18
 

క‌లసి ప్ర‌యాణం

క‌లిసి ప్ర‌యాణం క‌లసి వినోదం అనే  పాట రేడియోలోంచి వ‌స్తోంది. అదే స‌మ‌యంలో బ‌య‌ట ఓ సాధువు ఏక తార వాయిస్తూ తత్వం పాడుతున్నాడు. జాగ్ర‌త్త‌గా వింటే పొట్ట కూటి కోసం వీధి వీధి తిరిగే ఈ సాధువులు పాడే పాటల్లో ఎన్నెన్నో గూడార్థాలుంటాయి. కొంద‌రు దొంగ సాధువులు మోసాలు చేసి ఎన్నో నీచ కార్యాలు చేస్తుంటారు. కానీ కొంద‌రు అచ్చ‌మైన తాత్వికులు కూడా లేకుండా పోలేదు. పిల్ల‌లంద‌రూ అత‌ని చుట్టూ చేరి అత‌నేమైనా మేజిక్కులు చేస్తాడేమోన‌నీ చూస్తున్నారు. అ పాట‌లోని భావం న‌న్నా క‌ట్టుకుని ఏవేవో ఆలోచ‌ల‌న్ని రేపింది. ఎడ‌నుండోచ్చావు ఒంటిగా వ‌చ్చావు ఒంటిగా పోతావు వెంటెవ‌రు రాబోరు సిల‌కా నీ వెంటెవ‌రు రాబోరు సిల‌కా.

నిజ‌మే ఎవ‌రిదారి వారిదే. శ‌రీరం నుండి ప్రాణం పోయాక ఆ శ‌రీరం ఇంక ఎందుకూ ప‌నికిరాదు. ఎంతెంత ప్రేమ‌లూ సంప‌ద‌లూ బంధాలూ, అనుబంధాలూ, కాంక్ష‌లూ అన్నీ అంత‌టితో స‌రి. గాలి గాలిలో మ‌ట్టి మ‌ట్టిలో క‌లిసి పోవాల్సిందే. పృథివ్యాప‌వాయురాకా శాది పంభూతాలు పంచ భూతాల్లో క‌లిసి పోవాల్సిందే.  ఇక మిగిలిందేమిటి ?  ఏమీ లేదు. అలాంట‌ప్పుడు ఎవ‌రైనా పోయిన వారి వెంట పోవ‌డం ఎట్లా ?  మ‌ళ్ళీ పుట్టి మ‌ళ్ళీ చచ్చి సంసార చ‌క్రంలో గిరాగిరా తిరిగేది ఏది ?  కేవ‌లం భావ‌న‌, ఆశ ! కోరిక ఈ కోరికే తిరిగి శ‌రీరాకృతి నొందుతోంది. ఈ కోరికనే జీవుడు అంటున్నాం. ఈ జీవుడికి శ‌రీరం ల‌భించే వ‌రు బంధాలు లేవు. త‌ల్లి తండ్రి భార్య అనే భావం అస‌లే ఉండ‌దు. శ‌రీరం ఉంటేనే మ‌న‌స్సు. మ‌న‌స్సు ఉంటేనే మ‌మ‌త. మ‌మ‌త మాటుగా సుఖ‌దుఃఖాలు దోబూచులాడుతుంటాయి. ఇవి మ‌న పూర్వీకులు మ‌న‌కు తెలియ చేసిన విష‌యాలు.

కానీ కొంద‌రు మూర్ఖులు ఈ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు. భ‌ర్త చ‌నిపోతే అత‌ని వెంట భార్య కూడా వెళ్ళాలంటున్నారు. ఎక్క‌డి దాకా వీళ్ళు తీసుకుపోగ‌ల‌రు ! కేవ‌లం కాటి వ‌రకే. బ‌ల‌వంతాన‌మండే చితిలోకి ప్రాణాల‌తో ఉన్న అమాయ‌కురాలిని తోసి నిండు  జీవితాన్నితోడేస్తున్నారు. ఇలాంటి వారు కిరాత‌కులు కాక‌మ‌రెవ‌రు ?  అన్న‌ట్లు కిరాత‌కులు త‌మ పొట్ట నింపుకోడం కోస‌మే జంతువుల్ని చంపుతారు. కానీ సంప్ర‌దాయం పేరుతో మూడాచారాల‌ను పాటించే కొంద‌రికి క‌లిసి వ‌చ్చేవి ఏదీ ఉండ‌దు.

భ‌ర్త చనిపోతే భార్య ఎందుకు చ‌నిపోవాలి ?   భ‌ర్త వెంట భార్య ప‌ర‌లోకాల‌కైనా స‌రే వెళ్ళాల్సిందేన‌ట ! ఇలా స్త్రీ స‌హగ‌మ‌నం చేసిన చోట నివ‌సించే వారంద‌రికీ స‌ర్వ‌శుభాలూ ఒన‌గూడుతాయ‌ట‌. ఆమెని త‌లుచ‌కొంటె జ‌బ్బులు త‌గ్గిపోతాయి. ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆమె చ‌ల్ల‌ని త‌ల్లి అంద‌ర్నీ చ‌ల్ల‌గా కాపాడుతుంద‌ట ఈ భావాలెంత నవ్వులాట‌గా ఉన్నాయో చూడండి మ‌న‌ని చ‌ల్ల‌గా చూడాల‌నే స్వార్థంతో ఒక అబ‌ల‌ని మంటల్లో వేసి మ‌ల‌మ‌లా మాడ్చ‌టం ఎంత ఘోరం ! ఎంత ఘూతుకం ! ఇంకొంద‌రికి ఘోరం ! ఎంత ఘూతుకం ! ఇంకొంద‌రికి ఆమె మ‌ర‌ణిస్తే ఆస్తి క‌ల్సివ‌స్తుంది గుడి క‌ట్టిస్తే రోజూ కాసులు రాల్తాయి. అందుక‌ని బ్ర‌తికుండగానే అగ్ని స‌మాధుల‌ను క‌ట్ట‌డం ఎంత హేయ‌మేన కార్యం ?  మహావీరుడు పుట్టిన దేశంలో, బుద్ధుడు పుట్టిన ఈ దేశంలో ఎన్నో ర‌కాలుగా హింస హెచ్చు పెరిగిపోతుందే ! ఏనాడో మాటు మ‌ణిగిన స‌తీస‌హ‌గ‌మ‌న దురాచారాన్ని పైకి లేవ‌నెత్తుతున్న మ‌తోన్మాధుల‌కి పూరి శంక‌రాచార్యుల వంటి మ‌ఠాధిపతులు, మ‌ఠాధిప‌తుల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం ఎంతైనా గ‌ర్హ్య‌నీయం. స్త్రీ జాతి స‌మ‌స్త‌మూ ఒక్క గొంతుతో త‌మ నిర‌స‌న తెలప‌వ‌ల్సిన విష‌యం క‌దూ ?  ఆలోచించండి హేతువాదంతో ఆలోచించండి.

అదికావ్య‌మైన రామాయ‌ణాన్ని తీసుకోండి. ద‌శ‌ర‌ధుడు చ‌నిపోగానే ముగ్గురు భార్య‌లూ మూడు వంద‌ల అర‌వై మంది భోగ ప‌త్నులూ చనిపోయారా ! వారు చ‌నిపోయాక రాముడు తార‌ను ఓదార్చిన విష‌యం ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకోండి. దేహం కోసం విల‌పిస్తున్నావా ఆత్మ‌కోసం విల‌పిస్తున్నావా ?  అన్నాడు. దేహం ఎప్ప‌టికైనా న‌శించేదే కాబ‌ట్టి దానికోసం విల‌పించ‌న‌క్క‌ర‌లేదు. ఆత్మ కోసం అయితే ఆత్మ శాశ్వ‌త‌మైన‌ది నాశ‌నం లేనిది అందుక‌ని ఆత్మ కోసం ఏడ‌వ‌న‌క్క‌ర‌లేదు అని చెప్తాడు రాముము. భ‌ర్త మ‌ర‌ణించాడ‌ని అనంత దుఃఖ‌సాగ‌రంలో కొట్టుకుపోయే భార్య‌కి ఇలాంటి హిత‌వ‌చ‌నాలు చెప్పి ఓరాల్చాలిగాని నువ్వూ అత‌నితో పాటే చ‌నిపో నిన్ను ప‌తివ్ర‌త చేసి పూజిస్తాం ఆన‌డం రాక్ష‌స‌త్వం అవుతుంది.

ఇంకో దృష్టాంతం చూడండి శంత‌నుడు చ‌నిపోయాక స‌త్య‌వ‌తి మ‌ర‌ణించ లేదు. పైగా ఆమె కురువంశం వృద్ధిపొందేందుకు ఎంతో చేసింది. కొడుకులు చ‌నిపోతే కోడ‌ళ్ళ‌ను ఆ చితి మంటల్లోకి తోయ‌లేదు. త‌న ఇంకో కుమారుటైన వ్యాసుని నియోగించి వారికి పుత్ర భిక్ష పెట్టించి వారికి జీవిత‌కు సాయ‌పడింది. స‌త్య‌వ‌తి గొప్ప రివ‌ల్యూష‌న‌రీయేకాదు గొప్ప మావ‌తావాది కూడా. కోడ‌ళ్ళ‌కి మ‌రో వ్య‌క్తి చేత సంతాన ప్రాప్తి చేయించి మ్రోడైన జీవితాల‌ను చిగురింప చేసింది. మ‌నువు, ఆప‌స్తంబ సూత్రుడు మొద‌లైన మ‌హార్షులు కూడా విగ‌త‌భ‌ర్తృక సంతానం కొర‌కు మ‌రొక వివాహం చేసి కొన‌వ‌చ్చున‌ని ధ‌ర్మం చెప్పారు.

పాండురాజు మ‌ర‌ణించాక అత‌నితోపాటు కుంతి మ‌ర‌ణించ‌లేదు. అయిదుగురు పిల్ల‌ల‌ను పొత్తిళ్ళ‌ల్లో పెట్టుకొని కాపాడి ధైర్యంగా జీవించింది. ఇక మాద్రి బేల‌మ‌న‌స్కురాలు. భ‌ర్త చ‌నిపోవ‌డానికి కార‌ణం త‌నే అనుకుంది. ఆ భావం ఆమె జీవించిన‌న్నాళ్ళూ, ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ఆమెఅది భ‌రించ‌లేక ఆమె చనిపోయింది.

ఆజ‌మ‌హారాజు ర‌ఘువంశ పురుషుడు. భార్య ఇందుమ‌తిని అమితంగా ప్రేమించాడు. ఆమెదీ అత‌నిదీ ఒక్క  జీవిక‌, ఒకే ప్రాణం, ఒకే భావం, ఆమె లేక అత‌డు లేడు. ఇందుమ‌తి చ‌నిపోయింద‌న్న వార్త విన‌గానే అజ‌మ‌హారాజు శ‌రీరం నుండి చిల‌క ఎగిరిపోయింది.  ఈ చిల‌క ఆ చిల‌క‌ని కల్సుకుందో ఎవ‌రి గ‌మ్యం వారిదో చెప్ప లేము గాని వారివురి అన్యోన్య ప్రేమ అంత ఘ‌న‌మైన‌ద‌ని మాత్రం చెప్పుకోగ‌ల‌ము.

ఇటీవ‌లి శ‌తాబ్ధంలో జ‌య‌దేవుడు ప్ర‌ఖ్యాత గీత గోవింద‌కారుడూ భార్య ప‌ద్మావ‌తిదీ కూడా అనుకూల దాంప‌త్యం. వీరి అన్యోన్య‌త‌ను ప‌రీక్షించాలి రాగి,  ప‌ద్మావ‌తికి జ‌య‌దేవుడు చ‌నిపోయాడ‌ని వార్త పంపిస్తుంది. భ‌ర్త మ‌ర‌ణించాడ‌నే మాట విన‌గానే ప‌ద్మావ‌తి విగ‌త‌భ‌ర్తృకే కాదు విగ‌త జీవిక కూడా అయ్యింది. జ‌య‌దేవుడు త‌న భ‌క్తితో తిరిగి స‌జీవురాలిని చేసుకున్నాడు.

వివాహ‌బంధం ఎంతో ప‌విత్ర‌మైన‌ది. భ‌ర్తని భార్య ప‌ద్మావ‌తిలా ప్రేమించాలి.  భార్య‌ని భ‌ర్త అజునిలా అనురాగంతో చూడ‌గ‌ల‌గాలి. కాని ఇది సాధ్య‌మా ?  ఎన్ని వంద‌ల సంవ‌త్స‌రాల చరిత్ర తిరిగేస్తే ఇలాంటి సంఘ‌ట‌న‌లు దొరుకుతాయి. ఎన్ని ల‌క్ష‌ల‌, కోట్ల దంప‌తుల‌లో ఇలాంటి పుణ్య దంప‌తులుంటారు ?  అంద‌రూ ఇలా ఉండ‌క పోయినా జీవించింనంత‌కాలం ప్ర‌శాంతంగా జీవించేలా ప్ర‌వ‌ర్తించాలి క‌దా ! భార్య‌కు భ‌ర్త‌, భ‌ర్త‌కు భార్య స‌ర్వ‌కాలాల్లోనూ తోడుగా నీడ‌గా ఉంటూ భ‌గ‌వంతుడిచ్చినంత ఆయుర్థాయాన్ని అనుభ‌వించాలి. మ‌ధ్య‌లో పండ‌ని కాయ‌ని త్రుప‌టం భ‌గ‌వ‌దేచ్ఛ‌కు వ్య‌తిరేక‌కార్య‌మే ! భ‌ర్త చ‌నిపోయాడ‌ని భార్య కూడా మ‌ర‌ణించాల‌నుకోవ‌డం శుద్ధ అవివేకం. ఆమెకు జీవితేచ్ఛ ఉండ‌క పోవ‌చ్చు గాక ! బ‌ల‌మ‌న్మ‌ర‌ణం పొందే అధికారం లేదు.

సృష్టి ధ‌ర్మాల‌కు వ్య‌తిరేకంగా ఆమె చ‌నిపోతే అది ఆత్మ‌హ‌త్యా, బ‌ల‌వంతంగా చితిలోకి మ‌రొక‌రు తోస్తే అది హ‌త్య‌. హ‌త్య‌ల‌నూ ఆత్మ‌హ‌త్య‌ల‌నూ చ‌ట్ట ప్ర‌కారంగా న్యాయ‌ప్ర‌కారంగా ఘ‌న‌కార్య‌మ‌ని పొగిడి మ‌రికొంద‌రు అమాయ‌కుల‌ను కూడా మ‌నం కూడా ఇలా చేస్తే బాగుండును అని అనిపించేలా ప్రోత్స‌హించ కూడ‌దు.