర్తియైన ద్రౌప‌దిని దుశ్శాస‌నుడు రాజ‌సూయ‌భృథంబునందు వ‌సుధాదుర‌మంత్ర ప‌విత్ర వారి ధారావ‌ళి జేసి పావ‌న‌ములైన శిరోజ‌మున‌లు దెమ‌ల్ని ఈడ్చుకొనివ‌చ్చాడు. ఓ గుప్పెడు కేశాలు వాని చేతిలోనికి రాకుండా వుండ‌వు. ఇలా అవ‌మాన‌భారానికి లోనైన శిరోజాల‌ను దుశ్శాస‌న‌వధానంత‌రం గాని ముడ‌వ‌లేదు ద్రౌప‌ది. ఇక చాణ‌క్యుల వారు స‌రేస‌రి నంద‌రాజ్య నిర్మూల‌నంచేస్తే గాని కేశ‌సంర‌క్ష‌ణ చేయ‌వ‌ని శ‌ప‌థం ప‌ట్టి జ‌ట‌ల‌ను క‌ట్టించుకొన్నారు.

 ఇంత‌కూ శిరోజాలున్న‌ది ఏ స‌రిహ‌ద్దు గోడ‌ద‌గ్గ‌రో ప‌బ్లిక్ వాట‌ర్ టాప్‌ల ద‌గ్గ‌రో కొట్లాడ‌టానికి కాదు. కానీ వీలుగా ముందు అందేది సిగే. శిరోజాల‌ను చ‌క్క‌గా అలంక‌రించుకోడం కూడా ఒక క‌ళే !

జపాను, చైనా, జ‌ర్మ‌నీ మొద‌లైన కొన్ని దేశాల‌లో అధిక‌శాతం స్త్రీలు మ‌న దేశంలోని స్త్రీల‌లాగ‌నే రెండు జ‌డ‌ల‌నో, గ‌ట్టిగా బిగించి ఒక్క జ‌డ‌నో అల్లుకొనేవారు. కాని ప్ర‌స్తుత నాగ‌రీక ప్ర‌పంచం క్రాఫ్ చేయించుకోడంలో ఆస‌క్తిని ఎక్కువ‌గా క‌న‌బ‌రుస్తోంది. కేశాలంక‌ర‌ణ క‌ళ‌లో భార‌తీయ స్త్రీల‌ది అందె వేసిన చెయ్యి. అజంతా, ఎల్లోరా గుహ‌ల‌లోనూ దేవాల‌య కుడ్య‌స్థ‌స్త్రీ శిల్ప‌మూర్తుల‌లోనూ ర‌క‌ర‌కాలఅలంక‌ర‌ణ‌లు మ‌న‌కు ద్యోత‌క‌మౌతాయి. క‌లిగిస్తున్న క‌న‌కంపు సంపెంగ‌ల‌ను త‌ల‌లో ముడిస్తే ఉన్నంత‌లో కొమ్మ సంపెంగ‌ను ముడుచుకొంటుంది మామూలు మ‌గువ !  ప్ర‌త్యేకంగా శుభ‌కార్యాల‌లో మ‌రింత శ్ర‌ద్ధ‌గా అలంక‌రించుకోడం స్త్రీల‌కు ప్రీతిదాయకంగా ఉంటుంది. మ‌ల్లెపూల‌కూ మానినీమ‌ణుల‌కూ అవినాభావ సంబంధం వుంది.

నీగ్రోజాతివారికి త‌ల‌వెంట్రుక‌లు బిరుసెక్కి పొట్టిగా మెలిక‌లు తిరిగిపోయి వుంటాయి. యూరోపియ‌న్ దేశాల్లో వారిది రాగి రంగు జుట్టు, కానీ మ‌న దేశంలో బారిడేసి జుట్టు చాలా ఎక్కువ శాతం వారికి ఉంటుంది.

కేశ‌ములు న‌లములు స్థానభ్రంశం పొందేనేని రాణించ‌వు అని చిన్న‌య‌సూరి సెలివిచ్చాడు. కాని ఇప్పుడు ర‌క‌ర‌కాల అంద‌మైన‌విగ్గులు, కృత్రిమ‌జ‌డలు (స‌వ‌రాలు) త‌యారు చేసి ల‌క్ష‌ల‌ధ‌నాన్ని గ‌డిస్తూ ఉన్నారు. ఈ వ్యాపారంలో తిరుమ‌లేకుడు పెద్ద బిజినెస్ మాగ్నెట్‌. ఈ కృత్రిమ త‌ల‌కట్టును త‌యారు చేసే క‌ళ చాలా ప్రాచీన‌కాలంనుండి వుంద‌ని నాట్య‌కారులు పేర్కొన్నారు. నాట‌కాల‌లో ఏయే వేషాలు వేసేవారి త‌ల‌క‌ట్టెలా వుండాలో కూడావారు నిర్ణియించారు. వీటి సాయంతోనే తాత‌య్య‌ని స్టూడెంట్ కుర్రాళ్ల‌లాగా గంతులు వేయ‌డం నేటి సినిమాల్లో మ‌నం చేస్తూనే ఉన్నాం. ఉంగ‌రాల‌జ‌ట్టు, వంకీల‌జుట్టు, సాదాజుట్టు, న‌ల్ల‌జుట్టు ఎర్ర‌జుట్టు, ఓహ్ ! ఎన్నిర‌కాల జుట్టులో !

ఇంత‌కీ ఈ సోదంతా దేనికీ అనుకుంటున్నారా ?  ఈ రోజుల్లో ప‌ట్టుకుంటే గుప్పెడు జుట్టు ఎవ‌రి త‌ల‌మీదా క‌న్పించ‌డం లేదు. పొరుగు జ‌డ‌ల‌వారి శాతం బాగా ప‌డిపోయింది. త‌ల‌పిన్ను కూడా పెట్ట‌కోడానికి వీలు లేనంత‌గా ప‌ల‌చ‌బ‌డిపోతోంది క‌దా ! పాతికేళ్ళ‌కే ప‌లచ‌బ‌డిపోతోంది త‌ల ! వెన‌క త‌ల పండింది అంటే వ‌యపొస్తేనే పండేది !  కానీ ఇప్పుడు ప‌ద‌హారేళ్ళ‌లోపే పండిపోతోంది చాలామందికి. బాల‌నెరుపు అని స‌రిపెట్టుకుంటే మాత్రం నెర‌వ‌డం ఆగిపోతుందా ?

ఈనాటి క‌న్నెపిల్ల‌ల‌కున్న జ‌డ‌లు నాగు పాములా పోల్చ‌డానికి వీలులేదు. వాన పాముల‌తో పోల్చ‌ల్సిందే. జ‌డ అల్లుకుందామంటే మూడు పాయ‌లూ చేతికంద‌వు. రెండేసి ప‌ర‌క‌ల‌ను క‌ష్ట‌ప‌డి అల్లుకొనేకంటే పొట్టిగా క‌త్తిరంచుకొని ర‌బ్బ‌ర్‌బాండ్ క‌ట్టుకోకూడ‌దూ ! అమ్మో ! భార‌త‌నారి అంత‌ప‌ని చేస్తే ఎలా అని అమ్మ‌మ్మ‌లు నోళ్ళునొక్కుకుంటారు. ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం మ‌నం తినే ఆహారంలో పోష‌కాహారాలు త‌క్కువ‌గా ఉండ‌డ‌మూ, అన్నిటిలోనూ క‌ల్తీ ఉండ‌డ‌మును. కొబ్బ‌రినూనెలో క‌ల్తీ స‌ర్వ‌ప‌దార్థాల‌లోనూ క‌ల్తీ. మ‌నం తినే వాటిల్లో విట‌మిన్స్ క‌న్న పెస్టిసైడ్స్ భాగం ఎక్కువ‌గా వుంటోంది.

శిరోజాలంక‌ర‌ణ‌పైన భార‌త‌స్త్రీకి ప్ర‌త్యేక‌మైన మ‌క్కువ‌. ఆమె కృష్ణ‌వేణి ! ఆమావాస్య రాత్రిలాంటి న‌ల్ల‌ని కురులామెకు పెట్ట‌ని సొమ్ములు !

మొన్న‌టికిమొన్న న్యాయాన్నీ, ధ‌ర్మాన్నీ కాపాడ‌వ‌ల‌సిన ర‌క్ష‌క‌భ‌టులు కొంద‌రు స్త్రీల‌కు బ‌ల‌వంతంగా శిరోముండ‌నం చేయించారు. ఆ స్త్రీల మంచిచెడ్డ‌లు, గుణ‌గ‌ణాలు ఎట్టివైనా వారిని అవ‌మానించ‌డాన్నీ, అత్యంత నికృష్టంగా వారిని ట్రీట్ చేయడాన్నీ మొత్తం స్త్రీ లోకం గ‌ర్హించాల్సివుంటుంది. ఈనాడు కూడా ఇలాటి కిరాక‌త కృత్యాలు జ‌రిపించే మాన‌వులున్నారంటే మ‌నం చెప్పుకొనే నాగ‌రిక‌త‌, సివిలిజేష‌న్ ఎక్క‌డో క‌లికం పెట్టుకుని చూడాల్సిందే. మొత్తం జాతి సిగ్గుప‌డాల్సిన సంఘ‌ట‌న ఇది ! ముందు ముందు ఇలా జ‌ర‌గ‌కుండా ప్ర‌తిఘ‌టించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ప్ర‌తి వ్య‌క్తికి ఉంది.

 

.