17
 

ఆచార్య‌దేవోభ‌వ !

- శ్రీ‌మ‌తి ఇ. అన‌సూయ‌

అమ్మ ఒడిలోంచి నేరుగా బ‌డిలోకి పోయే పాప‌ల‌ను ఈనాడు మిక్కుటంగా చూస్తున్నాం. పూర్వం ఐద‌వ ఏడు వ‌చ్చాక అక్ష‌రాభ్యాసం పేరుతో ఎంతో హ‌డావుడి చేసి సంద‌డి చేసిగాని పాఠ‌శాల‌కు పంపేవారు కాదు. ఇప్పుడు అలా చేయ‌టానికి వీలుగా ఉండ‌దు. త‌ల్లిదండ్రులిద్ద‌రు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్ల‌ల్ని ఒంట‌రిగా ఇంట్లో విడిచి వెళ్ళ‌డానికి వీలులేక రెండు ఏళ్ళు నిండగానే న‌ర్స‌రీ క్లాసుల్లో చేరుస్తున్నారు. ఈ కార‌ణం చేత‌నూ జనాభా ఎక్కువ‌వ‌డం చేత‌నూ కూడా  పేట‌కో స్కూలు వీధికో స్కూలు స‌రిపోడంలేదు. కొన్ని కొన్ని కాన్వెంట్స్‌లో వ‌ర‌క‌ట్నాల‌కు మ‌ల్లే డొనేష‌న్స్ పీడ హెచ్చుగా ఉంటుంది. పేరుని బ‌ట్టి తల్లి తండ్రుల క్రేజ్ కూడా పెచ్చు పెరిగి ఎన్ని వేల‌యినా అప్పో సొప్పో చేసి అలాంటి చోట్ల  చేర్పించ‌డం ఘ‌న‌కార్యంగా భావించేవారు కూడా ఎంద‌రో ఉన్నారు. కొన్ని కొన్ని కాన్వెంట్లు బాగానే ఉన్నా కొన్ని పై పై డాంబికాలే అని తేలిపోతాయి.

బాల‌బాలిక‌ల‌ని చ‌క్క‌ని పౌరులుగా తీర్చిదిద్దే పాఠ‌శాల‌. త‌ల్లి ప్ర‌థ‌మ గుర‌వు. త‌ల్లి త‌ర్వాత ఉపాధ్యాయుల‌దే ఎక్కువ బాధ్య‌త చిన్న త‌ర‌గ‌తుల్లో ఉపాధ్యాయులుగా ఎక్కువ శాతం స్త్రీలే క‌న్పిస్తుంటారు. ఇది ఇటు మ‌హిళ‌ల‌కి అటు విద్యార్థుల‌కీ కూడా మేలైన విష‌య‌మే. బోధ‌నా విష‌యంలో ఓర్పులో పిల్ల‌ల ఆగ‌డాన్ని త‌ట్టుకునే నేర్పులో స్త్రీల‌దే పైచేయి. పిల్ల‌ల్లో కూడా స్త్రీల ద‌గ్గ‌ర భ‌యం త‌క్కువ‌గా ఉండి చ‌దువుకునే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.


చ‌దువుకుని ఉద్యోగం చేయ‌ని వారికి ఓ స్కూలు న‌డిపితే బాగుండునేమో అన్న యోచ‌న క‌ల‌గ‌వచ్చు. స్కూలు న‌డ‌ప‌డం లాభ‌సాటి వ్యాపారంగా భావించ‌డం కూడా క‌ద్దు. పిల్ల‌ల‌కి విద్యాబుద్ధులు నేర్పాల‌నే స‌దుద్ధేశం ఉన్న‌వాళ్ళు అరుదే అయిన‌ప్ప‌టికీ అస‌లు లేకుండాపోరు అనే విష‌యాన్ని శ్రీ‌మ‌తి అన‌సూయ‌గారు నిరూపిస్తారు.

భాగ్య‌న‌గ‌రంలో చిక్క‌డ‌ప‌ల్లిలో వేంక‌టేశ్వ‌ర విద్యాల‌యం  గ‌త ప‌ద‌మూడు సంవ‌త్స‌రాలుగా శ్రీ‌మ‌తి అన‌సూయ గారి ఆధ్వ‌ర్యంలో ఆద‌ర్శ‌వంతంగా న‌డ‌ప‌బ‌డుతోంది. మొద‌ట ఐద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రారంభింప‌బ‌డింది. ఇప్పుడు ప‌ద‌వ‌త‌ర‌గ‌తి కూడా ప్రారంభించాల‌ని వారి ఆకాంక్ష !

 

 విద్యా సంస్థ‌ల‌ను న‌డ‌ప‌డంలోని సాధ‌క బాధ‌కాల‌ను గురించి ఆమెతో కూలంక‌షంగా చ‌ర్చించాను.

స‌మ‌స్య‌ల‌ను మూడు ర‌కాలుగా విభ‌జింప వ‌చ్చన్నారు శ్రీ‌మ‌తి అన‌సూయ‌. ఒక‌టి విద్యార్థుల‌వ‌ల్ల క‌లిగేది, రెండు ఉపాధ్యాయినుల‌వల్ల‌, మూడు విద్యార్థుల త‌ల్లిదండ్రుల వ‌ల్ల క‌లిగేది.

ఇంట్లో ఒక‌రిద్ద‌రు పిల్ల‌న్నే భ‌రించ‌లేక సెల‌వ‌లు వ‌చ్చినప్పుడు స్కూలు ఎప్పుడు తెరుస్తారు బాబూ అని బాధ‌ప‌డిపోతూ ఉంటారు. ఇంద‌రు పిల్ల‌ల్ని కంట్రోల్ చేయ‌డం ఎలా సాధ్య‌ప‌డుతుంది. అని ప్ర‌శ్నించాను.

స్కూలు వాతావ‌ర‌ణ‌మే వారిలో మార్పు క‌లుగ‌జేస్తుంది. ఇంట్లో ఉన్న స్వ‌తంత్రం స్కూల్లో ఉండ‌దు. అయిన ఆక‌తాయి పిల్ల‌లు ఏదో అల్ల‌రి చేయ‌య మాన‌రు. క్లాసులో అల్ల‌రి లేకుండా చూసే బాధ్య‌త ఆ క్లాసు టీచ‌ర్‌దే అన్నారు శ్రీ‌మ‌తి అన‌సూయ‌. ఒక్కో టీచ‌రు  ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇర‌వై ముప్పై మంది పిల్ల‌ల‌కంటే ఎక్కువ ఉంటే వారికి అటు చ‌దువూరాదు ఇటు క్ర‌మ‌శిక్ష‌ణా ఉండ‌దు అన్నారు సెక్ష‌న్‌కి న‌ల‌భై ఏభై వ‌ర‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించినా ఇర‌వై అయిదు మంది ఉండ‌ట‌మే ఐడియ‌ల్‌గా ఉంద‌న్నారు.

కొంద‌రు పిల్ల‌లు హోమ్ వ‌ర్క్ చేసుకురారు. కొడితే ఏడుస్తారు. కొట్ట‌క‌పోతే మ‌రింత స్వేచ్ఛ‌గా చ‌దువుకోకుండా తిరుగుతారు. ప‌రీక్ష‌ల స‌మ‌యంతో జీరోమార్కులు తెచ్చుకుంటారు. బాగా చ‌ద‌వ‌ని పిల్ల‌ల మూలంగా స్కూలుకే చెడ్డ‌పేరు వ‌స్తుంది. ఇక్క‌డ బాగా చెప్ప‌ర‌ని అందుక‌ని ప్ర‌తి విద్యార్థినీ సామ‌దాన భేద దండోపాయాల చేత చ‌దివించాల‌నే ఉపాధ్యాయినులు కృషి చేస్తారు అన్నారు.

పిల్ల‌ల‌ను దండిచండం త‌ప్పు కాదా అన్నాను. నిజంగా చాలా త‌ప్పు బెత్తం ఝ‌ళించాల్సిందేగాని  పిల్ల‌ల‌వంటి మీద అది ప‌డ‌కూడ‌దు. కొడ‌తారు అనే భ‌యం వాళ్ళ‌లో క‌ల్గించాలేగాని నిజంగా కొట్ట‌కూడ‌దు. ఒక్కొక్క మొండి విద్యార్థి ఎంత బ్ర‌తిమాలి బుజ్జ‌గించి భ‌య‌పెట్టి చెప్పినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఓర్పు కోల్పోయి ఒక్క‌టి వేయాల్సి రాక‌త‌ప్ప‌దు. ఏం చేసినా చ‌దివినా చ‌ద‌వ‌క పోయినా ఫ‌ర‌వాలేదు. టీచ‌ర్ ఏమీ అన‌దు అనే భావం పిల్ల‌ల్లో క‌లిగితే ఒక్క‌నాటికి వారు చెప్పిన పాఠం చ‌దువుకురారు. ట్రిస్ట్ టీచ‌ర్స్ అయితేనే మంచి ఫ‌లం (ఉత్తీర్ణ‌తలో) ఉంటుంద‌న్నారు.

పేరెంట్స్‌తో కూడా ప్రోబ్లెమ్స్ ఎదురౌతాయ‌న్నారు. ఎలాంటివి ? అన్న‌ప్పుడు. చాలా మందితో అస‌లు పేచీ ఉండ‌దు. కొంత‌మంది వాళ్ళ పిల్ల‌లు ఏం చేసినా టీచ‌ర్స్‌దే బాధ్య‌త అన్న‌ట్లుగా మాట్లాడ‌తారు. స్కూలు విడిచి పెట్టాక పిల్ల‌లు చేసే ప‌నుల‌కి మేము బాధ్య‌త వ‌హించ‌లే క‌దా !  కొంద‌రు ట్యూష‌న్స్ చెప్ప‌మ‌ని వేదిస్తారు. ట్యూష‌న్స్ వ‌ద్దు అంటే వాళ్ళ‌కి న‌చ్చ‌దు. స్కూలు అయ్యాక ఓ గంట‌సేపు పిల్ల‌ల్ని చ‌దివించే ఓర్పు వాళ్ళ‌కి ఉండ‌దు. కొంత‌మంది వాళ్ళ‌పిల్ల‌ల్ని కొట్టార‌ని, కారేజీలు, పెన్సిల్సు, పుస్త‌కాలు పోయామ‌ని యుద్ధానికి వ‌స్తారు. అక్క‌డికీ ఆయాలు వెయ్యిక‌ళ్ళ‌తో కనిపెడుతూ ఉన్నా ఇలాంటి ఇబ్బందులు రాక‌మాన‌వు అన్నారు. టి.వి.లు వ‌చ్చాక పిల్ల‌ల చ‌దువులో మార్పు ఏదైనా ఉందా అన్న ప్ర‌శ్న‌కు టి.వి ల వల్ల  చ‌దువుల‌కు కొద్దిగా గ్ర‌హ‌ణం ప‌ట్టిన మాట వాస్త‌వ‌మే క్రికెట్ మ్యాచ్ ప్ర‌సారం అయ్యెట‌ప్పుడు అటెండెన్స్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. శ‌ని ఆదివారాల‌లో హోమ్ వ‌ర్క్ చేయ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారి టీచ‌ర్స్ త‌క్కువ హోమ్‌వ‌ర్క్ ఇస్తున్నారు.

పాఠశాల నిర్వ‌హించ‌డానికి ముఖ్యంగా కావ‌ల్సింది ఓర్పు. ర‌క‌ర‌కాల వ్య‌క్తిత్వాలు గ‌ల విద్యార్థులు వారి త‌ల్లితండ్రులు వ‌చ్చి నిర్వాహ‌కుల‌ను ర‌క‌ర‌కాలుగా వేధిస్తూ ఉంటారు. అందరినీ నేర్పుగా ఓర్పుగా స‌మాధాన‌ప‌ర‌చ‌డం శాంతంగా స‌మ‌స్య‌ను అర్థం చేసుకోవ‌డం, అవ‌స‌ర‌మైన ల‌క్ష‌ణం. ఉపాధ్యాయినులు కూడా ఆమెలాగే శాంత స్వ‌భావులు అవ‌డం శ్రీ‌మ‌తి అన‌సూయ అదృష్టం. కాక‌పోతే ఇంకొక ఉద్యోగాలు వ‌చ్చో మ‌రేకార‌ణం చేత‌నో వెళ్ళిపోయే టీచ‌ర్స్ వల్ల స్కూల్లో కొంత అనిశ్చిత ఏర్ప‌డుతుంది. పిల్ల‌లు అల‌వాటుపడ్డ టీచ‌ర్ను ఒదులుకోడానికి ఇష్ట‌ప‌డ‌రు. ఇవి స‌మ‌స్య‌లైతే ప్ర‌యోజ‌నాల‌ను గురించి కూడ ఇలా చెప్పారు.

చిన్న పిల్ల‌ల‌కి చ‌దువు చెప్ప‌డం ఎంతో ఆనంద‌క‌ర‌మైన విష‌యం స్వ‌చ్ఛ‌మైన అమాయ‌క‌మైన హృద‌యంతో ఉన్న ప‌సివాళ్ళ‌తో మెలిగితే పూల‌తోట‌లో ఉన్న‌ట్లే ఉంటుంది. మ‌న‌కు చేత నైన విద్య‌ను నేర్ప‌డ‌మే కాకుండా ఇంత‌మంది బాల‌ల‌ను భావి పౌరులుగా తీర్చిదిద్దుతున్నామ‌నే భావం మ‌న‌స్సుకు స్థ‌యిర్యాన్నీ గ‌ర్వాన్నీ క‌లుగ‌జేస్తుంది.

ధ‌నం కోసం కాక స‌మాజంకోసం స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కోసంగాక నిస్స్వార్థ సేవ‌కోసం న‌డ‌ప‌బ‌డే విద్యాల‌యాలు దేవాల‌యాల‌కేమీ తీసిపోవు. అందుచేత‌నే నా దృష్టిలో గుడి క‌న్నా కూడా బ‌డికే ప్రాధాన్యం ఉంది అన్నారు. ఆచార్య దేవోభ‌వ అన్న మాటల‌కు అర్ధంగా శ్రీ‌మ‌తి అన‌సూయ‌గారు క‌న్పిస్తారు.