16
 

ఇంటిదొంగ‌

సాధార‌ణంగా పెళ్ళిళ్ళ‌కి వెళ్ళి ఏమీ పోగొట్టుకోకుండా తిరిగిరాలేము ఎక్క‌డెక్క‌డి బంధువులూ మిత్రులూ అప్పుడే క‌లుస్తారు. అంద‌రి సూట్‌కేసులూ బాగ్‌లూ ఒక‌టోరెండో గ‌దుల్లో పెట్టుకోవాల్సి వ‌స్తుంది. పెట్టెల‌మీద కూర్చొని మాట్లాడుకోడం ఏ బ్యాగు క‌నిపిస్తే దాన్ని త‌ల‌కింద పెట్టుకుని ఎవ‌రో ఒక‌రు ఆ నేల‌మీదేప‌డి నిద్ర‌పోడంలాంటి సంఘ‌ట‌న‌లు ప్ర‌తి పెళ్ళి ఇంటిలోను కనిపించే సామాన్య‌దృశ్య‌మే.

ఉన్న రెండురోజుల్లోనూ విడిచిన బ‌ట్ట‌లు ఉతుక్కోడం కుద‌ర‌దు గ‌నుక ఏ తాడు మీదో ఏ త‌లుపుమీదో కాసేపు ఆరేసుకుని మ‌ళ్ళీ పెట్టెలో పెట్టుకోవ‌చ్చున‌నుకునే వారికి కొంత‌సేప‌య్యేస‌రికి క‌బుర్లు కాలక్షేపంలోనో పెళ్ళి హ‌డావుడిలోనో ఆ సంగ‌తి మ‌ర‌పుకు వ‌చ్చేస్తుంది. ముఖ్యంగా ఎదురుగుండా త‌మ‌రు అరేసిన చీరో జాకెట్టో నేనిక్క‌డే ఉన్నాను అని ద‌ర్శ‌నం ఇవ్వ‌క‌పోతే ఇక వీరికి వారు ఊసేప‌ట్ట‌దు. ఈ లోప‌ల అవి ఎంచ‌క్కా ఇంకోరి బెడ్డింగ్‌లో దాక్కుంటాయి. మ‌ళ్ళీ ఇంటికివెళ్ళి ఆజ‌చూసుకున్నాక చేసేది ఏమి ఉండ‌దు.

దేనికొచ్చేవారు దానికోస్త‌ర‌న్న‌ట్లు కొంద‌రు వ‌స్త్రాప‌హ‌ర‌ణానికే వ‌స్తార‌నేది మా శేష‌మ్మ‌త్త‌య్య‌ని చూసి తెలుస‌కున్నాం. ఆవిడ ఒక పెళ్ళికి వెళ్ళొచ్చిందంటే సంవ‌త్స‌రానికి స‌రిప‌డా జాకెట్లు కుట్టించుకోన‌క్క‌ర‌లేదు. కొంచం లావుపాటి వాళ్ళ‌వే ఎన్నుకుంటుంది. లూజు అయితే కుర‌చ చేసుకోవ‌చ్చు. స‌న్న‌వాళ్ల‌వి వ‌దులు చేసుకోడం క‌ష్టం. ఆ పైగా జాకెట్లు అన్నీ ప్లెయిన్ క‌ల‌ర్సే ఎక్కువ‌గా ఉంటూంటాయి. అదివ‌ర‌కు చిన్న చిన్న పూలున్న జాకెట్లు తొడుక్కునే వారు.  చింత‌పూల రైక దానా అన్నాపాట పూల‌రైక‌ల వాళ్ళ‌ని చూసి పుట్టిందే క‌దా !  చీర‌కి బోర్డ‌ర్ ఏ రంగులో వుంటే బ్లౌజుకూడా అదే రంగులో వుండాలి. మాశేష‌మ్మ‌త్త‌ముందు బ్లౌజులు సంపాదించి ఆ త‌రువాత వాటికి మాచ్ అయ్యే చీర‌లు కొనుక్కుంటూంది. ఒక‌సారి పెళ్ళిలో మాపిన్ని ప‌ట్టుచీర‌పెట్టెలో పెట్టుకునిప‌ట్టుప‌డిపోయింది నేను ఈ పెట్టెలో పెట్ట‌లేదు ఎవ‌రు పెట్టారో అని బుకాయించింది. హడావుడిలో పెట్టెల‌కు తాళాలు వేసుకోడం కుద‌ర‌దు. తాళం వేసి తాళం చెవి ఎక్క‌డో పెట్టి మ‌ర్చిపోయి కంగారు ప‌డి పోయే చుట్టాలు చాలాచోట్ల చూస్తూనే ఉంటాం. ఇది దృష్టిలో పెట్టుకుని మాబాబాయి పెళ్ళి బ‌స్సులో ఒక తాళాలు బాగుచేసేవాడ్ని కూడా కూర్చోబెట్ట‌నా అని జోక్ చేస్తూ ఉంటాడు.

ఇంత‌వ‌ర‌కూ మాకుదురులో చీర‌లూ జాకెట్లూ మాత్ర‌మే పోయేవి. అప్పుడిప్పుడు ఉంగ‌రాలూ దుద్దులులాంటి బంగారు వ‌స్తువులు కూడా పోడం మొద‌లు పెట్టాయి. మాశేష‌మ్మ‌త్త‌య్య‌ని మించిన దొంగ‌లు మ‌రెవ‌రో ఉన్నార‌ని తెల్సుకుని ఒక్కొక్క‌రి గుణ‌గ‌ణాలూ శ‌ల్య‌ప‌రీక్ష‌చేసి చూసుకున్నాం ఎవ‌రినీ అనుమానించ‌డానికి మ‌న‌స్సొప్ప‌టం లేదు. అంద‌రూ చ‌దువుకున్న‌వారే అంద‌రూ సంస్కారం ఉన్న వారే.

మా చిన్ని చెల్లి పెళ్ళిలో ఈ మ‌ధ్య మా ఇంకో చెల్లాయి చిన్నూ కి డైమెండ్ దుద్దు ఒక‌టిపోయింది. అది ఏడుస్తూ కూర్చుంటే నాన్న‌గారు మ‌రొక‌టి చేయిస్తాన‌ని ఓదార్చారు. డైమెండ్‌రింగ్ అంటే మాట‌లా !  అప్పుడు మాచెల్లికిస్తున్న క‌ట్న‌మంత ! నిజంగా నాన్న‌గారు డైమండ్ దుద్దు ఒక్క‌టైనాస‌రే చేయించి ఇవ్వ‌లేదు. అయినా తాత్కాలికంగా దుఃఖోప‌శ మ‌నం చేయించ‌డానికి అలా అన్నారు. ఈ సంఘ‌ట‌న‌ల‌తో ఆ పెళ్ళి మాకంద‌రికీ పెద్ద సంతోషాన్ని క‌లిగించ‌లేదు. ఎంతో బ‌రువు హృద‌యాల‌తో ఇళ్ళ‌కు వెళ్ళాం.

పెట్టో ఉన్న దుద్దును ఎలా తీశారు. ఒక‌టే ఎందుకు తీశారు. అని ఎంటే మ‌ద‌న‌పడ్డాను. ఎవ‌రుతీసి ఉంటారా అనుకుంటే ఒక్కొక్క‌రూ మ‌రో వీధిలోకి  రావ‌డ‌మూ ఛీ వాళ్ళిలా చేసి ఉండ‌ర‌ని బుద్ధి మంద‌లించ‌డ‌మూనూ. ఈసారి శేష‌మ‌త్త‌య్య పెళ్ళికిరాలేదు. ఒంట్లో బాగాలేదుట ఆమె చిన్న కూతురు ప్ర‌వీణ మాత్రం వ‌చ్చింది. ఎమ్‌.కామ్. చ‌దువుతోంది. చ‌క్క‌గా ల‌లిత సంగీతం శాస్త్రీయ సంగీతం పాడుతుంది. బొమ్మ‌లు గీస్తుంది. ఆమె పాట‌లు రేడియోలోనూ టి.వి.ల్లోనూ వ‌స్తాయి. అదిగో ప్ర‌వీణ అని అంద‌రూ దాన్ని ఆరాధ‌న‌గా చూశారు. నిజంగా ప్ర‌వీణ ప్ర‌వీణురాలే ఎంత చ‌క్క‌టి పేరు పెట్టారో అనుకున్నాం అంద‌రం.

ఇంత‌లో మా క‌జిన్ పెళ్ళి వ‌చ్చింది. మా చెల్లాయి బ‌హుశా ఈ పెళ్ళికిరాదు అన్పించి దాన్ని త‌ప్ప‌కుండా ర‌మ్మ‌ని రాశాను. వ‌స్తూ పోగా మిగిలిన రెండో దుద్దు కూడా తీసుకుర‌మ్మ‌ని రాశాను. అది వ‌స్తూనే ఎందుకే ఇంకోటి కూడా తీసుకుర‌మ్మ‌ని రాశావు ఇది కూడాపోగొట్టుకొడానికేనా అంది. చిన్న‌ప్లాను వేసి చూద్దాం అన్నారు. ఏంలాభం ?  అని పెద‌వి విరిచింది.

ఆవిడిది గ‌ది నాప్లాను క‌నుకూలంగా వుంది. అంద‌రి బాగేజీకింద గుట్ట‌లు గుట్ట‌లుగా ప‌డి ఉంది. అంద‌రం అక్క‌డే ఉన్న‌ప్పుడు అంద‌రూ వినేలా చిన్నూ నీ పెట్టి ఆ బీరువాలో పెట్టుకో అస‌తే నీవో సారి టోక‌రాతిన్నావు కూడాను. అన్న‌ట్లు నీ రెండో దుద్దు తెమ్మ‌న్నాను తెచ్చారా ! అన్నాను గ‌ట్టిగా. ఆ తెచ్చాను అంది. దాన్నిపెట్టెని బీరువాలో పెట్టాను. ముహుర్తం వేళఅయ్యే స‌రికి నేను ఓ ప‌క్క‌గా కూర్చున్నాను. గ‌దిలో ఒక్కొక్క‌రూ త‌లుపులు మూసిబ‌ట్ట‌లు క‌ట్టుకుంటున్నారు. ఒక్కోరు అలాగే అంద‌రిముందే క‌ట్టుకుంటున్నారు. అయిదారు సార్లు పెట్టెని త‌నిఖీ చేశాను. తాళం అలాగే ఉండి ఈ సారి శేష‌మ్మ‌త్త‌య్య‌వ‌చ్చింది. ఆమె బ‌ట్ట‌లు తీసుకుంటుంటే పెట్టెలో ఏమేమి ఉన్నాయా అని నిశితంగా ప‌రిశీలించా.

ప్ర‌త్యేకంగా ఏమీ లేవు. కాని బాక్‌సైడ్ క‌వ‌ర్లో తాళాల‌గుత్తి ఉంది. ర‌క‌ర‌కాల తాళంచేతులున్నాయి. ఆ గుత్తిలో అమ్మ అత్త‌య్యా ఇది నీ ప‌నేనా అనుకుని ఆమెని వెయ్యిక‌ళ్ళ‌తో కాప‌లాకాశాను. రెండో దుద్దు పెట్టెలో ఉన్న‌ద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. మొద‌టి దుద్దును కాజేసిన వారు రెండో దుద్దును కాజేస్తారా ?  చెయ్య‌రేమో ప‌ట్టుబ‌డ‌తామ‌ని భ‌యంచేత తీసుకోకుండా ఊరుకుంటారేమో ?  అనుకుంటున్నాను.

నాదృష్టి పెళ్ళిమీద లేదు. పెట్టెమీద ఉంది. ఇంత‌లో గ‌డ‌ప‌ద‌గ్గ‌రే కూర్చున్న ప్ర‌వీణ లోప‌లికి వెడుతోంది. వ‌ధూవ‌రులు జీల‌క‌ర్ర బెల్లం ఒక‌రి నెత్తిమీద ఒక‌రు పెట్టుకున్నారు. బాజాలు ఒక్క సారిగా మ్రోగాయి జ‌నం అక్షింత‌లు వేయ‌డానికి తొక్కిస‌లాడుతున్నారు.

ఆ సంద‌ట్లోనూ చిన్నూ పెట్టెను తీసే ప్ర‌య‌త్నాన్ని బీరువాకి ఎదురుగా ఉన్న అద్దంలోంచి ప‌సిగ‌ట్టాను. మారు తాళంతో పెట్టె ఈజీగానే వ‌చ్చింది. బ‌ట్ట‌ల‌న్నీ క్రిందా మీదా చేస్తోంది ఇంటిదొంగ‌. దుద్దు కోస‌మేనా అన్నాను నేను. లోప‌లికివ‌చ్చి వెంట‌నే త‌లుపేశాను. అదిరిపోయింది ప్ర‌వీణ. భేష్ ప్ర‌వీణా నువ్వు చోర‌క‌ళ‌లో కూడా ప్ర‌వీణురాలివేనా ?  ఈ సంగ‌తి నాకు తెలీదు అన్నాను పైకి నువ్వుతూ. కోసం భ‌గ‌భ‌గ‌లాడి పోయిందినాలో.

ప్ర‌వీణా ఆ దుద్దు కూడా నువ్వేతీశావు ఇచ్చెయ్యి మ‌ర్యాద‌గా. లేక‌పోతే పోలీసు రిపోర్టు ఇస్తాను. అని బెదిరించాను. ఎన్ని తిట్టినా బ్ర‌తిమాలినా బుజ్జ‌గించినా ప్ర‌వీణ ఒకేమాట మీద ఉంది.

ఆ దుద్దు నేను తియ్య‌లేదు. ఇప్పుడు నేను చిన్నూ పెట్టే కాటుక‌కోసం తీశాను అంది. కాటుక డ‌బ్బాకోసం మారు తాళాల‌తో ఎవ‌రైనా పెట్టే తీస్తారా ?  అంటే మాట్లాడ‌దు. వాళ్ళ‌మ్మ తిట్టింది. నాన్న‌గారు బెదిరించారు. అయినా ప్ర‌వీణ చెక్కు చెద‌ర‌లేదు. ఇంత గ‌జ‌దొంగా అని అనుకొన్న‌మే గాని పోలీసు రిపోర్టు ఇవ్వ‌డానికి మేం సిద్దంగా లేం. బందువుల్లో అల్ల‌రి అవుతుంద‌ని భ‌య‌ప‌డ్డాం.

ఆఖ‌రికి వాళ్ళ ఆమ్మే త‌న్ని నిజం చెప్పించింది. ఒక షాపులో ఐదువంద‌ల రూపాయ‌ల‌కు తాక‌ట్టు పెట్టింద‌ట‌. ఎంత తెలివి !  అంద‌రూ మ‌ర్చిపోయాక తాక‌ట్టు విడిపంచుకుంటుందిగాబోలు. చిన్నూ అదృష్ట‌వంతురాలు పోయిన సొమ్ము దొరికింది.

పెళ్ళిళ్ళ‌కు వెళ్ళేవారు ఖ‌రీదైన న‌గ‌లు పట్టుచీర‌లు ధ‌రించ‌కుండా ఎలా ?  అని ఉన్న‌దే పెళ్ళిళ్ళ‌ల్లో పార్టీల్లో ఎక్కిబిట్ చేసేందుకు క‌దా !  అయినా ప్ర‌వీణ‌నీ శేష‌మ‌త్త‌య్య నీ దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌గా ఉండండి !  ఇంటిదొంగ‌ను ఈశ్వ‌రుడు కూడా ప‌ట్ట‌లేడుట‌.