22
 

భా. బా. సం

గాఢ‌నిద్ర‌లో ఉన్నారు. ఏదో మంచి దృశ్యం జారిపోతోంది. మ‌న‌స్సుతో ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నంచేస్తున్న స‌మ‌యంలో  కాలింగ్‌బెల్ భీక‌రంగా మోగింది. హ‌ఠాత్తుగా నిద్ర‌లోంచి అందునా మంచిక‌ల‌లోంచీ ఇవ‌ల‌త‌కిప‌డ‌టంతో శ‌రీరం కంపించింది. టైమ్ చూస్తే ఐద‌య్యింది. ఎవ‌రబ్బా ?  పాల‌వాడు వ‌చ్చే వేళ‌గూడా కాదే !  అనుమానంగా బ‌య‌ట లైటువేసి మాగ్నిఫైయింగ్ గ్లాస్‌లోంచి చూశాను. ఎవ‌రో భారీ ఆకారం న‌ల్ల‌లాంగ్ కోట్‌లో ఉన్నాడు. టోపీ  నుదుటిమీద‌దాకా వచ్చింది. క‌ళ్ళ‌జోడు, గుబురుమీసాలు  ఆస‌లు పోలికే తెలియడం లేదు. చేతులు పేంట్ జేబులో పెట్టుకున్నాడు. నాకు కాళ్ళూ చేతులూ గ‌జ‌గ‌జ‌లాడిపోతున్నాయి. ఎంత‌కీ తలుపు తియ్య‌రేమిటా అని కాలింగ్‌బెల్‌ని మ‌ళ్ళీ నొక్కి అదేపనిగా ప్రెస్ చేస్తూ ఉండిపోయాడు. నాకు భ‌యం ఎక్కువై మావారిని లేపాను.

ఆయ‌న తలుపుతీస్తూనే ఓరినీ భాబాకా నువ్వుట్రా అంటూ అత‌ని వీపుమీద ఢామ్మ‌ని ఒక దెబ్బ వేశారు. హ‌మ్మ‌య్య ! తెలిసిన‌వాడ‌న్న‌మాట  అనుకుని నిట్టూర్చి లోప‌లికివ‌చ్చి మ‌ళ్ళీ ముసుగుతున్న‌బోతుంటే ఇదిగో, ఏమేవ్ కాఫీ తెస్తున్నావా అని  మావారు పొలికేక పెట్టారు. ఆ గొంతూ... ఆ గొంతులోని క‌ర్క‌శ‌త్వం... అదేమిటి ఆ పిలుపు ! ఏమేవ్ ఒసేవ్ అని ఎన్న‌డూ పిల‌వ‌లేదు. ఇవ్వాళ అన్నీ వింత‌గా ఉన్నాయ‌ని ఆశ్చ‌ర్య‌పోతూ లేవ‌బోతున్నాను. ఇంత‌లోనే మ‌ళ్ళీ ఇంకో పిడుగులాంటి కేక ! ఏమిటీ నేను పిలుస్తుంటే వినిపిస్తోందాలేక‌పోతే చెముడొచ్చిందా ఉల‌క‌వూ ప‌ల‌క‌వూ మావారి అరుపు మా కంచు మ‌ర‌చెంబును నేల‌మీద భ‌ళ్ళున ప‌గ‌ల‌గొట్టిన‌ట్టు వినిపించింది.

నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇంకా తెల్లార‌లేదు. ఇంట్లో ఏదైనా సీను సృష్టించాల‌ని చూస్తున్నారా ! క్ష‌ణం నా కొంగువ‌ద‌ల‌కుండా చిట్టి, బుజ్జీ అంటూ ముద్దు పేర్ల‌తో పిలుస్తూ మురిపెంగా చూసుకునే భ‌ర్త‌గా ముచ్చ‌టైన పేరు తెచ్చుకున్న మావారికేమ‌య్యింది ఇవాళ ?  ఇంత‌కీ ఆ భాబాకా ఎవ‌రు ?

ప‌ళ్ళు నూరుకుంటూ నా  కోపాన్ని ల‌లోప‌లేకుక్కేసి ఫ్రిజ్‌లోని పాల‌తో కాఫీచేసి తీసుకెళ్ళాను. భాబాకా నావైపు మిర్రిమిర్రి చూశాడు. మావారి అరుపుల‌క‌న్నా ఆక‌ళ్ళు మ‌రింత భ‌యంక‌రంగా ఉన్నాయి. న‌న్నెందుకంత కోపంగా చూస్తున్నాడో నాకర్థం అవ‌లేదు. ఆయ‌న మూడుగంట‌లు కూర్చున్నాడు అంత‌సేపూ మావారి ప్ర‌వ‌ర్త‌న వింతాతి వింత‌గా అరివీర‌భ‌యంక‌రంగాఉంది. ఆ చిట‌ప‌ట‌లూ ధుమ‌ధుమ‌లూ ఎలాభ‌రించానో నాకే తెలియ‌దు.నాలో ఇంత ఓర్పు ఉందా ?  అని న‌న్ను నేనే మెచ్చుకుంటున్నాను.

భాబాకా అటు వెళ్ళ‌గానే ఏమోయ్ రాణిగారూ ఇవాళ లంచ్‌లోకి ఏం స్పెష‌ల్ చేసి పెడ‌తారు అంటూ మావారు మామూలు ధోర‌ణిలో మాట్లాడుతూవ‌చ్చారు. నేను మాట్లాడ‌లేదు. మూతిబిగించుకుని కూర్చున్నాను. ప‌రాయి మ‌గ‌వాడిముందు నన్నంత హీన‌ప‌ర‌చినందుకు శాస్తిగా నేను మూడురోజులు వారితో మాట్లాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని రాసిచూపించాను. ప‌గ‌ల‌బ‌డిన‌వ్వుతూ స‌రే అలాగే మాట్లాడ‌కు. నేనిప్పుడే భాబాకా ద‌గ్గ‌ర‌కు వెళ్ళి న‌న్ను మీ సంఘంలో చేర్చుకోండి అని అప్లికేష‌న్ పెట్టివ‌స్తాను అన్నారు.

అప్లికేష‌న్ ఏమిటి ?  సంఘం ఏమిటి అని వింత‌గా చూశాను. ఇహ‌నుంచి న‌న్నుకూడా అంద‌రూ భాబారా అంటారు అన్నారు. భాబాకా అంటే ఏమిటి ఆశ్చ‌ర్యంగా అడిగాను నా మౌన‌వ్ర‌తం సంగ‌తి మ‌ర్చిపోయి.

భాబాకా న‌న్ను ఆలిండియా లీడ‌ర్‌ని చేస్తాన‌ని బ‌తిమాలాడు. నేను ఒప్పుకోలేదు అని నేను మ‌రింత ఆయోమ‌యంలోప‌డ‌టం చూసి చెప్పారు.. అస‌లు భాబాకా వ‌చ్చిందే వాళ్ళ సంఘంలో స‌భ్యుడిగా చేర్చుకోడానికి వాడిప్పుడు ఇండియా అంతా తిరుగుతున్నాడు జిల్లా స్థాయి క‌మిటీలు పెట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రెసిడెంట్‌ని, సెక్ర‌ట‌రీని నిర్ణ‌యించి ఎంత ఎక్కువ‌మంది మెంబ‌ర్స్‌ని ఎవ‌రు చేర్పిస్తే వాళ్ళ‌కు ఆలిండియాలెవెల్లో హోదాలు క‌ల్పిస్తాడుట కాని నేను వాడి క్లోజ్ ఫ్రెండ్‌ని కాబ‌ట్టి ఏనిబంధ‌నా లేకుండానే న‌న్ను ఆలిండియా సెక్ర‌ట‌రీగాకాని వైస్‌ప్రెసిడెంట్‌గా కాని చేస్తాడ‌ట !

ఇంత‌కీ భాబాకఅంటే భార్యాబాధితుడు కామేశ్వ‌ర‌రావు అని అర్థం. మాకామేశ్వ‌ర‌రావు భార్యాబాధితుల సంఘం పెట్టి పురుష సేవ చెయ్యాల‌నుకున్నాడు. మీ కామేశ్వ‌ర‌రావు భార్య బ్రతికుందా అని ప్ర‌శ్నించాను.

చూస్తూంటేనే మింగేస‌ట్లున్న‌ట్లుగా ఉంటుంది. ఇంక ఆ భ‌యంక‌రాకారరాన్ని చూసి ఏ అబ‌ల ప్రాణాల‌తో నిలుస్తుంది ?  భాబాకా ఇల్లువ‌దిలేసివచ్చాడు.

ఏం క‌థ‌లు చెప్తారండి ఇల్లు వ‌ద‌లి వ‌చ్చిన భాబాకాని రౌడీస్త్రీలు వెంట‌ప‌డి నానా అల్ల‌రి చేస్తుంటే పోలీసురిపోర్టు ఇచ్చాడు అనికూడా అంటారు.

నిజం నామాట న‌మ్ము. వాడ్ని నానా బాధ‌లు పెడ్తే భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకోబోయాడు వీడిలాంటి మ‌రో ఇంకోబాధితుడు ఓ కామేశం. మీ ఆవిడ తిడ్తుంటేనే నువ్వు  ఆత్మ‌హ‌త్య త‌ల‌పెట్టావ్ మ‌రి నాసంగ‌తేమిటి ?  మా ఆవిడ నామీద చెయ్యి కూడా చేసుకుంటుంది. నేను చ‌చ్చిపోయానా ?  భ‌రించ‌టంలేదూఅని  ఓదార్చాడుట‌. ఈ ఇద్ద‌ర్నీ చూసి వాళ్ళ ఆఫీస‌ర్ న‌వ్వి త‌ను మ‌రీ ఎంత ప‌ర‌మ‌శాంత‌స్వ‌భావుడో వీపుచూపించి నిరూపించుకున్నాట్ట‌. ఆ వీపంతా అట్ల‌కాడ వాత‌లూ గ‌రిట కాలేసి పెట్టిన గుర్తులూ చెంచా గుర్తులు ఉన్నాయ‌ట‌.

 అంతటివాడే భార్యా బాధితుడు అవ‌గాలేంది మ‌నం ఓ లెక్కా అని ఒక రొక్క‌రు వీపుత‌ట్టుకుని స‌మాధాన‌పడ్డారుట‌. ఈ ముగ్గురూకల్సి ఏర్పాటుచేసిందే ఈ భాబాసం అదిప్పుడు మూడు రాష్ట్రాలూ ఆరు జిల్లాలూ వ్యాపించింది. ఇంకా అన్ని రాష్ట్రాల‌కూ వ్యాపింప‌చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు అన్నారు.

నేను తెల్ల‌బోయాను. నోట‌మాట‌రాలేదు. మావారు చెబ్తూనే ఉన్నారు. ఓచోట నిద్ర‌పోతున్న భ‌ర్త‌నుభార్య న‌రికేసింది. మ‌రో చోట కిర‌స‌నాయిలు సోసి నిప్పంటించింది. ఓ భార్య‌భ‌ర్త చూస్తూండ‌గానే ప్రియుడిని ఆహ్వానించింద‌ట‌.ఒక భార్య స‌ర‌దాగా పుట్టింటికెళ్ళి మా వారు న‌న్ను క‌ట్నం తెమ్మ‌ని వేధిస్తున్నాడ‌ని రిపోర్టిచ్చింద‌ట‌. ఒక స్త్రీ మ‌రింత చొర‌వతీసుకుని నిద్ర మాత్ర‌లుమింగి త‌న భ‌ర్తే త‌న చావుకు కార‌ణం అని రాసిపెట్టి మ‌రీచ‌చ్చిపోయిందిట ఇలా ఇన్ని ర‌కాలుగా భార్య‌ల‌కే వేధింప‌బ‌డే భ‌ర్త‌లు కూడా సంఘటింత‌గా ఉండి. స‌మ‌స్య‌ను ధైర్యంగా ఎదుర్కోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారుట !

ఇంత‌కీ మీ భాబాకా ముందు నాతో ఎందుకు ప‌రుషంగా మాట్లాడారు అన్నాను. నా భార్య నేనెంత తిట్టినా నోరెత్త‌దు అన్నాను వాడు న‌మ్మ‌లేదు ఉట్టిది నువ్వు భ్ర‌మ‌ప‌డుతున్నావు. ఈ ఆడాళ్ళ‌ని నేను న‌మ్మ‌ను అన్నాడు. త‌న సంఘంలో చేర‌మ‌ని ప‌ట్టుప‌ట్టాడు. అత‌నికి న‌మ్మ‌కం క‌లిగించేందుకు న‌న్ను తిడ‌తారా ?  మ‌రేం చేయ‌ను చెప్పు ?

నాకు తెలుసు ఇదంతా మీ మ‌గవాళ్ళు ప‌న్నుతున్న ప్లాన్‌. ఇప్పుడిప్పుడే మా ఆడ‌వాళ్ళు ఓ సంఘంగా ఏర్ప‌డి మా సాధ‌క బాధ‌కాలు క‌ల‌బోసుకుంటుంటే మీ మ‌గాళ్ళు పోటీ సంఘం ఏర్పాటు చేస్తున్నారు. మ‌మ్మ‌ల్ని అప‌హాస్యంచేస్తున్నారు. ఆదినుంచీ ఈ అణ‌చివేత ఎన్నో రూపాలుగా వ‌స్తూనేఉంది. ఆమెకేంతెలుస‌నీ ?  ఆడ‌ది అణిగి ఉండాల‌నీ... ఆడ‌పెత్త‌న‌మ‌నీ చుల‌క‌న‌చేస్తూ మ‌మ్మ‌ల్ని అణ‌చివేస్తున్నారు. ఆ.ఆ.ఆ. ఆ.పై లేక‌పోతే నేనింకో కొత్త సంఘం ఏర్పాటు చేస్తాను. ర‌భాబాసం అని అన్నారు.
అంటే ?
ర‌చయిత్రి భార్యా బాధితుల సంఘం అని.
నేను తెల్ల‌బోయాను.