15
 

వివాహం  - వ్య‌క్తి ధ‌ర్మం

ఏమీ తోచ‌క లెండిగ్ లైబ్ర‌రీరికి వెళ్ళాను. వీటినే ఇదివ‌ర‌కు అణాలైబ్ర‌రీలు అనేవారు. పుస్త‌కం ధ‌ర‌లు ఎక్కువై పోవ‌డంతో ఎవ‌రికి వారే వార ప‌త్రిక‌లు కొనుక్కోడం మానేసి ఈ లైబ్ర‌రీల  వెంట‌ప‌డుతున్నారు. అక్క‌డ ఒక్క‌టీ కొత్త ప‌త్రిక ఉండ‌దు. నాల్గువారాల క్రింద‌టిదో ప‌దివారాల క్రింద‌టిదో దొరుకుతుంది. ముందూ వెన‌కా మ‌ధ్యా కొన్ని పేజీలుండ‌వు. వార‌ప‌త్రిక‌లు చూడ్డం మానేసిన నా క‌ళ్ళు న‌వ‌ల‌ల్ని ప‌రికించాయి. మొగుడే రావాలా,  పెళ్ళెందుకు ? ,  మొగుడా నువ్వు మ‌గాడివేనా ?  ఇత్యాది పేర్ల‌తో ఉన్న కొన్ని న‌వ‌ల‌ల్ని చూసేస‌రికి వికారం పుట్టింది. ఈ మ‌ధ్య సినిమాల్లో ఇలాంటి న‌వ‌ల‌ల పేర్ల‌ని చెప్పించి బ్రహ్మాండ‌మైన హాస్యం సృష్టిస్తున్నారు. నాక్కావ‌ల్సిన కొన్నింటి పేర్లు చెప్పాను. అలాంటివి ఇక్క‌డ ఎవ‌రూ చ‌ద‌వ‌రండి. అందుకే తెప్పించం అన్నాడు. ఏమిటి చిల‌క‌మ‌ర్తి న‌వ‌ల‌ల్ని గాని చారిత్ర‌త న‌వ‌ల‌ల్ని గానీ చ‌దివే పాఠ‌కులే ఈ కాల‌నీలో లేరా ?   అన్నాను. అత‌నేదో గొణుక్కుంటుంటే వినిపించుకోకుండా వ‌చ్చేసాను. ఓ ర‌చ‌యిత్రి పెళ్ళెందుకు అని న‌వ‌ల రాసింది. ఆవిడి పెళ్ళిచేసుకుందా లేదా ?   లేక ఆమెకు చిన్న‌ప్పుడే పెళ్ళ‌యిపోతే ఇప్పుడు త‌న క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌క‌యినా చేస్తుందా ?  పెళ్ళెందుకు అని వ‌దిలేస్తుందా అని ఆలోచించాను. అయినా రాసిందే ఆచ‌రించ‌డం సాధ్యంకాదు ఏదో ర‌చ‌యిత అవ్వాల‌నే తాప‌త్ర‌యంతో రాస్తారు. అనుకుంటూ ఇంటికి వ‌చ్చాను. హాల్లో వ‌సుంధ‌ర కూర్చుని ఉంది. దాని మొహం ఏడ్చి మొహం క‌డుక్కు వ‌చ్చిన‌ట్లుగా ఉంది.

ఏం వ‌సూ ఇలా వ‌చ్చావ‌ఖ మీకు యూనివ‌ర్సిటీ లేదా అన్నాను. ఆ అమ్మాయి నాచిన్న‌నాటి స్నేహితురాలు జ‌లంధ‌ర కూతురు. మాయింట్లో ఎక్కువ చ‌నువుగా ఉంటుంది. వ‌సుంధ‌ర స‌మాధానం చెప్ప‌లేదు. ఏదో ఆ పిల్ల మ‌న‌సుకి న‌చ్చంది జ‌రుగుతోంది. అందుకు బాధ‌ప‌డ్తోంది అని నాకు తెల్సిపోయింది. ఏమిటీ అని గ‌ట్టిగా అడిగితే ఏడ్చేసేలా ఉంది. లోప‌లికి వెళ్ళిబోర్న‌విటా క‌లిపి తెచ్చాను. కొంత సేప‌టికి వ‌సుంధ‌ర త‌నంత‌ట త‌నే మొద‌లు పెట్టింది. పుట్టిన ప్ర‌తివాళ్ళూ త‌ప్ప‌కుండా పెళ్ళిచేసుకునే తీరాలా, ఆంటీ అంటూ. ఏమిటీ నువ్వుకూడా పెళ్ళెందుకు ?   అనే న‌వ‌ల చ‌దివావా ఏమిటి ?  అని ప్ర‌శ్నించాను. అది కాదాంటీ మా అమ్మ‌న‌న్ను పెళ్ళిచేసుకోమ‌ని గొడ‌వ‌చేస్తోంది. అయితే వ‌సూ నువ్వు పెళ్ళి ఇప్ప‌ట్లో చేసుకోవ‌ద్ద‌ను కుంటున్నావా ?  అస‌లే వ‌ద్ద‌నుకుంటున్నావా ?

నాప్ర‌శ్న‌కు ఆలోచ‌న‌లో ప‌డింది. మెడిసిన్ థ‌ర్డ్ ఇయ‌ర్‌లో ఉన్న వ‌సుంధ‌ర పెళ్ళి చ‌దువు పూర్త‌య్యాక అయితేనే బాగుంటుంది అని లోగ‌డ ఒక సారి వ‌సుంధ‌ర త‌ల్లి జ‌లంధ‌ర‌తో వాదించాను. కానీ జ‌లంధ‌ర  చెప్పేదాంట్లో కూడా అర్థం లేక‌పోలేద‌నిపించింది. రెండేళ్ళ‌ల్లో మెడిసిన్ అవుతుంది. ఈ త‌రువాత హౌస్‌స‌ర్జ‌న్సీ ఆ త‌రువాత ఎమ్‌.డి. ఇప్ప‌టికే నాక ఏభై ఏళ్ళు వ‌చ్చాయి. ఓపిక లేదు కూర్చుంటే లేవ‌లేను లేస్తే కూర్చోలేను. పిల్ల‌ల పెళ్ళిళ్ళు పెద్ద బాధ్య‌త‌లుగా క‌న్సిస్తాయి. వీళ్ళేమో ఇప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు, అని అంటుంటే జలంధ‌ర క‌ళ్ళ‌ల్లో నీళ్ళు క‌మ్మాయి.

జ‌లంధ‌రికి కూడా లేట్ మేరేజ్‌, ముప్ప‌య్ ఏళ్ళు వ‌చ్చేదాకా నేను పెళ్ళి చేసుకోను అని ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళమ్మా నాన్న‌ల్ని ఏడిపించింది. దాని ఖ‌ర్మ బాగుండ‌క త‌ల్లి తండ్రులిద్ద‌రూ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే చ‌నిపోయారు. అన్న‌య్య‌లిద్ద‌రూ దాన్న‌స‌లు ప‌ట్టించుకోనే లేదు. అప్పుడు దానికి జ్ఞానం వ‌చ్చింది. అమ్మ చెప్పిన‌ట్లు పెళ్ళి చేసుకుంటే భ‌ర్త తోడుగా  వుండేవాడు. త‌న‌ది  అంటూ ఓ ఇల్లూ పిల్ల‌లూ..ఇలా కాకుండా ఒంట‌రిగా భ‌యంగా బితుగ్గా ఏదో త‌ప్పుచేసిన‌ట్లు త‌ల‌వంచుకొని బ్ర‌త‌క‌వ‌ల‌సి వ‌స్తోంది. ఇహ ఏంచేస్తుంది అన్న‌య్య‌ల‌కి త‌న పెళ్ళి గురించి ప‌ట్ట‌లేదు. ఎవ‌రైనా పెద్ద‌వాళ్ళు ఏరా మీ చెల్లెలికి పెళ్ళి చెయ్య‌రా అంటే అది పెళ్ళి వ‌ద్దందిగా దానికి పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్పి త‌ప్పించుకునేవారు. ఉన్న డ‌బ్బంతా ఇద్ద‌రూ పంచేసుకున్నారు. త‌మ ఉంటోంద‌ని తండ్రి క‌ట్టించిన ఇల్లు అమ్మేసి ఇద్ద‌రూ బాంకుల్లో వేసుకున్నారు. జ‌లంధ‌రికి ఏమిచ్చారు అని ఎవ‌ర‌న్నా అడిగితే దానికి డ‌బ్బెందుకు ?  అఇ సంపాదిస్తున్న‌దే దానికి ఎక్కీత‌క్కీ ఎవ‌రికి పెట్టాలి గ‌న‌క అన్నారు. అద్దె ఇంట్లోకి మారింది. తెలిసిన పెద్ద‌వాళ్ళంద‌రి ద‌గ్గ‌రికి వెళ్ళి త‌న‌కో సంబంధం చూసి పెట్ట‌మ‌ని ప్రాధేయ ప‌డింది. కొంద‌రు నవ్వుకున్నారు. కొంద‌రు తిక్క‌కుదిరింది అనుకున్నారు. ర‌క‌ర‌కాలుగా వ్యాఖ్యానాలు చేశారు. అలా చేస్తార‌ని దానికి ముందే తెలుసు !  అయినా గ‌త్యంత‌రం లేక‌పోయింది.

పెళ్ళి చేసుకోకుండా బ్ర‌త‌క‌లేను, పెళ్ళి చేసుకుని మీరు ఏం సుఖ‌ప‌డ్తున్నారు. దేశాన్ని మేం ఉద్ద‌రిస్తాం మా ఆశ‌యాలూ అభిలాషలు   భ‌ర్త చెప్పుచేత‌ల్లో ఇమ‌డ‌డంవ‌ల్ల దెబ్బ‌తింటాయ్‌. అని పెళ్ళి వ‌ద్ద‌ని భీష్మించుకు కూర్చునే  వ‌య‌స్సు మీరిన ఆడ‌పిల్ల అంద‌రికీ జ‌లంద‌ర ఒక గొప్ప‌పాఠం కాగ‌లిగింది.

గొప్ప చిత్ర‌మేమిటంటే త‌ల్లిప్డ బాధా వేద‌నా తెలిసికూడా వ‌సుంధ‌ర పెళ్ళి వ‌ద్దంటోంది. ఇంత‌లో చేసుకోవా ?   అస‌లు చేసుకోవా ?  అన్న ప్ర‌శ్న‌కు ఆమె దగ్గ‌ర స‌మాధానం లేదు. కానీ పెళ్ళెందుకు చేసుకోవాలి అంటీ ?  అని వేసిన వసు ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం నాకు ఉంది. చూడు వ‌సూ ! పెళ్ళి అనేది యుగాల త‌ర‌బ‌డి వ‌స్తున్న ఒక మ‌హా వ్య‌వ‌స్థ‌. ఈ కాలం పిల్ల‌లు అనుకున్న‌ట్లుగా పెళ్ళిచేసుకోకుండా దేశ‌సేవ ప్ర‌జాసేవ చేస్తాం అని సీతాదేవి అనుకుంటే మ‌న‌కీనాడు రామాయ‌ణ‌మే ఉండేదికాదు. సీతాదేవికి మీకున్నంత దేశ‌సేవాభక్తి లేద‌నుకోకు. ఇహ ఈ పెళ్ళి వ‌ల్ల కూతురికి నూటికినూరు పాళ్ళూ సుఖ‌మే ఉంటుంద‌ని ఏ త‌ల్లి తండ్రులూ అనుకోరు క‌ష్ట‌ము సుఖ‌మూ రెండూ అనుభ‌వించాల్సిందే ! అస‌లు జీవిత‌మే అంత‌,. పెళ్ళి చేసుకున్నందువ‌ల్ల ఎక్కువ క‌ష్టంగానీ ఎక్కువ సుఖంగానీ ఆ పెళ్ళి వ‌ల్ల క‌ల‌గ‌దు. చేసుకున్నా చేసుకోక‌పోయినా క‌ష్ట‌సుఖాలు స‌మ‌మే అయిన‌ప్ప‌డిహ పెళ్ళి ఎందుకు చేసుకోకూడ‌దు అని నేన‌డుగుతున్నాను. మ‌నిషికి తోడు ఎంతో అవ‌సరం.  వివాహ‌బంధంతో ఆ తోడు జీవిత స‌హ‌చ‌రుడు అయితే మ‌న క‌ష్ట‌సుఖాల్లో స‌గం అనుభూతి పంచుకుంటే మ‌న‌కెంతో హాయిగా ఉంటుంది ! సుఖాన్ని కూడా ఒక్క‌ళ్ళం అనుభ‌వించ‌లేం ఇంకోరితో పంచుకోవ‌ల్సిందే !   అంతెందుకు నువ్విలా డాక్ట‌రువై బోల్డంత డ‌బ్బూ, పేరూ  సంపాదించుకుంటావు ఇక రోజూ ఒకే దిన‌చ‌ర్య విప‌రీత‌మైన విసుగుప‌డుతుంది ! అలా కాక భ‌ర్తా పిల్ల‌లూ రోజుకొక ర‌క‌మైన అనుభూతీ ఒక ర‌క‌మైన అనుభ‌వం కొత్త‌కొత్త సుఖాలూ కొత్త కొత్త స‌మ‌స్య‌లూ బాధ‌లూ వేద‌న‌లూ వీటిని అధిగ‌మించాక సంతృప్తి సంతోఫం ఇదీ జీవితం. ఉగాది ప‌చ్చ‌డిలాగ జీవితంలో అన్ని రుచులూ అనుభ‌వించాలి. త‌ప్పించుకోవాల‌ని చూడ‌డం సంఘానిక వ్య‌క్తికి కూడా శ్రేయ‌స్క‌రం కాదు. ఇహ పెళ్ళి చేసుకోక‌పోతే వ‌చ్చే న‌ష్టాలే ఎక్కువ వున్నాయ్ చేసుకుంటే వ‌చ్చే సుఖాల‌కంటే పెళ్ళ‌య్యాక నీ జీవితం నీదికాదు. నీ కుటుంబానిది. ఈ కుటుంబ వ్య‌వ‌స్థే మ‌న నాగ‌రిత‌క‌కూ సంస్కారానికి గీటురాయి వ‌సుంధ‌ర మెల్ల‌గా అక్క‌డ్నించి లేచి వెళ్ళిపోయింది.